నోట్ల మార్పిడిపై 23 కేసులు
పార్లమెంటరీ కమిటీ భేటీలో డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో ఇప్పటి వరకు 23 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్‌లో పార్లమెంటరీ కమిటీతో డీజీపీ బృందం సమావేశమైంది. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో కేసుల నమోదు, నకిలీ కరెన్సీ కేసులు తదితర అంశాలపై చర్చించడంతో పాటుగా ఓ నివేదికనూ పార్లమెంట్ కమిటీకి అందించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డితో పాటు సీఐడీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
పలు విభాగాలతో భేటీ: కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలపై రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాల అధికారులతో పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించింది. మైనారిటీ వ్యవహారాలకు సంబంధించిన పథకాలు, నిధుల వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, ఆర్థిక శాఖ, పలు విభాగాలతో భేటీ అయ్యింది. నోట్ల రద్దు తర్వాత సమస్యలపై బ్యాంకు యాజమాన్యాలతో కమిటీ సమీక్ష నిర్వహించినట్టు తెలిసింది.