
ఈ పాటొస్తే మనకు అలనాటి నటి గిరిజ గుర్తుకొస్తారు. ‘కాశీకి పోయాను రామాహరే... గంగలో మునిగాను రామాహరే’ ఈ పాట విన్నా గిరిజే గుర్తుకొస్తారు. ‘సరదా సరదా సిగిరెట్టు’ పాట కూడా ఆమెదే కదా. మార్చి 3 ఆమె 83 వ జయంతి. తెలుగు ప్రేక్షకులు ఆమెను స్మరించుకునే రోజు. తెలుగులో తొలితరం కామెడీ స్టార్స్‌లో ఒకరుగా వెలిగారు గిరిజ. కృష్ణాజిల్లా కంకిపాడు నుంచి చెన్నై వెళ్లి రేలంగి ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ‘పాతాళభైరవి’లో ఆమె పలికిన ‘నరుడా... ఏమి నీ కోరికా’ పెద్ద హిట్ అయ్యింది.
ఆ తర్వాత అక్కినేని, శివాజీగణేశన్ వంటి హీరోల పక్కన నటించారు. అక్కినేనితో ఆమె పాడిన ‘హాయి హాయిగా జాబిల్లి’.. పాట నేటికీ హిట్. అయితే ఆమె కొద్ది కాలానికే కామెడీ స్టార్‌గా మారారు. ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’, ‘డాక్టర్ చక్రవర్తి’ తదితర సినిమాల్లో కీలకపాత్రలు పోషించారు. ఆ తర్వాతి రోజుల్లో ‘బలిపీఠం’, ‘సెక్రటరీ’, ‘పంతులమ్మ’ సినిమాల్లో వయసు మళ్లిన పాత్రలూ పోషించారు.
‘లవకుశ’లో కీలకమైన రజకుని భార్య వేషం కట్టారు. ‘ఒల్లనోరి మామా’ పాట జనాదరణ పొందింది అందులో. భర్త సన్యాసి రాజుతో కలిసి ‘భలే మాస్టారు’, ‘పవిత్ర హృదయాలు’ సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయారు. ఆమె కుమార్తె సలీమా మలయాళ సినిమా రంగంలో హీరోయిన్‌గా పని చేశారు. 1995లో మరణించిన గిరిజ తనదైన నటనతో తెలుగు వారికి గుర్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment