సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పత్తి రైతులను నిండా ముంచడానికి సీసీఐ (భారత పత్తి సంస్థ) మరో కుట్ర పన్నింది. రైతుల కష్టాన్ని అందిన కాడికి దోచుకునేందుకు కొత్త సంవత్సరంలో లేని నిబంధనలను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం రైతులు తెస్తున్న పత్తిలో నాణ్యత (పింజ పొడవు-స్టేఫుల్ లెన్త్) తగ్గిందనే సాకుతో ధరలో మరింత కోత పెట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.4,050 ఇకపై చెల్లించడం కుదరదని, క్వింటాలుకు రూ.వంద తగ్గించి రూ.3,950 చొప్పున కొనుగోలు చేస్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ మేనేజర్ అర్జున్‌దవే జిల్లా మార్కెటింగ్ శాఖకు ఇటీవల ఓ లేఖ రాశారు. ఈ నిర్ణ యం సోమవారం నుంచి అమలుచేస్తామని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మాయిశ్చర్ పేరుతో కనీస మద్దతు ధరలో భారీగా కోత పెట్టి నిండా ముంచుతున్న సీసీఐ, కొత్త సాకు చూపి మరింత దోపిడీ చేయడం సరికాదని అంటున్నారు.
ఏ జిల్లాలో లేని నిబంధన..
ఈ సీజన్‌లో సీసీఐ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌తోపాటు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లో పత్తిని కొనుగోలు చేస్తోంది. ఏ జిల్లాలో లేని విధంగా ఒక్క ఆదిలాబాద్‌లోనే పత్తి నాణ్యత తగ్గిందని ధరను తగ్గిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన పత్తిలో స్టేఫుల్‌లెన్త్ 34 ఎం.ఎం. ఉందని, ఇప్పడు వస్తున్న పత్తిలో ఈ పొడవు 29.5 ఎంఎంకు తగ్గిందని సీసీఐ పంపిన లేఖలో పేర్కొంది. ఈ స్టేఫుల్ లెన్త్‌తో కలిగిన పత్తితో తయారు చేసిన బేళ్లకు అంతర్జాతీయ మార్కెట్‌లో ఆశించిన ధర పలకదనే సీసీఐ సాకు చూపుతోందనే విమర్శ వ్యక్తమవుతోంది.
నిండా మునుగనున్న పత్తి రైతులు.. : సీసీఐ ధర తగ్గింపు నిర్ణయంతో పత్తి రైతులపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఇప్పటికే వాతావరణం అనుకూలించక పత్తి రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు లేక ఒక్కో రైతు రెండు మూడు సార్లు విత్తనాలను విత్తుకోవాల్సి వచ్చింది. దీంతో విత్తన భారం మీద పడింది. దీనికి తోడు ఎరువులు, పురుగు మందుల ధర విపరీతంగా పెరుగడంతో సాగు వ్యయం తడిసిమోపెడైంది. మరోవైపు దిగుబడి పడిపోయింది. దీంతో ప్రస్తుతం సీసీఐ చెల్లిస్తున్న ధర రూ.4,050తో రైతులకు సాగు ఖర్చులు కూడా రావడం లేదు. ఇప్పుడు ఈ ధరలో కూడా కోత పెడితే పత్తి రైతు పరిస్థితి ఆగమ్య గోచరంగా మారనుంది.
కుదరదని చెప్పాం : శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ
సీసీఐ కొనుగోలు చేస్తున్న పత్తి ధరను క్వింటాలుకు రూ.వంద చొప్పున తగ్గిస్తామని సీసీఐ ఆదిలాబాద్ బ్రాంచ్ కార్యాలయం నుంచి ఇటీవలే ఓ లేఖ వచ్చింది. సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తామని సీసీఐ లేఖలో పేర్కొంది. ధర తగ్గిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, అలా తగ్గించడం కుదరదని సీసీఐ అధికారులకు చెప్పారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాం. ఈ స్టేఫుల్ లెన్త్ విషయంలో సాంకేతిక నిపుణులు పరిశీలించాల్సి ఉంది. ఈ అంశంపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారు.
కొత్త దోపిడీ..
Published Fri, Jan 2 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement
Advertisement