ఆనందం.. భావోద్వేగం ‘సాక్షి’గా... | Sakshi Excellence Awards | Sakshi
Sakshi News home page

ఆనందం.. భావోద్వేగం ‘సాక్షి’గా...

Published Sun, Dec 17 2023 12:59 AM | Last Updated on Sun, Dec 17 2023 1:04 AM

Sakshi Excellence Awards

రోజా రమణికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్,వై.ఎస్‌. భారతీ రెడ్డి. చిత్రంలో రోజా రమణి భర్త చక్రపాణి

ప్రతిభను గుర్తించి ఇచ్చే అవార్డు ఎవరికైనా బోలెడంత ఆనందాన్నిస్తుంది. ఎక్సలెన్స్‌ని అభినందిస్తూ ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ పలువురు చిత్రరంగ ప్రతిభావంతులకు ‘సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డులు అందించినప్పుడు అవార్డు గ్రహీతల్లో ఆ ఆనందమే కనిపించింది. 

నవంబర్‌ 16న ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల వేడుక ఆనందం,భావోద్వేగాలతో సంబరంగా జరిగింది. ఆ వేడుక విశేషాలు ఈ విధంగా...

కైకాల లక్ష్మీనారాయణ, శ్యామలా దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్, వాడ్రేవు పద్మావతీ దేవి, వై.ఎస్‌. భారతీ రెడ్డి, స్రవంతి, ఆదిశేషగిరి రావు

 మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎందుకంటే నా తొలి చిత్రం ‘భక్త ప్రహ్లాద’ విడుదలై 55 ఏళ్లయిన సందర్భంగా ఈ పురస్కారాన్ని అందుకుంటున్నాను. కళలు, కళాకారుల పట్ల ‘సాక్షి’ ఎంతో ఔన్నత్యంతో వ్యవహరిస్తుందనడానికి ప్రతీక ఈ పురస్కారాలు. ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నందుకు నాకు దక్కిన ఈ గౌరవం నన్నెంతో సంతోషపరిచింది.  – ప్రముఖ నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రోజా రమణి (జీవన సాఫల్య పురస్కారం)

 నా భర్త మహేశ్‌ (మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ – ‘సర్కారువారి పాట’) గారి తరఫున ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. భారతిగారికి, ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డు గ్రూప్‌కి, జ్యూరీ మెంబర్స్‌కి థ్యాంక్స్‌. ఈ గుర్తింపు, గౌరవం ఇచ్చిన మా ఫ్యాన్స్‌కి కృతజ్ఞతలు. మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. – నమ్రతా శిరోద్కర్‌

 ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డులవేడుకకు నేను హాజరు కావడం ఇదే తొలిసారి. నైన్త్‌ ఎడిషన్‌ రన్‌ చేస్తున్నందుకు శుభాకాంక్షలు. భారతీ మేడమ్‌కి, ‘సాక్షి’కి ధన్యవాదాలు. ‘దిల్‌’ రాజు అన్నగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మోర్‌ స్పెషల్‌. – నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ (క్రిటికల్లీ అక్లైమ్డ్‌ మూవీ – ‘కార్తికేయ 2’) 

 ఈ అవార్డు గురించి మాట్లాడే ముందు నేను ఓ ఎమోషనల్‌ ఘటన గురించి చెబుతాను. ‘బెంగాల్‌ టైగర్‌’ సినిమా చేసిన తర్వాత నా చేతిలో సినిమాలు లేనప్పుడు, నేను ఆల్మోస్ట్‌ చివరి దశలో ఉన్నప్పుడు తిరిగి నన్ను ప్రథమ దశకు చేర్చిన నా హీరో, రవితేజగారికి ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ అవార్డుని నేను ఆయనకు అంకితం చేస్తున్నాను.

