చిన్నారి గిరిజ కుటుంబానికి అందని పరిహారం
50 రోజులు దాటినా నెరవేరని మహేందర్‌రెడ్డి హామీ
అధికారులు స్పందించడంలేదంటున్న కుటుంబ సభ్యులు
మంచాల: బోరుబావిలో పడి అసువులు బాసిన చిన్నారి గిరిజ కుటుంబానికి ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకుంటుందన్న మంత్రి మహేందర్‌రెడ్డి హామీ 50 రోజులు దాటినా ఆచరణకు మాత్రం నోచుకోవడంలేదు. పరిహారం విషయమై నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కానరావడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమను అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి మాట ఇచ్చి మరిచిపోయారా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. మంచాలకు చెందిన గిరిజ (4), ఆమె అన్న చరణ్‌లు చిన్నమ్మ, అమ్మమ్మతో కలిసి అక్టోబర్ 12న వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు.
పొలంలో కుటుంబ సభ్యులు పత్తి తీస్తుండగా గిరిజ ఆడుకుంటూ వెళ్లి సమీపంలోని బోరుబావిలో పడిపోయింది. దీంతో ఆ చిన్నారిని బయటికి తీసేందుకు అధికార యంత్రాంగం జేసీబీలు, హిటాచిల సహాయంతో మూడు రోజుల పాటు బోరు బావికి సమాంతరంగా తవ్వించారు. రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశరరెడ్డి, కలెక్టర్ శ్రీధర్, జేసీ ఎంవీ రెడ్డిలతో పాటు జిల్లా యంత్రాంగమంతా మూడు రోజులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి నిరాశే మిగిలింది.
గిరిజ ప్రాణాలు దక్కలేదు. మృతదేహాన్ని బోరుబావిలోంచి బయటకు తీశారు. దీంతో గిరిజ కుటుంబాన్ని ఆదుకుంటామని, పరిహారం అందజేస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాటిచ్చి 50 రోజులు దాటినా పరిహారం అందే జాడే కనిపించడంలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కలెక్టర్‌ను కలిస్తే జేసీని కలవమని, జేసీ దగ్గరకు వెళితే తహసీల్దార్‌ను కలవమని, తహసీల్దార్‌ను కలిస్తే మంత్రిని కలవాలంటూ తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ బాలరాజును వివరణ కోరగా.. మంత్రి మాట ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు.
మంత్రిగారూ.. మాట మరిచారా!
Published Tue, Dec 2 2014 11:36 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement