ముంబై: హోమ్ టెక్స్‌టైల్ పరిశ్రమ ఈ ఏడాది 7–9 శాతం మధ్య ఆదాయ వృద్ధిని నమోదు చేయనుంది. దేశీయంగా కాటన్ ధరలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా తిరిగి తన వాటాను పెంచుకుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో హోమ్ టెక్స్‌టైల్ కంపెనీల ఆదాయం 15 శాతం వరకు తగ్గడం గమనార్హం. పరిశ్రమ నిర్వహణ లాభం 1.5–2 శాతం వరకు మెరుగుపడి 14–14.5 శాతానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరుకోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.
ముడి సరుకుల ధరలు తక్కువలో ఉండడం, నిర్వహణ పరమైన అనుకూలతలను పేర్కొంది. అయితే ఇప్పటికీ కరోనా ముందు నాటి కంటే తక్కువలోనే ఉన్నట్టు తెలిపింది. దీంతో పరిశ్రమ రుణ భారం స్థిరంగా కొనసాగొచ్చని అంచనా వేసింది. హోమ్ టెక్స్‌టైల్‌లో 40–45 శాతం మార్కెట్ వాటా కలిగిన 40 కంపెనీలను అధ్యయనం చేసిన తర్వాత క్రిసిల్ రేటింగ్స్ ఈ నివేదికను విడుదల చేసింది.
ఎగుమతులు పెరుగుతాయి..
భారత హోమ్ టెక్స్‌టైల్స్ పరిశ్రమ మొత్తం ఆదాయంలో 70–75 శాతం ఎగుమతుల నుంచే వస్తోంది. ఇందులో యూఎస్ వాటా అధికంగా ఉంది. భారత ఎగుమతుల్లో సగం అమెరికాకే వెళుతుంటాయి. కాటన్ ధర క్యాండీకి గతేడాది మే నెలలో రూ.లక్షకు చేరుకోగా, అది ఇప్పుడు రూ.55,000కు తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. అమెరికాలో బడా రిటైల్ సంస్థల వద్ద నిల్వలు తగ్గిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు ఆర్డర్ల రాక పెరుగుతుందని అంచనా వేసింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో సవాళ్లు నెమ్మదించడంతో గడిచిన కొన్ని నెలలుగా అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది.
‘‘దేశీయ ముడి సరుకులు ఇప్పుడు పోటీనిచ్చే స్థాయికి తగ్గాయి. అంతర్జాతీయ కొనుగోలు దారులు చైనా ప్లస్ వన్‌కు ప్రాధాన్యం ఇస్తుండడం, యూఎస్ రిటైలింగ్ సంస్థలు తిరిగి స్టాక్ పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుండడడంతో ఆదాయం పుంజుకుంటుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. దీనికి నిదర్శనంగా 2022లో భారత కంపెనీల వాటా 44 శాతం నుంచి తిరిగి 47 శాతానికి చేరుకోవడాన్ని ప్రస్తావించారు. 2021లో ఈ వాటా 48 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment