విదేశీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
కాకినాడలో 8 మంది అరెస్టు
-
చలామణిలో లేని టర్కీ దేశ 5 లక్షల లిరాసినోట్లు 99 స్వాధీనం
కాకినాడ సిటీ :
చలామణిలో లేని విదేశీ కరెన్సీతో మోసగించి డబ్బు సంపాదించాలనుకున్న ముఠా గుట్టురట్టయ్యింది. కాకినాడ కోకిలా సెంటర్ సమీపంలోని జేఎంఎస్ సీఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో ఈ ముఠా ఉన్నట్టు సమాచారం అందడంతో టూ టౌన్ పోలీసులు దాడిచేసి అక్కడ ఉన్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి టర్కీ దేశానికి చెందిన ఐదు లక్షల లిరాసి నోట్లు 99 స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు శనివారం టూ టౌన్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో తెలియ జేశారు. 2009–10లో టర్కీలో సంభవించిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఐదు లక్షల లిరాసి నోట్లను నిషేధించారు. అవి ప్రస్తుతం చలామణిలో లేవని డీఎస్పీ తెలిపారు. అయితే ఆనోట్లను మోసపూరితంగా అమ్మడానికి ముఠా ప్రయత్నించిందన్నారు. వారి వద్ద నుంచి 5 లక్షల లిరాసి నోట్లు 99 స్వాధీనం చేసుకున్నామన్నారు. భారతదేశ రూపాయల్లో చూస్తే వాటి విలువ సుమారు రూ.108 కోట్ల 90 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన పట్నం శంకర్, తోలేటి ప్రకాష్, డేగల శ్రీరామకృష్ణ, నెల్లూరుకు చెందిన కుదిరి విజయభాస్కరరావు, కాకినాడకు చెందిన మిరియం లక్ష్మీనారాయణ, వాడపర్తి వెంకటేష్, రాజోలుకు చెందిన రేఖపల్లి సురేష్, రాజమండ్రికి చెందిన రాయుడు సత్యనారాయణలను కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. ఈ ముఠాతో పాటు ఇంకా కొంత మంది ఉన్నట్టు తెలిసిందని, ఈ కేసుతో సంబంధం ఉన్నవారిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. సీఐలు చైతన్యకృష్ణ, దుర్గారావు పాల్గొన్నారు.