ఆత్మహత్య చేసుకున్న గిరిజ , సూసైడ్ నోట్
అమరాపురం: అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన గిరిజ అనే ఉపాధ్యాయురాలు తనుంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లిదండ్రులు విజయలక్ష్మి, క్రిష్ణయ్య, ఏఎస్‌ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన ఎ.గిరిజ (24) 2014 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)గా ఎంపికైంది. అమరాపురం మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ వచ్చింది. హేమావతి గ్రామంలో గది అద్దెకు తీసుకుని అక్కడి నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈమె తలనొప్పితో తీవ్రంగా బాధపడేది. దీనికితోడు చూపు మందగించడంతో ఇటీవల కంటి ఆపరేషన్ కూడా చేయించుకుంది. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది.
సోమవారం రాత్రి తల్లి విజయలక్ష్మి హేమావతి గ్రామానికి వచ్చింది. ఇంటి తలుపు తట్టగా లోపల కూతురు గిరిజ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. ఆందోళనకు గురైన ఆమె వెంటనే తన భర్త క్రిష్ణయ్యకు ఫోన్ ద్వారా సమాచారమందించింది. ఆయన వచ్చిన తర్వాత తలుపు తెరిచి చూస్తే ఇంటి పైకప్పునకు ఉరివేసుకుని వేలాడుతున్న గిరిజ కనిపించింది. ముగ్గురు కూతుర్లలో చివరిదైన గిరిజన ఇలా అర్ధంతరంగా తనువు చాలించడం చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో చనిపోతున్నట్లు ఉపాధ్యాయురాలు రాసిపెట్టుకుని ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. ఎంఈఓ సత్యనారాయణ మంగళవారం హేమా వతి గ్రామానికి వెళ్లి గిరిజ మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. దహన సంస్కారాల కోసం రూ.15వేల నగదు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment