సాక్షి, ఎన్టీఆర్: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు గాలి తీసేశారు పచ్చ నేతలు, కార్యకర్తలు. పది రోజుల క్రితం తిరువూరులో జూదం ఆడనివ్వను అంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికారు. కానీ, ఆయన మాటలను కూటమి నేతలు, పార్టీ కార్యకర్తలు ఎవరూ లెక్క చేయలేదు. తిరువూరులో కమీషన్ తీసుకుని మరీ టీడీపీ నేతలు పందేలు, జూదం ఆడిస్తున్నారు.
వివరాల ప్రకారం.. తిరువూరులో టీడీపీ నేతలు హల్‌చల్ చేస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా కమీషన్లు తీసుకుని పందేలు, జూదం ఆడిస్తున్నారు పచ్చ నేతలు. ఇక, పోలీసులు సైతం జూదం నిర్వాహకులతో కుమ్మక్కు అయినట్టు తెలుస్తోంది. గుండాట, పేకాట, లోనా బయట, గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. కూటమి నేతలు జూద క్రీడలకు ప్రత్యేక ధరలు నిర్ణయించి అమ్మేసినట్టు స్థానికులు చెబుతున్నారు.
అయితే, పది రోజుల క్రితమే తిరువూరులో జూదం ఆడనివ్వనంటూ ఎమ్మెల్యే కొలికపూడి ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. కానీ, ఆయన మాటలను టీడీపీ కార్యకర్తలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మరోవైపు.. జూదం ఆడుతున్న శిబిరాల వద్దనే పబ్లిక్‌గా మద్యం విక్రయాలు కూడా జరుగుతున్నాయి. మామూళ్లు తీసుకుని ఎక్సైజ్ అధికారులు.. మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ఇక, అంతకుముందు.. కోడి పందేలు, జూద క్రీడలు నిర్వహిస్తే ఊరుకోనని ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, ప్రస్తుతం విచ్చిలవిడిగా జూదం ఆడుతున్నా కమిషనర్ రాజశేఖర్ బాబు మాత్రం పట్టించుకోవడం లేదు. తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, కోడి పందెం బరులు , జూద క్రీడల వద్ద పోలీసులు కనిపించకపోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment