హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.
రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్‌లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.
వాదనలు ఇలా..
రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్‌ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.
రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డి
తెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment