duplicate currency
-
నోట్ల మార్పిడిపై 23 కేసులు
పార్లమెంటరీ కమిటీ భేటీలో డీజీపీ అనురాగ్ శర్మ సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో పార్లమెంటరీ కమిటీతో డీజీపీ బృందం సమావేశమైంది. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో కేసుల నమోదు, నకిలీ కరెన్సీ కేసులు తదితర అంశాలపై చర్చించడంతో పాటుగా ఓ నివేదికనూ పార్లమెంట్ కమిటీకి అందించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో పాటు సీఐడీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు విభాగాలతో భేటీ: కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపై రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించింది. మైనారిటీ వ్యవహారాలకు సంబంధించిన పథకాలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్థిక శాఖ, పలు విభాగాలతో భేటీ అయ్యింది. నోట్ల రద్దు తర్వాత సమస్యలపై బ్యాంకు యాజమాన్యాలతో కమిటీ సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది. -
నకిలీ రెండు వేల రూపాయల నోటు కలకలం
మహబూబాబాద్ : కొత్త రెండు వేల రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చి నాలుగు రోజులు కూడా గడవక ముందే నకిలీ నోట్లు సామాన్యులను దడ పుట్టిస్తున్నాయి. పెద్దనోట్లు మార్చుకోవడానికి ప్రజలంతా బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు బారులు తీరుతుంటే.. సందట్లో సడేమియాలాగా కొందరు నకిలీ నోట్లను చలామణిలోకి తీసుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని ఓ పెట్రోల్ బంక్‌లో ఆదివారం పెట్రోల్ నింపించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి నకిలీ రెండు వేల రూపాయల నోటు ఇచ్చాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది అప్రమత్తమయ్యే లోపే దుండగుడు అక్కడి నుంచి ఉడాయించాడు. నకిలీ నోట్ల చలామణిపై వ్యాపారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విదేశీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
కాకినాడలో 8 మంది అరెస్టు చలామణిలో లేని టర్కీ దేశ 5 లక్షల లిరాసినోట్లు 99 స్వాధీనం కాకినాడ సిటీ : చలామణిలో లేని విదేశీ కరెన్సీతో మోసగించి డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టురట్టయ్యింది. కాకినాడ కోకిలా సెంటర్ సమీపంలోని జేఎంఎస్ సీఎన్ఆర్ అపార్ట్మెంట్లో ఈ ముఠా ఉన్నట్టు సమాచారం అందడంతో టూ టౌన్ పోలీసులు దాడిచేసి అక్కడ ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి టర్కీ దేశానికి చెందిన ఐదు లక్షల లిరాసి నోట్లు 99 స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు శనివారం టూ టౌన్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో తెలియ జేశారు. 2009–10లో టర్కీలో సంభవించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఐదు లక్షల లిరాసి నోట్లను నిషేధించారు. అవి ప్రస్తుతం చలామణిలో లేవని డీఎస్పీ తెలిపారు. అయితే ఆనోట్లను మోసపూరితంగా అమ్మడానికి ముఠా ప్రయత్నించిందన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల లిరాసి నోట్లు 99 స్వాధీనం చేసుకున్నామన్నారు. భారతదేశ రూపాయల్లో చూస్తే వాటి విలువ సుమారు రూ.108 కోట్ల 90 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన పట్నం శంకర్, తోలేటి ప్రకాష్, డేగల శ్రీరామకృష్ణ, నెల్లూరుకు చెందిన కుదిరి విజయభాస్కరరావు, కాకినాడకు చెందిన మిరియం లక్ష్మీనారాయణ, వాడపర్తి వెంకటేష్, రాజోలుకు చెందిన రేఖపల్లి సురేష్, రాజమండ్రికి చెందిన రాయుడు సత్యనారాయణలను కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ఈ ముఠాతో పాటు ఇంకా కొంత మంది ఉన్నట్టు తెలిసిందని, ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీఐలు చైతన్యకృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు. -
నకిలీ నోట్లపై సమరం
