తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్‌లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్‌తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.
సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?
గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.
నాకు తెలుసు
అలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్‌గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి.
అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.
ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?
డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది.
చదవండి: సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment