పత్తి రైతు మళ్లీ చిత్తు!
సాక్షి, హైదరాబాద్: పత్తి రైతు మళ్లీ చిత్తవుతున్నాడు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) అందక మార్కెట్ మాయాజాలంలో కుదేలవుతున్నాడు. ఖరీఫ్‌లో వేసిన పంటల్లో ముందుగా మార్కెట్‌కు వచ్చేది పత్తే. వారం రోజులుగా ఈ పంట మార్కెట్‌కు వస్తోంది. అయితే పంటకు వ్యాపారులు సరైన ధర ఇవ్వకుండా రైతులను దోపిడీ చేస్తున్నారు. కనీస మద్దతు ధర రూ.4,050 ఉండగా... కేవలం రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడుతోంది.
వరి కంటే రెట్టింపు సాగు
తెలంగాణలో పత్తి సాగు అధికం. వరికి రెట్టింపు స్థాయిలో సాగవుతుంది. ఈ ఏడాది 8.173 లక్షల హెక్టార్లలో వరి సాగు కాగా... పత్తి 16.763 లక్షల హెక్టార్లలో వేశారు. ఈ ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల సాగు కేవలం 83 శాతమే ఉంటే... పత్తి సాగు 109 శాతం ఉంది. తెలంగాణలో పత్తికి ఇస్తున్న ప్రాధాన్యం ఎంతో ఈ లెక్కలను బట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే వర్షాలు సరిగా లేకపోవడంతో పత్తి దిగుబడి తగ్గుతుందని అంచనా. సహజంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు పత్తి దిగుమతి కావాలి. కానీ సరైన వర్షాలు లేకపోవడంతో అది 7 క్వింటాళ్ల వరకు పడిపోవచ్చని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
దిగుబడి తగ్గినా కనీసం మద్దతు ధర అయినా వస్తుందన్న ఆశ రైతుల్లో ఉంది. కానీ క్వింటాలుకు రూ.వెయ్యి వరకు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో రైతుల ఆశలు అవిరవుతున్నాయి. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయని వ్యాపారులు సాకులు చెబుతున్నారు. అటు ప్రభుత్వం పట్టించుకోకపోవడం, ఇటు సీసీఐ కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిపించకపోవడంతో వ్యాపారులు చెప్పిందే రేటు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. గతేడాది క్వింటాలుకు ఏకంగా రూ.5,200 వరకు కొనుగోళ్లు జరిగాయి. ఇప్పుడు మాత్రం వ్యాపారులు రూ.3 వేలే అనడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
స్వామినాథన్ సిఫార్సులు ఏమయ్యాయి?
పదేపదే స్వామినాథన్ సిఫార్సులను ప్రస్తావించే పాలకులు.. ఆయన సిఫార్సులను అమలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం... రైతు ఒక పంటకు పెట్టిన పెట్టుబడి, ఆ ఖర్చులో సగం మొత్తం కలిపితే ఎంత వస్తుందో దాన్నే కనీస మద్దతు ధరగా ప్రకటించాలి.
ఆ ప్రకారం చూస్తే అధికారిక లెక్కల ప్రకారం క్వింటాలు పత్తికి రైతు పెట్టే పెట్టుబడి ఖర్చు రూ.5,200. అందులో సగం రూ.2,600. ఈ రెండింటినీ కలిపితే రూ.7,800. ఇదే పత్తి కనీస మద్దతు ధర కావాలి. కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. కనీసం అందులో సగం ధరకైనా వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. వైఎస్ ప్రభుత్వంలో క్వింటాలుకు రూ.7,200 చొప్పున కొనుగోలు చేశారు. ఇన్నేళ్లు గడిచినా ఆ ధర కాదు కదా కనీస మద్దతు ధర కూడా రైతులకు అందించడంలో సర్కారు విఫలమవుతోంది.