మా అమ్మపై ఇన్ని పుకార్లా | Actress Girija Daughter Saleema Interview | Sakshi
Sakshi News home page

మా అమ్మపై ఇన్ని పుకార్లా

Published Fri, Jul 12 2019 9:47 AM | Last Updated on Fri, Jul 12 2019 2:00 PM

Actress Girija Daughter Saleema Interview - Sakshi

‘నరుడా ఏమి నీ కోరిక’ డైలాగ్‌ ఆమెదే. ‘సరదా సరదా సిగిరెట్టు ఇది దొరల్‌ తాగు బలె సిగిరెట్టు’ అని రేలంగి సరదా పడితే ‘కంపుకొట్టు ఈ సిగిరెట్టు కాల్చకోయి నా పై ఒట్టు’ అని కసురుకుంది ఆమే. ‘ఆరాధన’ సినిమాలో అక్కినేనిని, సావిత్రిని తీవ్ర ఇక్కట్లకు తోసింది ఆమె కపటత్వమే. ‘లవకుశ’లో రాముడి వేషం కట్టిన ఎన్టీఆర్‌కు సీతమ్మ వేషం కట్టిన అంజలీ పై మనసు విరిగిపోవడానికి కారణమైన రజకుని భార్య వేషం ఆమెదే. గిరిజ బ్లాక్‌ అండ్‌ వైట్‌ జమానాలో తెలుగు వారి కామెడీ స్టార్‌. రేలంగికి సరిజోడి. సెకండ్‌ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా గిరిజ స్టార్‌డమ్‌ను చూసింది. ‘వెలుగు నీడలు’, ‘జగదేకవీరుని కథ’, ‘ఆత్మబంధువు’, ‘నమ్మినబంటు’, ‘కులగోత్రాలు’, ‘ప్రేమించి చూడు’, ‘భార్యాభర్తలు’... ఎన్నో సినిమాలు ఆమె నటనకు ఆనవాలుగా నిలిచి ఉన్నాయి.

వెండితెరపై ఒక వెలుగు వెలిగిన గిరిజ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ వివరాలు తెలియదు. సోషల్‌ మీడియా వాడుకలోకి వచ్చాక గిరిజపై ఆధారాలు లేని కథనాలు ఎన్నో అప్‌లోడ్‌ అవుతున్నాయి. తెలుగువారికి ఎంతో ఇష్టమైన ఈ నటి గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి ‘సాక్షి’ చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇది. తెలుగువారికి దాదాపుగా తెలియని గిరిజ కుమార్తె, నటి సలీమా మొదటిసారిగా చెన్నై నుంచి ఇలా సాక్షి ద్వారా తెలుగు పాఠకులతో మాట్లాడారు. ఆ వివరాలు.

సాక్షి: గిరిజగారు ఎప్పుడు చనిపోయారు?
సలీమా: సెప్టెంబర్‌ 5, 1995న చనిపోయారు. ఆమెకు డయాబెటిస్‌. కాని అదేం పెద్ద సమస్యగా ఉండేది కాదు. అపోలోలో డాక్టర్‌ సత్యమూర్తి చూసేవారు. ఆ రోజు అమ్మ టీ తాగి స్నానానికని బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. కాని బయటకు వచ్చి మంచం మీద వాలిపోయి ప్రాణం విడిచింది. ఆమెకు శ్వాసకు సంబంధించిన తీవ్ర ఇబ్బంది వచ్చిందని డాక్టర్లు చెప్పారు.

సాక్షి: గిరిజ మరణించినట్టు పేపర్లలో వార్త వచ్చిందా?
సలీమా: నాకు గుర్తు లేదు. ఎవరూ రాసినట్టు లేదు. ఇండస్ట్రీవాళ్లు కూడా ఎవరూ వచ్చి చూడలేదు. అమ్మ చనిపోయిన రోజు అంతిమ సంస్కారాలు ముగిశాక – నాకు టైమ్‌ కూడా బాగా గుర్తు– రాత్రి 8.45కు శోభన్‌బాబు ఫోన్‌ చేశారు. నేను శోభన్‌బాబుని... అమ్మ చనిపోయినట్టు తెలిసింది... బాధపడకు... తెలుగు పరిశ్రమ ఎప్పుడూ నీకు తోడు ఉంటుంది.. ఏ కష్టం వచ్చినా రా అన్నారు. ఆయనొక్కరు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య గారు వచ్చి వెళ్లారు. అంతే.

సాక్షి: మీ అమ్మ చాలా దీనావస్థలో మరణించారని, నిరుపేద స్థితిలో మరణించారని ఇక్కడ వార్తలున్నాయి.
సలీమా: అది తెలుగు జర్నలిస్టుల ఊహాశక్తి అనుకుంటున్నాను. మా అమ్మ చనిపోయే సమయంలో టి.నగర్‌లోని మందిర అపార్ట్‌మెంట్స్‌లో మేం ఉన్నాం. అది నేను కొన్న నా సొంత ఫ్లాట్‌. ఆ అపార్ట్‌మెంట్స్‌లోనే దర్శకుడు కె.మురళీమోహనరావు, రాజ్‌ కోటీలలోని రాజ్, హీరోయిన్‌ రంజిత ఉండేవాళ్లు. మీరు వాళ్లను కూడా అడిగి కన్ఫర్మ్‌ చేసుకోవచ్చు.

సాక్షి: మీ అమ్మమ్మ నటి తిలకం మీ అమ్మ మద్రాసు వచ్చిన మూడేళ్లకే మరణించడం వల్ల మీ అమ్మకు సరైన దిశానిర్దేశం లేకుండా పోయిందని ఇక్కడ ప్రచారం.
సలీమా: ఎవరు ఇవన్నీ రాస్తున్నది? మా అమ్మమ్మ తిలకం ఫిబ్రవరి 24, 1995న మరణించారు. ఆమె చనిపోయిన ఆర్నెల్లకు అమ్మ పోయింది. మా నాన్న మమ్మల్ని వదిలిపోయాక మా అమ్మమ్మ, అమ్మ, నేను ఒక గూటి పక్షులుగా పెరిగాం. మా అమ్మమ్మ లేకపోతే మా అమ్మ, నేను ఏమయ్యేవారమో చెప్పలేము. మా అమ్మమ్మకు చిన్న వయసులోనే పెళ్లవడం వల్ల అమ్మ, అమ్మమ్మ అక్కాచెల్లెళ్లలా ఉండేవారు. ఇద్దరూ ఒకే సమయంలో చనిపోయారు.

సాక్షి: మీ నాన్న సన్యాసిరాజుగారి వివరాలు చెబుతారా?
సలీమా: నాకు ఆయన గురించి ఎటువంటి ఆసక్తి లేదండీ.

సాక్షి: మీకు గుర్తున్నవి?
సలీమా: నాకు గుర్తున్నంత మటుకు ఆయన మా అమ్మను బాగా హింసించేవాడు. నేను చాలా చిన్నపిల్లను. కాని అంత చిన్నవయసులో కూడా మా అమ్మ సఫరింగ్‌ తెలిసేది. మా అమ్మకు ఆయనను ఎవరు పరిచయం చేశారో తెలియదు. కాని తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చారు. ఆయన ఖర్చు చేసిన ప్రతి రూపాయి మా అమ్మదే. ఆయనకు పెద్ద గ్యాంగ్‌ ఉండేది. మా అమ్మకు ఉన్న నీలిరంగు అంబాసిడర్‌ కారులో వాళ్లతో అర్ధరాత్రి వరకు తిరిగి, తాగి వచ్చేవాడు. మరుసటిరోజు కారు డ్రైవర్‌ వచ్చి ఆయన కారులో వాంతి చేసుకుంటున్నాడని గోల పెట్టేవాడు. ఒకసారి ఆయన ఏ వస్తువుతోటో మా అమ్మను తల మీద మోదితే పద్నాలుగు కుట్లు పడ్డాయి. నేనొకసారి పరిగెత్తుకుంటూ ‘డాడీ’ అని వెళితే కాలితో తన్నాడు. దొర్లి కింద పడ్డాను. ఆ తర్వాత ఆయన వైపు వెళ్లింది లేదు. ఆయన మంచి భర్త కాదు. మంచి తండ్రి కాదు. ‘నేను ఈ పెళ్లి చేసుకోకపోతే చాలా బాగుండేదాన్ని. వివాహంలో స్త్రీకి సరైన పురుషుడు దొరక్కపోతే ఆమె జీవితం సగం దెబ్బ తిన్నట్టే’ అని మా అమ్మ అనేది.

సాక్షి: మీ నాన్న రెండు సినిమాలు తీశారు కదా.
సలీమా: అవును. రెంటిలోనూ ఎన్టీఆరే హీరో. ఒకటి ‘భలే మాస్టారు’. రెండు ‘పవిత్ర హృదయాలు’. అందులో ఒక్కరూపాయి కూడా నాన్నది లేదు. అన్నీ అమ్మవే. చాలా గ్యారంటీ సైన్‌లూ అవీ అమ్మే చేసింది. సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. అప్పుల బాధ పెరిగింది. ఒకరోజు పొద్దున నాన్న ఇప్పుడే వస్తానని వెళ్లి మళ్లీ కనిపించలేదు. మా ముఖం ఎప్పటికీ చూడలేదు. అమ్మమ్మ, అమ్మ, నేను... స్ట్రగుల్‌ అయ్యాం వాస్తవమే కాని పత్రికలు సానుభూతి కథనాలు రాసే స్థాయి కాదు.

సాక్షి: మీ పేరు సలీమా అని ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. మీరు మతం మారారా?
సలీమా: లేదండీ. మా అమ్మ కలకత్తా కాళేశ్వరి దేవి భక్తురాలు. అక్కడకు వెళ్లి మొక్కుకుని వచ్చాక నేను పుట్టానని ఇంట్లో కాళమ్మ అని పిలిచేవారు. కాని ఆ తర్వాత అమ్మకు మౌంట్‌రోడ్‌లో ఉండే దర్గాపై గురి కుదిరింది. ఆ దర్గా ఇప్పటికీ ఉంది. రోడ్డు వైడెనింగ్‌లో ఆ దర్గాను తొలగించాలని ప్రయత్నించినవారు రక్తం కక్కుకు చచ్చారని కథనాలు ఉన్నాయి. అంత పవర్‌ఫుల్‌. ఆ దర్గావారు నాకు ఇచ్చిన పేరు సలీమా. నా అధికారిక పేరు, రికార్డ్స్‌లో ఉన్న పేరు సలీమాయే. కాని నాకు మత పట్టింపు లేదు. గుళ్లకు, చర్చిలకు, దర్గాలకు వెళతాను.

సాక్షి: మీరు ఏం చదివారు?
సలీమా: ఇంటీరియర్‌ డెకరేషన్‌లో డిప్లమా చేశాను. కాని ఆ రంగంవైపు వెళ్లలేదు. అమ్మ ఇన్‌ఫ్లూయెన్స్‌ నా మీద ఉంది. చిన్నప్పుడే అమ్మ చీరలు కట్టడానికి ట్రై చేసేదాన్ని (నవ్వు).  నాకు టీనేజ్‌ రాగానే మోడలింగ్‌వైపు అవకాశాలు వచ్చాయి. అప్పట్లో టెక్స్‌టైల్‌ యాడ్స్‌ ఫేమస్‌. సుమంగళి టెక్స్‌టైల్స్, మహరాణి టెక్స్‌టైల్స్‌.. ఇలా దాదాపు 150 యాడ్స్‌ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు కోరితే ‘మేఘసందేశం’ క్లయిమాక్స్‌లో ఆయన కూతురిగా యాక్ట్‌ చేశాను. ఆ సమయంలోనే అనుకోకుండా ఒక మలయాళ సినిమా మేనేజర్‌ నన్ను చూసి మలయాళంలో యాక్ట్‌ చేస్తారా అన్నారు. సరే అన్నాను. అలా టి.చంద్రకుమార్‌ దర్శకత్వంలో ‘నిజన్‌ పిరన్నా నట్టిల్‌’ (1985)లో నటించాను. మోహన్‌లాల్‌ హీరో. అయితే దానివల్ల గుర్తింపు రాలేదు. నటి కాంచనమ్మ రికమండేషన్‌తో ప్రఖ్యాత దర్శకుడు హరిహరన్‌ దర్శకత్వంలో ‘నఖక్షతంగళ్‌’ (1986)లో నటించాను. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఇప్పటికీ నన్ను ఆ సినిమా హీరోయిన్‌గా అక్కడ గుర్తిస్తారు.

సాక్షి: మరి హీరోయిన్‌గా ఎందుకు కొనసాగలేకపోయారు?
సలీమా: మలయాళంలో నాలుగేళ్లలో 7 సినిమాలలో నటించాను. ‘సంసారం ఒక చదరంగం’ కన్నడ వర్షెన్‌లో కల్పన రోల్‌ నేనే వేశాను. కాని ఆ తర్వాత నేను చెన్నైలో రియల్‌ ఎస్టేట్‌ వైపు వెళ్లిపోయాను. లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు మలయాళం, తమిళ సినిమాలలో యాక్ట్‌ చేస్తున్నాను. మొన్న అంజలీ నటించిన ‘లీసా’లో చాలా మంచి రోల్‌ చేశాను. తెలుగులో అది రిలీజైంది.

సాక్షి: మీరు మలయాళంలో చేస్తున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రాలేదా?
సలీమా: తెలుగు పరిశ్రమతో మాకు పెద్దగా కాంటాక్ట్‌ లేకపోవడం వల్ల ఏమీ రాలేదు.

సాక్షి: గిరిజగారికి ఫీల్డ్‌లో ఎవరు ఫ్రెండ్స్‌ ఉండేవారు?
సలీమా: సావిత్రిగారు మంచి ఫ్రెండ్‌. ఏ మాత్రం ఖాళీ ఉన్నా మా ఇంటికి వచ్చేవారు. ఆమెకు మా అమ్మమ్మ వంటలు ఇష్టం. నా తొలి బేబీ సైకిల్‌ ఆమే కొనిపెట్టారు. అమ్మమ్మ అప్పుడప్పుడు రేలంగి గారింటికి తీసుకువెళ్లేది. వాళ్ల భార్య శ్రీదేవమ్మ, కొడుకు బాబుగారు, కోడలు కుమారి గారు వీరు తెలుసు. అమ్మమ్మ చాలాసార్లు నాగేశ్వరరావు గారి గురించి చెప్పేది. సెట్‌లో కనపడితే మేకప్‌ కుర్చీలో కూర్చోబెట్టి ‘గుడివాడ తిలకమ్మ గుడిలోకి వచ్చింది’ అని పాడుతూ గిర్రున తిప్పేవారట. ఇద్దరిదీ ఒకే ప్రాంతం కావడంతో ఆయన చాలా అభిమానంగా ఉండేవారు. ఇక ఇండస్ట్రీ ఫంక్షన్స్‌ అంటే చిరంజీవి గారి పెళ్లికి అమ్మతో కలిసి వెళ్లిన జ్ఞాపకం ఉంది.

సాక్షి: గిరిజగారు ఎప్పడైనా తన నట జీవిత విశేషాలు చెప్పేవారా?
సలీమా: పెద్దగా లేదు. ఆమె తన వివాహ రోజులను, సినిమా రోజులను మర్చిపోయి జీవించాలి అన్నట్టుగా ఆమెను నేను చూసుకున్నాను. కాని అప్పడప్పుడు ఆమె నటించిన పాట ‘కాశీకి పోయాను రామా హరే’ పాడి ఆట పట్టించేదాన్ని. నిజం చెప్పాలంటే ఆమె పాటల్లో నాకు నాగేశ్వరరావుతో కలిసి నటించిన ‘హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి’ చాలా ఇష్టం.

సాక్షి: రేలంగి గారు గిరిజగారు చాలా సన్నిహితంగా ఉండేవారని... కాని గిరిజ గారు ఆయనతో అనుబంధం తిరస్కరించారనీ...
సలీమా: దాని గురించి నాకు తెలియదు. నా చిన్నప్పుడు అదంతా జరిగిందేమో తెలియదు.

సాక్షి: మీరు సింగిల్‌గా ఉండటానికి మీ తల్లిగారి విఫల వివాహ ప్రభావం కారణమా?
సలీమా: అలా ఏం లేదు. జీవితంలో మంచి అవకాశాలే వచ్చాయి కానీ పెళ్లి చేసుకోబుద్ధి కాలేదు. నేను మగ ద్వేషిని కాను. నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పటికైతే పెళ్లి చేసుకోలేదు. మునుముందు చేసుకుంటానేమో తెలియదు. నాకు డాన్స్‌ వచ్చు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. డ్రైవింగ్‌ చాలా ఇష్టం. జీవితం నాకు నచ్చినట్టుగా ఉంది.

సాక్షి: తెలుగు ఇండస్ట్రీకి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
సలీమా: నేను గిరిజమ్మ కూతురుని. మా అమ్మ ఎన్నో తెలుగు సినిమాలు చేసింది. తెలుగు ఇండస్ట్రీ మీద నాకు హక్కు ఉంది. మా అమ్మ అక్కినేనితో పని చేసింది. వారబ్బాయి నాగార్జున ఫీల్డ్‌లో ఉన్నారు. ఎన్‌.టి.ఆర్‌తో పని చేసింది. వారబ్బాయి బాలకృష్ణ ఉన్నారు. వీరందరూ నాకూ ఇక్కడ స్థానం కల్పించాలని కోరిక. మంచి అవకాశాలు వస్తే హైదరాబాద్‌ షిఫ్ట్‌ అవ్వాలని ఉంది. నేను జీవితంలో చాలా రంగాల్లో పని చేశాను. కాని మేకప్‌ వేసుకొని కెమెరా ముందు నిలిచినప్పుడు పొందే ఆనందం మరెక్కడా పొందలేదు. ఒక నటి కూతురికి అనువంశికంగా వచ్చే సంపదా, ఆస్తి అదేనేమో.
∙ఖదీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement