యాలాల, న్యూస్‌లైన్: రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసిన ఓ స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం నకిలీ నోట్లు పంపిణీ చేసిందంటూ సోమవారం యాలాల మండలంలో వదంతులు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకుని విచారించి.. అవి నకిలీవి కాదని, అసలువేనని తేల్చేశారు. పోలీసులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రాంక్రిష్ణారెడ్డికి చెందిన లారీలో సుమారు 70 క్వింటాళ్ల పత్తిని యాలాల మండల పరిధిలోని దౌలాపూర్ సమీపంలోని ఓ స్పిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చారు. తూకం అయ్యాక సుమారు రూ. మూడు లక్షల 80వేల నగదును లారీ డ్రైవర్ రాములుకు మిల్లు ప్రతినిధులు అందజేశారు. అయితే ఇచ్చిన నగదులో రూ.500నోట్లపై డ్రైవర్‌కు అనుమానం కలిగింది.
నోట్లు నకిలీ కావచ్చుననే అనుమానాన్ని మిల్లు ప్రతినిధులకు తెలియజేశాడు. దీంతో మిల్లు ప్రతినిధులు అనుమానం ఉన్న రూ.500నోట్లు(రూ.58వేల 500)లను తీసుకొని, చెక్కు రూపంలో మిగితా డబ్బులను చెల్లిస్తామని డ్రైవర్‌కు చెప్పారు. ఈ విషయాన్ని లారీ డ్రైవర్ తన యజమానికి ఫోన్‌లో తెలియజేశాడు. అయితే నకిలీ నోట్లు కావడంతోనే మిల్లు యజమానులు వెనక్కి తీసుకొని ఉండవచ్చుననే అనుమానంతోపాటు స్పిన్నింగ్ మిల్లుకు వచ్చిన పలువురు రైతులు మిల్లులో నకిలీ నోట్లను అందజేస్తున్నారనే అభిప్రాయాలను కొందరు రైతులు వ్యక్తం చేశారు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న యాలాల ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి సిబ్బందితో మిల్లు వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనా స్థలానికి డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ రవిలు రాత్రి 9 గంటలకు మిల్లు వద్దకు చేరుకుని విచారణ జరిపారు. మిల్లు యజమానులు మాత్రం ప్రతిరోజు తాము ఓ బ్యాంకు నుంచి నగదును తీసుకువచ్చి, రైతులకు చెల్లింపులు చేస్తామని డీఎస్పీకి వివరణ ఇచ్చారు.
సోమవారం కూడా అదే బ్యాంకు నుంచి రూ.40లక్షలు డ్రా చేసి, పత్తి కొనుగోలు చేసిన రైతులకు పంపిణీ చేశామన్నారు. అయితే రైతులకు పంపిణీ చేయగా మిగిలిన రూ.18లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ నోట్లు లేవని నిర్ధారించారు. లారీ డ్రైవర్ పొరపాటు వల్లే ఈ వ్యవహారం కలకలం రేపిందని పోలీసులు వెల్లడించారు.
నకిలీ కావు.. అసలు నోట్లే!
Published Mon, Jan 20 2014 11:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement