బోరు బావిలో చిన్నారి
* రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన
* కొనసాగుతున్న సహాయక చర్యలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పొలం గట్టుపైన కేరింతలు కొడుతున్న చిన్నారి ఒక్కసారిగా పెను ప్రమాదంలో చిక్కుకుంది. అన్నయ్యతో కలసి ఆడుకుంటున్న ఆ పసిపాప అకస్మాత్తుగా ఆపద అంచున పడిపోయింది. బోరుబావి రూపంలో వచ్చిన విపత్తు చిన్నారిని లాగేసుకుంది. లోతుగా ఉన్న ఆ బావిలో చిన్నారి జాడ తెలియకపోవడంతో రంగంలోకి దిగిన అధికార బృందాలు సహాయక చర్యలు వేగిరం చేశాయి. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆదివారం ఉదయం 10.30కు చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇబ్రహీంపట్నం మండలం ఎం.పి.పటేల్‌గూడకు చెందిన గడుసు ఐలయ్య, సరితలకు చరణ్(6), గిరిజ(4) ఇద్దరు పిల్లలున్నారు. ఏడాదిన్నర క్రితం కుటుంబ కలహాలతో సరిత ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు మంచాల మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంటివద్దే ఉంటున్నారు. స్థానిక వివేకానంద పాఠశాలలో ఈ పిల్లలు చదువుతున్నారు. సెలవు కావడంతో ఆదివారం ఉదయం అమ్మమ్మ, తాత (మల్గ ఐలమ్మ, నాగయ్య)లతో కలసి పొలానికి వెళ్లారు.
అమ్మమ్మ, తాతలు పత్తి తీసే పనిలో బిజీ కావడంతో వారు గట్టు పక్కన ఆడుకుంటున్నారు. ఇంతలో అటుగా ఉన్న మూతలేని బోరుబావివైపు వెళ్లిన గిరిజ అందులో పడిపోయింది. దీంతో గిరిజ సోదరుడు చరణ్ విషయాన్ని అమ్మమ్మ, తాతలకు వివరించడంతో హుటాహుటిన కూలీలతో కలసి వారు బోరుబావి వద్దకు చేరుకున్నారు. కానీ జాడ తెలియకపోవడంతో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
320 అడుగుల లోతైన బోరుబావి
మల్గ నాగయ్య సోదరుడు బాషయ్య వ్యవసాయ పనుల కోసం బోరు వేయించాడు. 320 అడుగుల లోతువరకు బోరు వేసినా నీరు పడక ఆ బోరును వదిలేశారు. రక్షణగా ముళ్ల కంచె వేయగా వారం క్రితం టమాటా నారు వేసేందుకు దుక్కి దున్నే క్రమంలో దాన్ని తొలగించారు. తర్వాత కంచె వేయడం మరిచిపోవడంతో ఆదివారం ఉదయం అటుగా వచ్చిన గిరిజ అందులో పడిపోయింది.
నాలుగు బుల్డోజర్లు, రెండు పొక్లెయిన్లతో..
విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా రెండుమీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టారు. ఇందుకోసం 4 బుల్డోజర్లను తెప్పించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు. పది ఫీట్లలోతు తర్వాత బుల్డోజర్లతో తవ్వకం కష్టం కావడంతో అధికారులు అదనంగా మరో రెండు పొక్లెయిన్లను తెప్పించి తవ్వకాన్ని ముమ్మరం చేశారు. సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగినా గిరిజ జాడ తెలియలేదు. దీంతో రాత్రివేళ కూడా సహాయక చర్యలను కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి
బోరుబావిలో బాలిక చిక్కుకున్న వార్త తెలియడంతో మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యం.కిషన్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. గిరిజ ప్రాణాలతోనే తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.