నకిలీ మహాత్ములు!
Published Sun, Oct 20 2013 3:07 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్:మన కరెన్సీ నోట్లపై.. ముఖ్యంగా పెద్ద నోట్లపై గాంధీ మహాత్ముని చిత్రం ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. మన దేశానికి దాస్యశృంఖాలల నుంచి విముక్తి కల్పించి జాతిపితగా నిలిచిన ఆ మహాత్ముడు మన కళ్ల ముందు కదలాడాలని.. నిత్యం ఆయన్ను స్మరించుకోవాలన్న సదుద్దేశంతో కరెన్సీ నోట్లపై ఆయన చిత్రాన్ని ముద్రిస్తున్నారు. ఇప్పుడు ఆ బాపూజీనే అవమానపరిచే రీతిలో జర్నలిస్టు ముసుగులో నకిలీ నోట్లు చెలామణీ చేస్తూ మన ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తున్నాడు.. ఓ ఘరానా ‘మహాత్ముడు’. పట్టణంలోని ఓ యువజన నాయకుడు, మరో నాయకురాలి పుత్రరత్నం తెరవెనుక నుంచి అందిస్తున్న సహకారంతో మరికొందరితో ముఠా ఏర్పాటు చేసుకుని ఈ నకిలీ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. బ్యాంకులో పని చేసే ఓ ఉద్యోగిని, ఏటీఎం లలో నగదు పెట్టే ఓ ఏజెన్సీ ఉద్యోగుల
అండదండలతో బ్యాంకుల్లోకీ నకిలీ నోట్లను చొప్పిస్తున్నారు.
అసలు సూత్రధారి అతడే
జిల్లాలో ఇటీవలి కాలంలో జోరుగా సాగుతున్న దొంగ నోట్ల దందాకు జర్నలిస్టు ముసుగు కప్పుకొన్న శ్రీకాకుళం మండల వీధికి నకిలీ మహాత్ముడే ప్రధాన సూత్రధారి అని ‘న్యూస్‌లైన్’ పరిశోధనలో తెలింది. ఇటీవలి కాలంలో నకిలీ నోట్ల చెలామణీ కేసులో పోలీసులు అరెస్టు చూపించిన ముగ్గురు వ్యక్తుల్లో ఓ వ్యక్తి ఒడిశా నుంచి దొంగ నోట్లను జిల్లాకు తరలిస్తుంటాడు. వీటిని సూత్రధారి ‘ప్రసాదం’లా జిల్లా అంతటికీ పంచేస్తున్నాడు. కొంత మంది వ్యక్తులను పావులుగా వాడుకుని ఈ దందా సాగిస్తున్నాడు. గత నెలలో అరెస్టు అయిన అనిల్ అనే వ్యక్తి కూడా ఈ సూత్రధారి చేతిలో పావేనని సమాచారం. నకిలీ నోట్ల చెలమణీతోపాటు అనేక రకాల సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది.
గతంలో ఈ సూత్రధారి పొన్నాడకు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.లక్షకు కారు కొన్నాడు. దానికి సంబంధించిన పత్రాలు కారు యజమాని ఇవ్వకపోవడంతో కారు తిరిగి తీసుకొని రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఓ రోజు అర్ధరాత్రి సమయంలో కొంతమందిని తీసుకుని అతని ఇంటికి వెళ్లి సొమ్ము ఇవ్వకపోతే అతని భార్యను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు. ‘రూ.లక్షకే కారు అమ్మాను కదా.. ఆ లక్ష ఇచ్చేస్తానని’ కారు యజమాని ఎంత నచ్చజెప్పినా వినలేదు. దాంతో చేసేది లేక ఇంట్లో ఉన్న బంగారు నగలు అమ్మి భార్య మూడు లక్షలు ముట్టజెప్పాడు. ఇలా అనేక మార్గాల్లో మన సూత్రధారి అడ్డగోలుగా సంపాదించేస్తున్నాడు.
బ్యాంకుల్లో దొంగ నోట్ల చెలామణీ ఇలా..
ఈ ముఠా సూత్రధారి బ్యాంకులు, ఏటీఎంలలోకీ నకిలీ నోట్లను చొప్పిస్తున్నాడు. ఈయన మేనల్లుడి భార్య పట్టణ శివారులోని ఓ బ్యాంకులో పని చేస్తున్నారు. ఆమె ద్వారా ఈ పని చేయిస్తున్నారు.
ఆమె క్యాష్ కౌంటర్‌లో ఉన్నప్పుడు దొంగ నోట్లను బ్యాంకు నగదులో కలిపించేస్తున్నారు. అక్కడ్నుంచి ఆ సొమ్ము విత్ డ్రా చేసే వారికో లేక ఏటీఏంలలోకో వెళుతోంది. పొందూరు మండలం తోలాపిలో ఓ బ్యాంకులో పనిచేసే వ్యక్తిని కూడాఇందుకు వినియోగించుకుంటున్నారు. అదే విధంగా ఏటీఏంలలో నగదు జమ చేసే ఓ ప్రైవేటు ఏజెన్సీకి చెందిన ఓ ఉద్యోగితో కుమ్మక్కై ఏటీఏంలలో దొంగనోట్లను చేర్చేవాడు.
రాజకీయ ఒత్తిళ్లు
దొంగ నోట్ల చెలమణీ జోరుగా సాగుతుండటంతో జిల్లా పోలీసు అధికారులు దీనిపై దృష్టి సారించారు. కేసు విచారణ బాధ్యతను సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. అంతే కాకుండా ముగ్గురు సీఐలతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు కేసు దర్యాప్తును ముందుకు సాగనీయడం లేదు. ఈ ముఠాకు ఓ యువజన నాయకుడు, మరో రాజకీయ నాయకురాలి పుత్రుడు తెరవెనుక నుంచి అండదండలందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తామేమీ చేయలేమని గుర్తించి పోలీసు సిబ్బంది వారిచ్చే ముడుపులకు లొంగిపోయి కేసును నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో ఈ ముఠా సభ్యులైన వజ్రపుకొత్తురు మండలానికి చెందిన మోహనరావు, పలాస మండలానికి చెందిన సంతోష్‌కుమార్, విశ్వనాధంలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత వారిని విచారించగా పలువురి పేర్లు బయటకు వచ్చాయి. దాంతో కొద్దిరోజుల కిందట మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జర్నలిస్టు ముసుగు కప్పుకొన్న సూత్రధారి కూడా ఉన్నాడు. అయితే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విడిచిపెట్టేశారు.
Advertisement