స్పిన్నింగ్ చుట్టూ చిక్కుముళ్లు!!
♦ పత్తి ధర రికార్డు స్థాయికి; పతనమైన యార్న్ ధర
♦ స్పిన్నింగ్ మిల్లుకు రోజుకు రూ. 3- 5 లక్షల నష్టం
♦ కేంద్రం, ఏపీ సబ్సిడీ బకాయిలు రూ.1,500 కోట్లు
♦ తొలుత ఉత్పత్తి తగ్గింపు; పరిస్థితి మారకుంటే మూసివేతే!!
♦ ప్రశ్నార్థకంగా 8 లక్షల మంది భవిష్యత్తు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్పిన్నింగ్స్ మిల్లుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఒకవైపు పత్తి ధరలు భారీగా పెరగటం... మరోవైపు యార్న్ ధరలు బాగా తగ్గిపోతుండటంతో మిల్లులు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. 110 స్పిన్నింగ్ మిల్లులు... 35 లక్షల స్పిండిల్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఏపీలో గడిచిన ఏడాది కాలంలో 3 మిల్లుల మూతపడ్డాయి. పరిస్థితిలానే ఉంటే ఇంకో 20 మిల్లులు మూతపడి కార్మికులు రోడ్డున పడతారని యాజమాన్యాలు వాపోతున్నాయి.
సరిగ్గా మూడు నెలల క్రితం పత్తి క్యాండీ (356 కిలోలు) ధర రూ.37,000. ఒక దశలో రూ.50,000 మార్కును తాకి ఇప్పుడు రూ.47,000 పలుకుతోంది. మరోవంక ఉత్పత్తి చేసిన యార్న్ ధర కేజీ రూ.210 నుంచి రూ.170కి పడిపోయింది. గతంలో కేజీ పత్తి ధర రూ.110గా ఉన్నప్పుడు యార్న్ ధర రూ.210 ఉండేదని, ఇప్పుడు పత్తి ధర రూ.130కు పెరిగితే యార్న్ ధర రూ.160-170కి తగ్గిపోయిందని స్పిన్నింగ్ మిల్లు యజమాని సుధాకర్ చౌదరి వాపోయారు. చైనా కొనుగోళ్లు ఆపేయడం యార్న్ ధరలు తగ్గిపోవడానికి ప్రధానకారణమన్నారు. అయితే రాష్ట్రంలో పత్తికి తీవ్ర కొరత రావడమే ధరలు పెరగడానికి కారణమని ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ చైర్మన్ ధర్మతేజ చెప్పారు.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వ్యవహారశైలే ఈ కొరతకు కారణమన్నారాయన. ‘‘కొన్ని విదేశీ కంపెనీల తరఫున సీసీఐ కొనుగోళ్లు చేయడంతో స్థానిక మిల్లులకు పత్తి లేకుండా పోయింది. పెరిగిన ముడిపదార్థాల ధరలతో మిల్లుకు రోజుకు రూ.3 నుంచి 5 లక్షల వరకు నష్టం వస్తోంది. క్యాండీ ధర రూ.40,000 దిగువకు వస్తే కానీ మిల్లులు ఆర్థికంగా నిలబడలేవు’’ అని ధర్మతేజ వివరించారు. రాష్ట్రంలో పప్పుధాన్యల దిగుబడిని పెంచడానికి పత్తిసాగును ప్రభుత్వం నిరుత్సాహపరచటం కూడా పత్తి ధరలు పెరగటానికి కారణమని మిల్లులు వాపోతున్నాయి.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే మిల్లులు మూతపడి మూడు లక్షల మందికి ప్రత్యక్షంగాను, 5 లక్షల మంది పరోక్షంగాను ఉపాధి కోల్పోయే అవకాశాలున్నాయని అవి చెబుతున్నాయి. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రంలో మూడు మిల్లులు మూత పడినట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి అజయ్ టంటా ప్రకటించారు.
పేరుకుపోతున్న సబ్సిడీ బకాయిలు: పత్తి ధరలకు తోడు విద్యుత్ చార్జీలూ పెరిగాయి. ప్రభుత్వ సబ్సిడీలు విడుదల కావటం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా యూనిట్ విద్యుత్ ధర రూ. 10 ఉంది. యూనిట్‌కు రూ.2 సబ్సిడీ ఇవ్వడానికి ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపినప్పటికీ ఇంత వరకు ఉత్తర్వులు రాలేదు. త్వరలో విడుదల కావొచ్చని ఆంధ్రా చాంబర్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పొట్లూరి భాస్కరరావు చెప్పారు. మరోవంక కేంద్రం, ఏపీ ప్రభుత్వాల నుంచి సబ్సిడీల రూపంలో రావాల్సిన రూ.1,500 కోట్లు రాలేదు. ఈ ఏడాది విద్యుత్ సబ్సిడీ కింద రూ.1,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... మొదటి విడత కింద రూ.270 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంత వరకు ఉత్తర్వులు రాలేదని ధర్మతేజ వాపోయారు. అలాగే టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ కింద కేంద్రం నుంచి రూ. 500 కోట్లు బకాయిలు అలానే ఉన్నాయన్నారు.
నేడు అత్యవసర సమావేశం
భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను చర్చించేందుకు బుధవారం అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే వారంలో ఒక రోజు మిల్లులకు సెలవు ప్రకటించామని, కాని పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం జరుపుతున్నట్లు ధర్మతేజ తెలిపారు. కార్మికులను దృష్టిలో పెట్టుకొని పూర్తిగా మూసివేయకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. కనీసం 25 నుంచి 30 శాతం వరకు తగ్గించే అవకాశాన్ని ఈ సమావేశంలో పరిశీలించనున్నట్లు తెలిపారు.