![Comedian Brahmanandam About MS Narayana Last Days](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/Comedian-Brahmanandam.jpg.webp?itok=3yKmeO7Z)
కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్యనటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాక్కులు-చవాక్కులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ (MS Narayana) ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్ బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది.
చివరి స్టేజీలో నాకోసం పరితపించాడు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం (Brahmanandam).. ఎమ్మెస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ మంచానపడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతోమంది తెలుసు. రక్తసంబంధాలు, స్నేహసంబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజీలో ఉన్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలనుకున్నాడు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/msnarayan.jpg)
చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా..
మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ.. అతడి కూతుర్ని పిలిచి తెల్లకాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా షూటింగ్‌లో ఉన్నాను. శంషాబాద్‌లో షూటింగ్.. సడన్‌గా నేను వెళ్లాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే? ఎలా అన్న సంకోచం.. అందుకే ఎవరికి చెప్పకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాను.
అదే ఆఖరి రోజు
నన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎమ్మెస్ నారాయణ కళ్ల వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్లు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదు, నా మిత్రుడిని బతికించండని డాక్టర్స్‌ను కోరాను.
ఇప్పటికీ మింగుడుపడదు
షూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకుని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్‌కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడుపడదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఎమ్మెస్ నారాయణ (63).. 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment