అయ్యో.. గిరిజ!
- కళ్ల ఎదుటే బోరు బావిలో పడిన చిన్నారి
- ఆడుతూ.. పాడుతూ..అంతలోనే విషాదం!
- రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన
మంచాల: నాలుగేళ్ల చిన్నారి బోరుబావిలో పడిన విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో చోటు చేసుకుంది. గిరిజ అనే బాలిక ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. అమ్మమ్మ, చిన్నమ్మలు పొలం పనుల్లో ఉండగా...గిరిజ ఆడుకుంటూ ముందుకు వెళ్లి తెరిచి ఉన్న బోరు బావిలో పడిపోయింది. విషయం గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా...ఏసీపీ రాములు తన సిబ్బందితో హుటాహుటిన తరలివచ్చారు. జేసీబీలు సాయంతో బోరుచుట్టూ గుంతలు తవ్వారు. అయినా ఫలితం లేకపోయింది.
బోరు 320 అడుగుల లోతుండగా...చిన్నారి దాదాపు 45 అడుగుల లోతులో పడినట్లు గమనించారు. అక్కడ నీరున్నట్లుగా గుర్తించారు. రెండు జేసీబీలతో పనులు వేగవంతం కాకపోవడంతో మరో రెండు జేసీబీలను తీసుకువచ్చారు. పరిస్థితిని గమనించి ఉన్నతాధికారులతో మాట్లాడారు. పాపను రక్షించేందుకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్నం 1.15కు కలెక్టర్ శ్రీధర్‌తోపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చారు. దాదాపు రెండున్నర గంటలకుపైగా అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. బోరు బావిలోంచి పాపను కాపాడేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సాయంత్రం కావడంతో మరో రెండు హిటాచీలు తీసుకొని వచ్చి పనులు వేగవంతం చేశారు. సాయంత్రం ఆరు గంటలు గడిచినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బాలిక పరిస్థితి గురించి తెలియరాలేదు.