పింజ తక్కువట.. తేమ ఎక్కువట!
- పత్తిరైతు చిత్తు
- మే వరకూ మార్కెట్లకుపత్తి వచ్చే అవకాశం
- మార్చి రెండో వారం నాటికే కొనుగోళ్లు నిలిపివేసిన సీసీఐ
- సీసీఐ కేంద్రాల మూతతో వ్యాపారుల ఇష్టారాజ్యం
- క్వింటాల్‌కు రూ. 400 వరకూ తగ్గింపు
పత్తిరైతు నిలువునా దోపిడికీ గురవుతున్నాడు.. మార్కెట్ మాయాజాలంలో ఘోరంగా ఓడిపోతున్నాడు.. కొనుగోళ్లు చేసినంతకాలం ఏదో ఒక నిబంధన పేరుతో రైతులకు చుక్కలు చూపిన సీసీఐ.. మార్కెట్‌కు పత్తి రావడం ఇంకా ఆగిపోకముందే దుకాణం కట్టేసింది.. వ్యాపారులు, దళారులకు తలుపులు బార్లా తెరిచి, రైతన్న నోట మట్టి కొట్టేసింది. ఇదే అదనుగా వ్యాపారులు దగా దందా మొదలుపెట్టేశారు. క్వింటాల్ పత్తికి రూ. ఐదారు వందల వరకూ తక్కువ చెల్లిస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. దిక్కుతోచని రైతులు ఆవేదనలో మునిగిపోతున్నారు. కన్నీళ్లతోనే వచ్చినకాడికి అమ్ముకుంటున్నారు.
- సాక్షి, హైదరాబాద్
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో... రాష్ట్రంలో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ. 4,050 కాగా.. వ్యాపారులు రూ. 3,600 నుంచి రూ. 3,700కు మించి చెల్లించడం లేదు. తక్కువ ధర వస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సాధారణంగా రైతులు మే నెల వరకు పత్తి విక్రయాలు చేస్తూనే ఉంటారు. ఈ లెక్కన కనీసం ఏప్రిల్ 15వ తేదీ వరకైనా సీసీఐ కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి మార్చిలోనే సీసీఐ కేంద్రాలను ఎత్తివేయడం.. అసలే కరువుతో అల్లాడుతున్న రైతులకు శరాఘాతంగా మారింది.
సింహభాగం పత్తిదే
రాష్ట్రంలో పత్తిసాగు అధికం. ఈ ఖరీఫ్‌లో 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా.. పత్తిని ఏకంగా 16.763 లక్షల హెక్టార్లలో సాగుచేశారు. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల సాగు 83 శాతానికి తగ్గగా... పత్తి సాగు 109 శాతానికి పెరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువ. సాధారణంగా పత్తి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ వర్షాలు సరిగా కురవక.. పత్తి దిగుబడి 3 నుంచి 7 క్వింటాళ్లకు పడిపోయింది.
మొత్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 35 లక్షల టన్నుల వరకు పత్తిని రైతులు విక్రయించారు. మరో 10 లక్షల టన్నుల వరకు పత్తిని నిల్వ ఉంచారు. గత సీజన్‌లో ఇలా నిల్వ ఉంచిన రైతులకు కనీస మద్దతు ధరకు మించి క్వింటాల్‌కు రూ. 5,200 వరకు ధర పలికింది. ఈ సారి కూడా అలా జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలపై సీసీఐ నీళ్లు చల్లుతూ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయంటూ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా రైతులు తమ పత్తిని మహారాష్ట్రకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు.
పింజ పొడవు సాకు..
రైతులు పత్తి తీతను దాదాపు పూర్తిచేశారు. కానీ ధర ఎక్కువ వస్తుందన్న ఆశతో నిలువ ఉంచారు. కానీ పింజ పొడవు తక్కువగా ఉం దని పేర్కొంటూ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా పింజ పొడవు 29.5 మిల్లీమీటర్ల నుంచి 30.5 మిల్లీమీటర్ల వరకు ఉన్న పత్తికి పూర్తిస్థాయి ధర చెల్లిస్తారు. కానీ పత్తి తీత పూర్తయిన తర్వాత వస్తున్న సరుకుకావడంతో... పూర్తి నాణ్యంగా ఉన్నా కూడా పింజ పొడవు తక్కువ ఉందం టూ వ్యాపారులు సాకులు చెబుతున్నారు. దీని కి తోడు తేమ శాతం పేరిట తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఈ విషయంలో సీసీఐ వ్యాపారుల తో కుమ్మక్కు అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిందనే వాదన వినిపిస్తోంది.
మేమేమీ ఆదేశాలు ఇవ్వలేదు
‘‘సీసీఐ కొనుగోలు కేంద్రాలను నిలిపివేయాలని మేం ఆదేశాలు ఇవ్వలేదు. సీసీఐ నేరుగా అలాంటి ఆదేశాలు ఇచ్చి ఉండవచ్చు. ఈ విషయం నాకు తెలియదు.’’
- ప్రియదర్శిని, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్