రంగంలోకి భారత్-బంగ్లా టాస్క్‌ఫోర్స్ ఢిల్లీలో మూడు రోజుల పాటు భేటీ సరిహద్దుల్లో ‘రూట్ బ్లాక్’కు వ్యూహం పాక్ నుంచి బంగ్లాకు ‘నకిలీ’ రవాణా బంగ్లా నుంచి మాల్దా ద్వారా దేశంలోకి అక్కడి నుంచి చేపల లారీల్లో ఏపీకి సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తున్న నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. ఓవైపు.. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన రూ. 500, రూ. 1,000 నోట్లు సహా.. కరెన్సీ నోట్లన్నిటినీ మార్పిడి చేసుకోవాల్సిందిగా ప్రకటించింది. మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ అధికారులతో సంయుక్తంగా ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ‘రూట్ బ్లాక్’ చేయాలని నిర్ణయించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో సమావేశమై.. నకిలీ కరెన్సీ భారత్‌లోకి ప్రవేశిస్తున్న మార్గాలు, వాటిని నియంత్రించే విధానాలపై చర్చించింది. భారత్ తరఫున ఎన్ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్‌సింగ్, బంగ్లాదేశ్ తరఫున డీఐజీ స్థాయి అధికారి మహ్మద్ హిలాలుద్దీన్‌బొదారీ నేతృత్వంలోని బృందాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి. 2008 వరకు పాకిస్థాన్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో అసలు నోట్లకు దీటుగా ముద్రితమవుతున్న నకిలీ నోట్లు దుబాయ్ ద్వారా గుజరాత్ తీరానికి లేదా ముంబై పోర్టుకు చేరి అక్కడ నుంచి రాష్ట్రంలోకి వచ్చేవి. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి అనంతరం గుజరాత్ తీరంపై నిఘా పెరగటంతో స్మగ్లర్లు రూటు మార్చారు. పాక్‌లో ముద్రితమవుతున్న నకిలీ నోట్లను బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్లోని మాల్దాకు.. అటు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావటం ప్రారంభించారు. బెంగాల్ నుంచి కరెన్సీ రవాణాకు చేపల లోడ్ లారీలను వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి నిత్యం కోల్‌కతా, గువాహటి తదితర ప్రాంతాలకు చేపల లోడ్‌తో లారీలు వెళ్తుంటాయి. ఇవి తిరిగి వచ్చేప్పుడు వాటిలో ఉండే ఖాళీ చేపల ట్రేల్లో పెట్టి నకిలీ కరెన్సీని ఏపీకి తీసుకువస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు మాల్దా పైనా నిఘా పెట్టాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. ఇకపై తరచుగా సంయుక్త దాడులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 18 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా.. వాటిలో రూ. 11 వేల కోట్ల విలువచేసే కరెన్సీ నకిలీ నోట్లు మార్పిడి జరుగుతున్నట్లు అంచనా. ఆర్బీఐ చెలామణిలో ఉన్న నకిలీ కరెన్సీని వెలికితీసే పని లో ఉండగా.. నకిలీ నోట్ల మార్పిడికి అ డ్డుకట్ట వేయటంపైన ఎన్ఐఏ, నకిలీ కరెన్సీ రవాణాను అడ్డుకోవటంపై టాస్క్‌ఫోర్స్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి. - బిజినెస్ డెస్క్, సాక్షి -
నకిలీ కావు.. అసలు నోట్లే!
యాలాల, న్యూస్‌లైన్: రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసిన ఓ స్పిన్నింగ్ మిల్లు యాజమాన్యం నకిలీ నోట్లు పంపిణీ చేసిందంటూ సోమవారం యాలాల మండలంలో వదంతులు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నోట్లను స్వాధీనం చేసుకుని విచారించి.. అవి నకిలీవి కాదని, అసలువేనని తేల్చేశారు. పోలీసులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రాంక్రిష్ణారెడ్డికి చెందిన లారీలో సుమారు 70 క్వింటాళ్ల పత్తిని యాలాల మండల పరిధిలోని దౌలాపూర్ సమీపంలోని ఓ స్పిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చారు. తూకం అయ్యాక సుమారు రూ. మూడు లక్షల 80వేల నగదును లారీ డ్రైవర్ రాములుకు మిల్లు ప్రతినిధులు అందజేశారు. అయితే ఇచ్చిన నగదులో రూ.500నోట్లపై డ్రైవర్‌కు అనుమానం కలిగింది. నోట్లు నకిలీ కావచ్చుననే అనుమానాన్ని మిల్లు ప్రతినిధులకు తెలియజేశాడు. దీంతో మిల్లు ప్రతినిధులు అనుమానం ఉన్న రూ.500నోట్లు(రూ.58వేల 500)లను తీసుకొని, చెక్కు రూపంలో మిగితా డబ్బులను చెల్లిస్తామని డ్రైవర్‌కు చెప్పారు. ఈ విషయాన్ని లారీ డ్రైవర్ తన యజమానికి ఫోన్లో తెలియజేశాడు. అయితే నకిలీ నోట్లు కావడంతోనే మిల్లు యజమానులు వెనక్కి తీసుకొని ఉండవచ్చుననే అనుమానంతోపాటు స్పిన్నింగ్ మిల్లుకు వచ్చిన పలువురు రైతులు మిల్లులో నకిలీ నోట్లను అందజేస్తున్నారనే అభిప్రాయాలను కొందరు రైతులు వ్యక్తం చేశారు. రైతుల ద్వారా విషయం తెలుసుకున్న యాలాల ఎస్ఐ రాజేందర్‌రెడ్డి సిబ్బందితో మిల్లు వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఘటనా స్థలానికి డీఎస్పీ షేక్ ఇస్మాయిల్, రూరల్ సీఐ రవిలు రాత్రి 9 గంటలకు మిల్లు వద్దకు చేరుకుని విచారణ జరిపారు. మిల్లు యజమానులు మాత్రం ప్రతిరోజు తాము ఓ బ్యాంకు నుంచి నగదును తీసుకువచ్చి, రైతులకు చెల్లింపులు చేస్తామని డీఎస్పీకి వివరణ ఇచ్చారు. సోమవారం కూడా అదే బ్యాంకు నుంచి రూ.40లక్షలు డ్రా చేసి, పత్తి కొనుగోలు చేసిన రైతులకు పంపిణీ చేశామన్నారు. అయితే రైతులకు పంపిణీ చేయగా మిగిలిన రూ.18లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొని పరిశీలించారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో నకిలీ నోట్లు లేవని నిర్ధారించారు. లారీ డ్రైవర్ పొరపాటు వల్లే ఈ వ్యవహారం కలకలం రేపిందని పోలీసులు వెల్లడించారు. -
నకిలీ మహాత్ములు!
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్:మన కరెన్సీ నోట్లపై.. ముఖ్యంగా పెద్ద నోట్లపై గాంధీ మహాత్ముని చిత్రం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన దేశానికి దాస్యశృంఖాలల నుంచి విముక్తి కల్పించి జాతిపితగా నిలిచిన ఆ మహాత్ముడు మన కళ్ల ముందు కదలాడాలని.. నిత్యం ఆయన్ను స్మరించుకోవాలన్న సదుద్దేశంతో కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని ముద్రిస్తున్నారు. ఇప్పుడు ఆ బాపూజీనే అవమానపరిచే రీతిలో జర్నలిస్టు ముసుగులో నకిలీ నోట్లు చెలామణీ చేస్తూ మన ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాడు.. ఓ ఘరానా ‘మహాత్ముడు’. పట్టణంలోని ఓ యువజన నాయకుడు, మరో నాయకురాలి పుత్రరత్నం తెరవెనుక నుంచి అందిస్తున్న సహకారంతో మరికొందరితో ముఠా ఏర్పాటు చేసుకుని ఈ నకిలీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. బ్యాంకులో పని చేసే ఓ ఉద్యోగిని, ఏటీఎం లలో నగదు పెట్టే ఓ ఏజెన్సీ ఉద్యోగుల అండదండలతో బ్యాంకుల్లోకీ నకిలీ నోట్లను చొప్పిస్తున్నారు. అసలు సూత్రధారి అతడే జిల్లాలో ఇటీవలి కాలంలో జోరుగా సాగుతున్న దొంగ నోట్ల దందాకు జర్నలిస్టు ముసుగు కప్పుకొన్న శ్రీకాకుళం మండల వీధికి నకిలీ మహాత్ముడే ప్రధాన సూత్రధారి అని ‘న్యూస్‌లైన్’ పరిశోధనలో తెలింది. ఇటీవలి కాలంలో నకిలీ నోట్ల చెలామణీ కేసులో పోలీసులు అరెస్టు చూపించిన ముగ్గురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి ఒడిశా నుంచి దొంగ నోట్లను జిల్లాకు తరలిస్తుంటాడు. వీటిని సూత్రధారి ‘ప్రసాదం’లా జిల్లా అంతటికీ పంచేస్తున్నాడు. కొంత మంది వ్యక్తులను పావులుగా వాడుకుని ఈ దందా సాగిస్తున్నాడు. గత నెలలో అరెస్టు అయిన అనిల్ అనే వ్యక్తి కూడా ఈ సూత్రధారి చేతిలో పావేనని సమాచారం. నకిలీ నోట్ల చెలమణీతోపాటు అనేక రకాల సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. గతంలో ఈ సూత్రధారి పొన్నాడకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.లక్షకు కారు కొన్నాడు. దానికి సంబంధించిన పత్రాలు కారు యజమాని ఇవ్వకపోవడంతో కారు తిరిగి తీసుకొని రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో కొంతమందిని తీసుకుని అతని ఇంటికి వెళ్లి సొమ్ము ఇవ్వకపోతే అతని భార్యను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. ‘రూ.లక్షకే కారు అమ్మాను కదా.. ఆ లక్ష ఇచ్చేస్తానని’ కారు యజమాని ఎంత నచ్చజెప్పినా వినలేదు. దాంతో చేసేది లేక ఇంట్లో ఉన్న బంగారు నగలు అమ్మి భార్య మూడు లక్షలు ముట్టజెప్పాడు. ఇలా అనేక మార్గాల్లో మన సూత్రధారి అడ్డగోలుగా సంపాదించేస్తున్నాడు. బ్యాంకుల్లో దొంగ నోట్ల చెలామణీ ఇలా.. ఈ ముఠా సూత్రధారి బ్యాంకులు, ఏటీఎంలలోకీ నకిలీ నోట్లను చొప్పిస్తున్నాడు. ఈయన మేనల్లుడి భార్య పట్టణ శివారులోని ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. ఆమె ద్వారా ఈ పని చేయిస్తున్నారు. ఆమె క్యాష్ కౌంటర్లో ఉన్నప్పుడు దొంగ నోట్లను బ్యాంకు నగదులో కలిపించేస్తున్నారు. అక్కడ్నుంచి ఆ సొమ్ము విత్ డ్రా చేసే వారికో లేక ఏటీఏంలలోకో వెళుతోంది. పొందూరు మండలం తోలాపిలో ఓ బ్యాంకులో పనిచేసే వ్యక్తిని కూడాఇందుకు వినియోగించుకుంటున్నారు. అదే విధంగా ఏటీఏంలలో నగదు జమ చేసే ఓ ప్రైవేటు ఏజెన్సీకి చెందిన ఓ ఉద్యోగితో కుమ్మక్కై ఏటీఏంలలో దొంగనోట్లను చేర్చేవాడు. రాజకీయ ఒత్తిళ్లు దొంగ నోట్ల చెలమణీ జోరుగా సాగుతుండటంతో జిల్లా పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించారు. కేసు విచారణ బాధ్యతను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. అంతే కాకుండా ముగ్గురు సీఐలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు కేసు దర్యాప్తును ముందుకు సాగనీయడం లేదు. ఈ ముఠాకు ఓ యువజన నాయకుడు, మరో రాజకీయ నాయకురాలి పుత్రుడు తెరవెనుక నుంచి అండదండలందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తామేమీ చేయలేమని గుర్తించి పోలీసు సిబ్బంది వారిచ్చే ముడుపులకు లొంగిపోయి కేసును నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఈ ముఠా సభ్యులైన వజ్రపుకొత్తురు మండలానికి చెందిన మోహనరావు, పలాస మండలానికి చెందిన సంతోష్‌కుమార్, విశ్వనాధంలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని విచారించగా పలువురి పేర్లు బయటకు వచ్చాయి. దాంతో కొద్దిరోజుల కిందట మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జర్నలిస్టు ముసుగు కప్పుకొన్న సూత్రధారి కూడా ఉన్నాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విడిచిపెట్టేశారు. -
దొంగనోట్ల గుట్టు రట్టు
అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: అనకాపల్లిలో దొంగనోట్ల గుట్టు రట్టయింది. పోలీసులు రూ. 4.95 లక్షల విలువైనవిగా కనిపించే నకిలీ కరెన్సీని అనకాపల్లి రైల్వే స్టేషన్లో మంగళవారం పట్టుకున్నారు. దొంగనోట్లతో రైల్వేస్టేషన్లో సంచరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా తణుకు వాస్తవ్యుడు ద్వారంపూడి వెంకటరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విక్రంజిత్ దుగ్గల్ మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన సమాచారం ప్రకారం.. తణుకుకు చెందిన వెంకటరెడ్డి అనకాపల్లి రైల్వే స్టేషన్లో నకిలీ నోట్లతో తిరుగుతూ ఉండగా సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి వెయ్యి, అయిదు వందల నోట్లలో ఉన్న రూ. 4.95 లక్షల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంకటరెడ్డిని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయని ఎస్పీ తెలిపారు. దొంగనోట్ల చెలామణీ వ్యవహారంలో పట్టణానికి చెందినవారే కాకుండా ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి కూడా సంబంధాలున్నాయని తెలిసిందన్నారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నకిలీ నోట్లను వెంకటరెడ్డి తీసుకువచ్చి అసలు నోట్లుగా మార్చి సంబంధిత వ్యక్తులకు ఇచ్చే మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడని చెప్పారు. కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి సమగ్ర సమాచారాన్ని రాబడతామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వి.ఎస్.ఆర్. మూర్తి, సీఐలు పి. శ్రీనివాసరావు, జి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.