ఆమె అంబాసిడర్ కారులో తిరుగుతుంటే మహారాణిలా బతుకుతోందనుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు వరుసపెట్టి చేస్తుంటే లెక్కలేనన్ని కోట్లు పోగేసిందనుకున్నారు. బంగ్లాలు కొంటుంటే.. తరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించిందనుకున్నారు. వెండితెరపై నవ్వులు పూయిస్తుంటే తనకు ఏ కష్టాలూ లేకుండా హాయిగా బతుకుతోందనుకున్నారు. కానీ, కంటికి కనిపించేదంతా, చెవులకు వినిపించేదంతా నిజం కాదు! ఇంతకీ ఆ నటి ఎవరో కాదు గిరిజ..
తిరుగులేని హాస్య నటిగా..
బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ కమెడియన్ గిరిజ. మొదట్లో సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తర్వాత కమెడియన్‌గా రాణించింది. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టిన ఈమెకు ఆమె తల్లి, నటి దాసరి రామతిలకం అన్ని వేళలా తోడుంది. తల్లి దగ్గరి నుంచి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది గిరిజ. ఆమె ప్రోత్సాహంతో కమెడియన్ కస్తూరి శివరావు 'పరమానందయ్య శిష్యులు' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తర్వాత రేలంగికి జోడీగా నటించి తిరుగులేని హాస్యనటిగా కీర్తి పొందింది. పాతాళ భైవరిలో 'నరుడా ఏమి నీ కోరిక' అన్న ఒకే ఒక్క డైలాగుతో జనాలకు కనెక్ట్ అయిపోయింది. 'కాశీకి పోయాను రామాహరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామాహరీ..' ఈ పాట విన్నా గిరిజే గుర్తొస్తుంది.
గిరిజపై రేలంగి ప్రత్యేక శ్రద్ధ
ఆఫ్‌స్క్రీన్‌లో కూడా రేలంగి-గిరిజ సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ప్రచారం నడిచింది. రేలంగి ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పించేవాడు. తనకోసం కోసం ఓ ఇల్లు కూడా కొనిచ్చాడని చెబుతారు. 60వ దశకంలో కొత్త తారల రాకతో గిరిజకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగైదు మేడలు సంపాదించి దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసిరావు అనే వ్యక్తిని ఆమె తిరుపతిలో పెళ్లి చేసుకుంది. భర్త ఖాళీగా ఉంటే బాగోదని అతడి కోసం నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అదే గిరిజ చేసిన అతి పెద్ద తప్పు! భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోపోయింది. ఆర్థికంగా చితికిపోయింది.
పెళ్లయినప్పటి నుంచి కష్టాలే!
అటు భర్త మాత్రం తన దగ్గరున్న ఆస్తిని నీళ్లలా ఖర్చుచేసేవాడు. ఆమె కొనుక్కున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకునేవాడు కూడా! ఒకరోజు అతడు తన చేతికందిన వస్తువుతో కొట్టడంతో గిరిజ తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి. భార్యనే కాదు, కూతురిని కూడా దగ్గరకు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అంటూ దగ్గరకు వెళ్తే కాలితో తన్నేవాడు. భార్యాపిల్లల్ని ముప్పుతిప్పలు పెట్టిన అతడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాక ఒకరోజు ఉన్నట్లుండి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు. లంకంత ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బతికిన ఆమె తర్వాతి రోజుల్లో అప్పులపాలై తల్లి, కూతురితో కలిసి చెన్నైలో చిన్న గదిలోకి మారాల్సి వచ్చింది. చివరి రోజుల్లో కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది.
బస్టాప్‌లో విగతజీవిగా
ఆమె చివరి రోజులను కళ్లారా చూశానంటాడు డ్యాన్స్ మాస్టర్ సురేశ్ దాస. 'ఓరోజు గిరిజ చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మవాళ్లింటికి వచ్చి తలుపు తట్టింది. డోర్ తీసిన నేను ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమె తన పేరు గిరిజ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకై.. లోపలకి రమ్మని కూర్చోమన్నాను. ఎంతో వైభవంగా బతికిన ఆమెనేనా ఇలాంటి దీన అవతారంలో ఉందని బాధపడ్డాను. కష్టాల్లో ఉన్నానంటూ పెద్దమ్మను డబ్బులు అడిగి తీసుకుంది. రెండు నెలల తర్వాత ఇలాగే వచ్చి కొంత డబ్బు తీసుకుంది. ఇది జరిగిన వారం రోజులకే ఆమె ఇంటికి దగ్గర్లోని బస్టాప్‌లో చనిపోయి కనిపించింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించి దుబాయ్ వెళ్లిపోయింది. గిరిజ చివరి రోజుల్లో చాలా ఘోరమైన బతుకు బతికింది. తన పరిస్థితిని నేను కళ్లారా చూశాను' అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యాడు.
ఇండస్ట్రీ నుంచి పరామర్శించిందెవరంటే?
అయితే గిరిజ కూతురు శ్రీగంగ మాత్రం ఆమె ఇంట్లోనే మరణించిందని పేర్కొంది. దీంతో ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గిరిజ చనిపోయిన రోజు తనను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు. కానీ ఆ రోజు రాత్రి శోభన్‌బాబు ఫోన్ చేసి శ్రీగంగతో మాట్లాడారు. ఏ అవసరమున్నా తానున్నానంటూ అభయహస్తమిచ్చారు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీగంగ తర్వాతి కాలంలో తన పేరును సలీమాగా మార్చుకుంది. ఆమె తెలుగులో మేఘ సందేశం అనే సినిమా చేసింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసి అనంతరం రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment