బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. దాదాపు మరో గంట సమయంలో మృతదేహాన్ని వెలికి తీస్తామని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
''బోరుకు సమాంతరంగా మేం ఒక సొరంగం తవ్వేందుకు ఏర్పాట్లు చేశాం. 41 అడుగుల దగ్గర రాయి వచ్చింది. దాన్ని పగలగొట్టాం. అందుకే ఆలస్యమైంది. పాప ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా 41 అడుగుల స్థాయిలోనే పాపను గుర్తించాం. ఖమ్మానికి చెందిన సింధూర ఎలక్ట్రానిక్స్ వాళ్లు అందించిన కెమెరాను ఉపయోగించాం. పాప మృతదేహం 45 అడుగుల లోతులో ఉంది. 41 అడుగుల ప్రాంతంలో ఉన్న సొరంగం ద్వారా కెమెరా పంపించి, మరోసారి నిర్ధారించుకుని పాపను పుల్ చేయాలి. అందుకు కావల్సిన హుక్లు తెప్పించాం. అయితే, అక్కడ పనిచేసేందుకు సరిపోయేంతగా ప్రదేశం లేదు. అక్కడ సొరంగం తవ్వడం కూడా చాలా కష్టం అవుతోంది. అందుకే ఎక్కువ సమయం పడుతోంది. బహుశా ఒక గంట సమయంలో పాప మృతదేహాన్ని బయటకు తీస్తామని భావిస్తున్నాం'' అని ఆయన తెలిపారు.