సాగు తగ్గింది.. ధర పెరిగింది
సాక్షి, హైదరాబాద్: ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోనూ రైతులకు పత్తి ధరలు గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఏమాత్రం ఉండదు. అందువల్ల రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలి’ అని ఈ ఏడాది ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. దీంతో వ్యవసాయశాఖ రైతులను పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా, మొక్కజొన్న, పప్పుధాన్యాల పంటల వైపు మళ్లించడంలో సఫలమైంది. కానీ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు రైతులకు సంకటంగా మారింది. గతేడాది కంటే ఈసారి పత్తి ధరలు రెట్టింపు స్థాయిలో ఉండటంతో రైతులు, అధికారులు కంగుతిన్నారు. పోనీ ప్రత్యామ్నాయంగా సాగు చేయాలని ప్రభుత్వం సూచించిన పంటల ధరల పరిస్థితి మార్కెట్లో బాగుందా అంటే అదీ లేదు. సోయా, కంది, పెసర పంటల ధరలు మార్కెట్లో ఢమాల్ అంటున్నాయి.
గతేడాది కంటే 11 లక్షల ఎకరాలు తగ్గిన పత్తి సాగు...
ఖరీఫ్‌లో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా... గతేడాది ఖరీఫ్‌లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రప్రభుత్వం పత్తి సాగు వద్దని చెప్పడంతో ఈ ఏడాది 30.52 లక్షల ఎకరాలకు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే 11 లక్షల ఎకరాల పత్తి సాగు తగ్గింది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్, మొక్కజొన్న, కంది, పెసర వంటి పంటల సాగును పెంచాలన్న నిర్ణయానికి తగ్గట్లుగా వాటి సాగు గణనీయంగా పెరిగింది. సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.98 లక్షల ఎకరాలు కాగా... గతేడాది 6.27 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రభుత్వ ప్రచారంతో ఈసారి 7.36 లక్షల ఎకరాల్లో సాగైంది. అలాగే ఖరీఫ్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.12 లక్షల ఎకరాలు కాగా... గతేడాది 10.44 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక ఈ ఖరీఫ్‌లో ఏకంగా 14.44 లక్షల ఎకరాల్లో సాగైంది. అన్ని రకాల పప్పుధాన్యాలను ఖరీఫ్‌లో సాధారణంగా 9.97 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. గతేడాది ఖరీఫ్‌లో 8.89 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే... ఈ ఖరీఫ్‌లో ఏకంగా 15.75 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పత్తికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలన్నీ కూడా భారీగా సాగయ్యాయి. కానీ ప్రత్యామ్నాయ పంటల ధరలన్నీ కూడా మార్కెట్లో పడిపోయాయి.
రెట్టింపైన పత్తి ధర...
గతేడాది క్వింటాలు పత్తి తెలంగాణ మార్కెట్లో రూ. 4,050 వరకు గరిష్టంగా ధర పలుకగా... ఈ ఏడాది రూ.8 వేల నుంచి రూ. 10 వేల వరకు ధర పలుకుతుండటం గమనార్హం. గతేడాది పెసర క్వింటాలు రూ. 6,965 వరకు ధర పలుకగా... ఈసారి రూ. 4,500కు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంటే క్వింటాలుకు రూ. 2 వేలకు పైనే తగ్గడం గమనార్హం. సోయాబీన్‌కు గతేడాది క్వింటాలుకు రూ. 3,700 ధర ఉండగా... ఈ ఏడాది రూ. 2,800కు పడిపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న గతేడాది క్వింటాలుకు రూ. 1,419 ధర ఉండగా, ఈసారి రూ. 1,200కు పడిపోయింది. కంది గతేడాది క్వింటాలుకు రూ. 7 వేలుండగా... ఈసారి రూ. 5,827కు పడిపోయింది. దీంతోపాటు సోయా, మొక్కజొన్న, కంది పంటలకు ఇటీవల వచ్చిన కుండపోత వర్షాలకు భారీగా నష్టం వాటిల్లింది.