ఏం చేయాలో తెలియని ఓ దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నప్పుడు, ఇక జీవనం కొనసాగించడం చాలా దుర్లభమేమో అనే  స్థితిలో... నేను, నా ఫ్యామిలీ ఈ భూమి నుంచి, జనం నుంచి దూరం కావాలని.. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నటువంటి బాధాకరమైన ఘటన అది. ఆ తర్వాతి రోజు రవితేజగారు ఫోన్‌  చేసి, ‘ఎక్కడ ఉన్నావ్‌’ అన్నారు. ‘ఇంట్లో ఉన్నాను సార్‌’ అన్నాను. ‘వెళ్లి సినిమా చెయ్‌’ అన్నారు.

ఆ సినిమా పేరు ‘ధమాకా’. నేను, నా కుటుంబం ఈ రోజు సజీవంగా ఉన్నామంటే దానికి కారణం మాస్‌ మహారాజా రవితేజ సార్‌. ‘సాక్షి’ టీవీతో నాకు మంచి అనుబంధం ఉంది. ఎన్నో పాటలు రాశాను. జగన్‌మోహన్‌ రెడ్డిగారికి అంకితం చేశాను. అలా నన్ను ప్రోత్సహించినందుకు, జగన్‌ సార్‌కి, ‘సాక్షి’ మీడియాకి రుణపడి ఉన్నాను.  – భీమ్స్‌ (పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ – ‘ధమాకా’)

  ‘‘నాకు వచ్చిన తొలి అవార్డు ఇది. ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు. పాట తల్లి కొంగు పట్టుకుని వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చాను. నన్ను ఆదరించిన సినీరంగం, అభిమానించిన ప్రేక్షకులు, నాకు అవకాశాలిచ్చిప్రోత్సహించిన దర్శక–నిర్మాతలు, హీరోలు.. సంగీత దర్శకులు... అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ‘డీజే టిల్లు’లో నాకు పాట రాసే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు రామ్‌ మిరియాల, దర్శకుడు విమల్‌ కృష్ణ, హీరో సిద్ధు, నిర్మాతలు చినబాబు, వంశీగార్లకు కృతజ్ఞతలు. మరిన్ని మంచి పాటలు రాస్తాను. – కాసర్ల శ్యామ్‌ (మోస్ట్‌ పాపులర్‌ లిరిసిస్ట్‌ – ‘డీజే టిల్లు’ టైటిల్‌ సాంగ్‌)

 ఈ రోజు ఇంతమంది పెద్దల ముందు ‘సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్‌గారంటే నాకు చాలా అభిమానం. అలాంటిది శ్యామలాదేవిగారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మరింత సంతోషంగా ఉంది. ‘బింబిసార’లో ఈ పాట (నీతో ఉంటే చాలు... ) పాడే అవకాశం ఇచ్చిన సంగీత దర్శకుడు కీరవాణిగారికి థ్యాంక్స్‌. ‘సాక్షి’ అవార్డు నాకు చాలా స్ఫూర్తినిస్తుంది.. యాజమాన్యానికి ధన్యవాదాలు. – మోహనా భోగరాజు (మోస్ట్‌ పాపులర్‌ సింగర్‌)

 ఇది నా తొలి అవార్డు. నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని అవార్డులు గెలుచుకున్నా సరే.. ‘డీజే టిల్లు’, ఈ అవార్డు నాకు స్పెషల్‌. ఈ సినిమాను మేం కరోనా టైమ్‌లో చిత్రీకరించాం. చాలామంది వారి వ్యక్తిగత జీవితాలను పక్కనపెట్టారు. మానసికంగా కాస్త ఒత్తిడికి లోనైనా వంద శాతం ఎఫర్ట్స్‌ పెట్టారు. వాళ్లు ఆ విధంగా ఎఫర్ట్స్‌ పెట్టకపోయినట్లయితే ఈ అవార్డుతో నేను ఇప్పుడు ఇక్కడ నిల్చునేవాణ్ణి కాను.

వారందరికీ థ్యాంక్స్‌. ‘ఏంటి మీ అబ్బాయి పదేళ్లుగా ఖాళీగా ఉన్నాడా?’ అనే మా చుట్టుపక్కలవారి ప్రశ్నలను భరిస్తూ, నన్నుప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నేను ఈ కథను చెప్పినప్పుడు, ఈ కథను, నాలోని పిచ్చిని నమ్మి చాన్స్‌ ఇచ్చిన సిద్ధుకు, నిర్మాతలు చినబాబుగారు, వంశీ అన్న, ముఖ్యంగా త్రివిక్రమ్‌గారికి ధన్యవాదాలు. – విమల్‌కృష్ణ  (డెబ్యుడెంట్‌ డైరెక్టర్‌ – ‘డిజే టిల్లు)

 ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన ‘సాక్షి’ టీమ్‌కు ధన్యవాదాలు. నా కెరీర్‌లో తొలి సినిమా ‘రౌడీ బాయ్స్‌’ నాకు స్పెషల్‌ ఫిల్మ్‌.  రాజు (‘దిల్‌’ రాజు)గారికి థ్యాంక్స్‌. నా తొలి సినిమాకు దర్శకుడు హర్ష కొనుగంటి, అనుపమా పరమేశ్వరన్‌ చాలా సపోర్ట్‌ చేశారు. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ అన్న చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. – ఆశిష్‌ రెడ్డి  (డెబ్యుడెంట్‌ లీడ్‌ యాక్టర్‌ – ‘రౌడీ బాయ్స్‌’)

 ‘‘మా టీమ్‌ అందరికీ ‘మేజర్‌’ ఎమోషనల్‌ మూవీ. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో, రిలీజ్‌ సమయంలో ఎలాంటి ఎమోషన్‌తో ఉన్నామో.. ఇప్పుడూ అదే ఎమోషన్‌తో ఉన్నాం. గ్రేట్‌ సోల్జర్‌కు మేం చేయగలిగిన ట్రిబ్యూట్‌గా ఈ సినిమా చేశాం. మహేశ్‌బాబుగారు, నమ్రత మేడమ్, శరత్, అనురాగ్, సోనీ పిక్చర్స్‌కు ధన్యవాదాలు. ముఖ్యంగా నా స్నేహితుడు హీరో అడివి శేష్‌కు. వీరందరూ ‘మేజర్‌’ సినిమాకు నన్ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నందుకు ధన్యవాదాలు.  
– శశికిరణ్‌ తిక్క (క్రిటికల్లీ అక్లైమ్డ్‌ డైరెక్టర్‌ – ‘మేజర్‌’) 

 కృష్ణగారు ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ సినిమా చూసి, నన్ను ఇంటికి పిలిస్తే వెళ్లాను. ‘నీ సినిమా చూశానయ్యా.. బాగా చేశావ్‌. నువ్వు కూడా చాలా 
అందంగా ఉన్నావ్‌’ అన్నారు. ‘మీ అందం ముందు మాది ఎంత సార్‌.. మీరు సిమ్లా ఆపిల్‌లా ఉంటారు’ అని నేను అనగానే ఆయన మురిసిపోయారు. అలాంటి కృష్ణగారి తమ్ముడు ఆది శేషగిరిరావుగారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటానని అనుకోలేదు. భారతిగారికి, ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డ్స్‌కి థ్యాంక్స్‌. మా సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ అవార్డు నా ఒక్కడిదే కాదు.. నా టీమ్‌ అందరిదీ. – అలీ (పాపులర్‌ ఓటీటీ  ఫిల్మ్‌ – (‘అందరూ  బాగుండాలి..అందులో నేనుండాలి’)

 ‘‘ఇటీవలే ధనలక్ష్మీ (మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ తల్లి) గారితో ఓ గంట మాట్లాడాను. ఏంటి శేష్‌.. నెలకు ఒకసారే మాట్లాడుతున్నావ్‌.. రెండు నెలలకు ఒకసారే కలుస్తున్నావ్‌ అన్నారు. బెంగళూరుకు ఏదో ఒక బహుమతితో వస్తానమ్మా అన్నాను. ఈ ‘సాక్షి’ అవార్డు ఓ చక్కని బహుమతి. కొన్ని రోజుల్లో బెంగళూరు వెళ్తున్నాను. సందీప్‌ అమ్మగారికి ఈ అవార్డు ఇస్తాను. సందీప్‌ ఉన్నికృష్ణన్‌ చేసిన త్యాగానికి ఇదొక చిన్న అభినందనలాంటిది.

ఆయన దేశం కోసం చేసిన సేవలకు, త్యాగంతో దేశాన్ని నిలబెట్టిన దానికి నేను ఎప్పుడూ థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్‌గార్లకు ఫ్యాన్స్‌ ఎలా ఉంటారో.. అలా నేను సందీప్‌గారికి అభిమానిని. ఆయన మంచి మానవతావాది. నన్ను ఆశీర్వదించినందుకు థ్యాంక్యూ సార్‌.. జై హింద్‌. ‘మేజర్‌’కి నాకు అవకాశం కల్పించిన మహేశ్‌ సార్, నమ్రత మేడమ్‌లకు, ‘మేజర్‌’ను ్రపారంభించిన నిర్మాత అనురాగ్‌కు, ఈ జర్నీని నిజం చేసిన దర్శకుడు శశికి థ్యాంక్స్‌.  – అడివి శేష్‌ (జ్యూరీ స్పెషల్‌ అవార్డు – ‘మేజర్‌’)

 నన్ను ఈ వేడుకకు ఆహ్వానించినందుకు ‘సాక్షి’ టీమ్‌కు ధన్యవాదాలు. విజేతలకు  శుభాకాంక్షలు. రెండేళ్లుగా క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాను. క్యాన్సర్‌తో పోరాడాను. ఇప్పుడు నార్మల్‌గా ఉంది. ఈ వేదిక పై ఉండటం సంతోషంగా ఉంది. త్వరలోనే యాక్టింగ్‌ స్టార్ట్‌ చేస్తాను. కెమెరాపై నాకున్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. మా అమ్మగారి జ్ఞాపకార్థం ఇటీవలే నేను ‘యామిని క్యాన్సర్‌ ఫౌండేషన్‌’ను ఆరంభించాను. మహిళల ఆరోగ్యం, జెనెటిక్‌ కాన్సర్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తాం.  – నటి హంసానందిని 

 అవార్డ్స్‌ ఫంక్షన్స్‌లో గ్రహీతలు అవార్డులు తీసుకున్నప్పుడు ఎమోషనల్‌ స్పీచ్‌లు ఇస్తే.. దీనికి ఎందుకు ఇంత చేస్తున్నారు? అనుకునేదాన్ని. అలా అనుకున్నందుకు ఇప్పుడు గిల్ట్‌గా ఫీలవుతున్నాను. ఇప్పుడు ఇలా ఓ వేదికపై అవార్డు తీసుకుంటుంటే.. అవార్డులు ఎంత ప్రత్యేకమో తెలుస్తోంది. ఈ అవార్డుతో ‘మసూద’ సినిమాను నాకు మరింత స్పెషల్‌గా చేసిన ‘సాక్షి’కి, భారతి మేడమ్‌కి ధన్యవాదాలు. ‘గంగోత్రి’ సినిమా (చైల్డ్‌ ఆర్టిస్ట్‌) విడుదలై 20 ఏళ్లయింది. ఇప్పుడు బెస్ట్‌ డెబ్యుడెంట్‌ లీడ్‌ యాక్ట్రస్‌ అవార్డు తీసుకున్నాను. మా దర్శకుడు సాయికిరణ్, తిరువీర్, నిర్మాత రాహుల్‌గార్లు.. ఇలా టీమ్‌ అందరికీ «థ్యాంక్స్‌. ‘మసూద’కు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ మాకుప్రోత్సాహాన్నిచ్చింది. – కావ్యా కల్యాణ్‌రామ్‌ 

గడచిన ఏడాది నుంచి ఈ ఏడాది వరకూ తెలుగు సినిమా రంగం ఎందరో ప్రముఖులను కోల్పోయింది. కళాతపస్వి కె. విశ్వనాథ్, ప్రజానటి జమున, సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు, నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ, సీనియర్‌ నటులు శరత్‌బాబు, చంద్రమోహన్, చలపతిరావు, ఎం. బాలయ్య, ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న, నటుడు–నిర్మాత రమేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు వి. సాగర్, రచయిత కందికొండ... ఇలా ఎందరో. వీరి మృతికి సంతాప సూచకంగా మౌనం పాటించి, నివాళులు అర్పించింది ‘సాక్షి’. దివంగత ప్రముఖుల్లోని కొందరి కుటుంబ సభ్యులను ఆహ్వానించింది. ఈ ప్రత్యేక నివాళి కార్యక్రమంలో పాల్గొన్న వారి స్పందన...

 ఈ రోజు మాకు చాలా సంతోషకరమైన రోజు. ‘సాక్షి’ సంస్థకి, భారతిగారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాన్నగారితో పాటు ఇక్కడ వీడియోల్లో చాలా మంది పెద్దవాళ్లను చూపించారు. వారిని లేట్‌ (చనిపోయిన) అనలేం. వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉన్నారు. మీరు ఇచ్చిన ఈ గౌరవం,ప్రోత్సాహం, ప్రేమ, అభిమానానికి మా కుటుంబంలోని అందరం మళ్లీ మళ్లీ ‘సాక్షి’కి, భారతి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.
– కళాతపస్వి కె. విశ్వనాథ్‌ తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్‌

 ఈ అవార్డు కృష్ణగారిది. ‘సాక్షి’ యాజమాన్యానికి, ముఖ్యంగా భారతిగారికి, వారి టీమ్‌కి కృతజ్ఞతలు, అభినందనలు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ అవార్డుల్లో ప్రతి ఏడాది ఒక విశిష్టత కనిపిస్తుంటుంది. కేవలం సినిమా వాళ్లకే కాకుండా ఎన్నో రంగాల వారికి అవార్డులు ఇవ్వడం సంతోషం. నేను ఎన్నో అవార్డు వేడుకలు చూశాను కానీ, తొలి నుంచి ‘సాక్షి’లో వైవిధ్యం ఉంటుంది.. ఇందుకు హృదయపూర్వకంగా వారికి అభినందనలు. – సూపర్‌స్టార్‌ కృష్ణ సోదరుడు, నిర్మాత జి. ఆదిశేషగిరి రావు

 ఈ రోజు ‘సాక్షి’, భారతి గారు ఇంత అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేడుక నా మనసుకు బాగా దగ్గరైంది. ఈ ఏడాది సినీ రంగానికి చాలా పెద్ద నష్టం జరిగింది. అమ్మ కూడా ఈ ఏడాది దూరం అయిపోయారు. ‘నా కళ్ల ముందే ఇంతమంది వెళ్లిపోతున్నారు.. నా టైమ్‌ ఎప్పుడొస్తుందో’ అంటుండేవారు అమ్మ. అంతేకాదు.. అమ్మ మరో మాట కూడా అనేవారు. ‘ఒక ఆర్టిస్ట్‌కి మరణం ఎప్పుడూ ఉండదు.. తరతరాలుగా వాళ్లని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారు’ అని. ‘సాక్షి’ అవార్డు అనేది ఆమెకు నిజమైన నివాళి. థ్యాంక్యూ టు సాక్షి. – ప్రజానటి జమున కుమార్తె స్రవంతి

 ఐదేళ్లు వెనక్కి వెళితే.. కృష్ణంరాజుగారు, నేను ఇదే వేదికని అలంకరించాం. ఆయనకి భారతిగారు ‘సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డు ఇచ్చారు. అలాగే కృష్ణంరాజుగారి చేతుల మీదుగా రామ్‌చరణ్‌కి, మరికొందరికి అవార్డులు ఇప్పించారు భారతిగారు. ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేం. ఈ రోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నటీనటులకు మరణం లేదు.. ఎందుకంటే ఎంతోమంది అభిమానులను, వారసులను, కుటుంబ సభ్యులను సంపాదించుకున్నారు. వీళ్లందరిలోనూ వాళ్లు ఉంటారు. కృష్ణంరాజు, కృష్ణ, వైఎస్‌ రాజశేఖర రెడ్డిగార్లు... వీళ్లందరికీ మరణం లేదు.

అన్ని రంగాల్లో ఉన్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని సత్కరించడం భారతిగారి గొప్పతనం.. సంస్కారం. వైఎస్‌ రాజశేఖర రెడ్డి.. కృష్ణంరాజుగార్ల మధ్య ఎంతో అనుబంధం ఉంది. కృష్ణంరాజుగారి ఆశయాలు ఎన్నో ఉన్నాయి.. ఆయన వారసుడిగా వాటన్నింటినీ ముందుకు తీసుకెళతాడు మా ప్రభాస్‌. అలాగే కృష్ణగారి అబ్బాయి మహేశ్‌ బాబు కూడా ఎంతో మంది చిన్నారుల వైద్యానికి సాయం చేస్తున్నారు. ఇలా వాళ్ల వారసులు మనలోనే ఉన్నారు కాబట్టి వారికి మరణం లేదు. ‘ఒక పత్రికను నడపడం అంటే మామూలు విషయం కాదు.. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. అలాంటిది భారతిగారు చాలా సింపుల్‌గా ఉంటూ ఆ సంస్థని ఎంతో ముందుకు తీసుకెళ్లారు.. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి’ అంటుండేవారు కృష్ణంరాజుగారు. ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్లాలని భారతిగారిని కోరుతున్నాను. – రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి

 అందరికీ నమస్కారం. నాన్నగారికి ఈ అవార్డు ఇచ్చినందుకు భారతిగారికి, ‘సాక్షి’కి అభినందనలు తెలుపుకుంటున్నాను. – కైకాల సత్యనారాయణ తనయుడు కైకాల లక్ష్మీనారాయణ

 అందర్నీప్రోత్సహిస్తూ ఎన్నో ఏళ్లుగా అవార్డులు ఇస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి, ముఖ్యంగా భారతిగారికి ధన్యవాదాలు. కళాకారులైనా, సంఘ సేవకులైనా.. అవార్డులనేవి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఆనందాన్ని ప్రతి ఏడాది అందరికీ పంచుతున్న ‘సాక్షి’కి అభినందనలు.  – దర్శకుడు వీవీ వినాయక్‌


 విభిన్న రంగాలవారిని ఎంపిక చేసి, అవార్డులు ఇచ్చి,ప్రోత్సహిస్తున్నందుకు ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతిగారికి థ్యాంక్స్‌. ‘కశ్మీరీ ఫైల్స్‌’తో ఇండియా మొత్తం హల్‌చల్‌ చేసిన నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మా కంటే ఎంతో ముందున్నాడు. గ్రేట్‌ ఫిల్మ్‌ ‘మేజర్‌’. ఇండియా మొత్తం ‘మేజర్‌’ సినిమాను అప్రిషియేట్‌ చేశారు. వీరితో పాటు ఇంకా అవార్డు అందుకున్న అందరికీ  శుభాకాంక్షలు.  – నిర్మాత ‘దిల్‌’ రాజు 

 సాక్షి ఎక్సలెన్స్‌’ అవార్డ్స్‌ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు. – నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement