ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్‌రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. అంతా కచ్చా బాదం. ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్ల.. బూతు సీన్లు కూడా హీరో, హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరయినా అడిగితే .. ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్‌లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్‌రూమ్ సీన్లు.. ఇవన్నీ హాలీవుడ్‌ను తలపించేలా చేయడం సందీప్‌రెడ్డి సీక్రెట్‌గా మారింది. కథ, కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్‌రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే.. అంత రియాల్టీ అంటున్నాడు. తీసింది మూడు సినిమాలే అయినా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందీప్‌రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
అర్జున్‌రెడ్డితో సంచలనం
తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్‌లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు. అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్‌గా చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్‌రెడ్డి సినిమా చూస్తున్నంతసేపు..ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్‌గా చూపించినా.. కథంతా బోల్డ్‌గా నడిపించినా కంటికి అది అసహ్యంగా కనిపించదు.
హీరోకి కోపమొస్తే పచ్చి బూతులు తిడతాడు.. ప్రేమ పొంగుకొస్తే.. చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్‌వేర్‌లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్‌పై మనకు ప్రేమే కలుగుతుంది తప్పా ఎక్కడా నెగెటివ్ ఇంప్రెషన్ రాదు. అంతాలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ... ఆడియెన్స్ ను మెప్పించడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్‌గా బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి.. సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి రెండు సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ..అటు షాహిద్ కపూర్‌ల హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి.ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి.
‘యానిమల్’తో మరో ప్రయోగం
సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి.. ప్రారంభం ఇలా.. ఇక్కడ ఇంటర్వెల్.. క్లైమాక్స్ అలా అని కొన్ని పద్దతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా.. తండ్రి కొడుకుల ఎమోషన్‌ని బోల్డ్‌గా, వయోలెన్స్‌గా చూపిస్తూ..సినిమా ఇలా కూడా చెయ్యొచ్చు అని ‘యానిమల్’తో నిరూపించాడు సందీప్‌రెడ్డి. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ.. రూ. 1000 కోట్ల క‍్లబ్‌లోకి చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస‍్తవానికి ఈ కథ రొటీన్ రివేంజ్ డ్రామా.
ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం.. హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకొని సినిమా చూస్తే.. దర్శకుడు అంతర్లీనంగా చెప్పదలచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్‌రెడ్డి చెప్పాలనుకే పాయింట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టే.. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
వంగాపై బాలీవుడ్ ఫోకస్
యానిమల్ సినిమాతో మరోసారి తెలుగువాడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. ఇప్పుడీ సెన్సెషనల్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణ్‌బీర్ కపూర్ అయితే మరోసారి సందీప్‌తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్‌పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్‌కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్‌రెడ్డికి అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి.
అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమాను ప్రభాస్‌తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్‌ని కూడా ఖారారు చేశారు. ఆ చిత్రం తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేశ్‌బాబు, రామ్‌చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ సినిమా సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment