నకిలీ నోట్లపై సమరం | fight on duplicate notes | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్లపై సమరం

Published Sat, Jan 25 2014 1:58 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

fight on duplicate notes

రంగంలోకి భారత్-బంగ్లా టాస్క్‌ఫోర్స్  ఢిల్లీలో మూడు రోజుల పాటు భేటీ
సరిహద్దుల్లో ‘రూట్ బ్లాక్’కు వ్యూహం   పాక్ నుంచి బంగ్లాకు ‘నకిలీ’ రవాణా
బంగ్లా నుంచి మాల్దా ద్వారా దేశంలోకి  అక్కడి నుంచి చేపల లారీల్లో ఏపీకి
 
 సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక రంగాన్ని కుదేలు చేస్తున్న నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. ఓవైపు.. 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన రూ. 500, రూ. 1,000 నోట్లు సహా.. కరెన్సీ నోట్లన్నిటినీ మార్పిడి చేసుకోవాల్సిందిగా ప్రకటించింది. మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ అధికారులతో సంయుక్తంగా ఏర్పాటైన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ‘రూట్ బ్లాక్’ చేయాలని నిర్ణయించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నేతృత్వంలో ఈ టాస్క్‌ఫోర్స్ బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో సమావేశమై.. నకిలీ కరెన్సీ భారత్‌లోకి ప్రవేశిస్తున్న మార్గాలు, వాటిని నియంత్రించే విధానాలపై చర్చించింది. భారత్ తరఫున ఎన్‌ఐఏ ఐజీ సంజీవ్‌కుమార్‌సింగ్, బంగ్లాదేశ్ తరఫున డీఐజీ స్థాయి అధికారి మహ్మద్ హిలాలుద్దీన్‌బొదారీ నేతృత్వంలోని బృందాలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి.
 
 2008 వరకు పాకిస్థాన్‌లోని కంటోన్మెంట్ ఏరియాలో అసలు నోట్లకు దీటుగా ముద్రితమవుతున్న నకిలీ నోట్లు దుబాయ్ ద్వారా గుజరాత్ తీరానికి లేదా ముంబై పోర్టుకు చేరి అక్కడ నుంచి రాష్ట్రంలోకి వచ్చేవి. 2008లో ముంబైపై ఉగ్రవాదుల దాడి అనంతరం గుజరాత్ తీరంపై నిఘా పెరగటంతో స్మగ్లర్లు రూటు మార్చారు.
 
 పాక్‌లో ముద్రితమవుతున్న నకిలీ నోట్లను బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమబెంగాల్‌లోని మాల్దాకు.. అటు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావటం ప్రారంభించారు.
 
 బెంగాల్ నుంచి కరెన్సీ రవాణాకు చేపల లోడ్ లారీలను వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
 ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి నిత్యం కోల్‌కతా, గువాహటి తదితర ప్రాంతాలకు చేపల లోడ్‌తో లారీలు వెళ్తుంటాయి. ఇవి తిరిగి వచ్చేప్పుడు వాటిలో ఉండే ఖాళీ చేపల ట్రేల్లో పెట్టి నకిలీ కరెన్సీని ఏపీకి తీసుకువస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.
 
 ఈ నేపథ్యంలోనే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులతో పాటు మాల్దా పైనా నిఘా పెట్టాలని టాస్క్‌ఫోర్స్ నిర్ణయించింది. ఇకపై తరచుగా సంయుక్త దాడులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
 
 ఇప్పటికే దేశవ్యాప్తంగా రూ. 18 లక్షల కోట్ల కరెన్సీ చలామణిలో ఉండగా.. వాటిలో రూ. 11 వేల కోట్ల విలువచేసే కరెన్సీ నకిలీ నోట్లు మార్పిడి జరుగుతున్నట్లు అంచనా.
 
 ఆర్‌బీఐ చెలామణిలో ఉన్న నకిలీ కరెన్సీని వెలికితీసే పని లో ఉండగా.. నకిలీ నోట్ల మార్పిడికి అ డ్డుకట్ట వేయటంపైన ఎన్‌ఐఏ, నకిలీ కరెన్సీ రవాణాను అడ్డుకోవటంపై టాస్క్‌ఫోర్స్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాయి.
 - బిజినెస్ డెస్క్, సాక్షి  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement