
గిరిజ మృతదేహం వెలికితీత
ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం రాత్రి ముగిసింది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామ సమీపంలోని బోరుబావి నుంచి ఐదేళ్ల చిన్నారి గిరిజ మృతదేహాన్ని రాత్రి 8:15 నిమిషాల ప్రాంతంలో రెస్క్యూటీం బయటకు తీసింది. 56 గంటలపాటు గా కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం గిరిజ మృతదేహం బయటకు రాగలింది.
చిన్నారి మృతిని అధికారికంగా సోమవారం మధ్యాహ్నమే ధ్రువీకరించినా.. మృతదేహం వెలికితీతకు మరింత సమయం పట్టింది. 45 అడుగుల లోతులో కూరుకుపోయి న గిరిజ మృతదేహం ఉబ్బిపోవడం వెలికితీతకు అవరోధం అయింది. చివరకు గిరిజ మృతదేహాన్ని కేసింగ్ పైపుల ద్వారా లాగారు. 50 శాతం శరీర భాగాలను మాత్రమే వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.