ఉత్కంఠ.. ఉద్రిక్తత
ఉత్కంఠ.. ఉద్రిక్తత!
హనుమాన్ ఆలయానికి తరలివచ్చిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలు
అడ్డుకున్న పోలీసులు, లాఠీచార్జ్, పలువురికి గాయాలు
కాంగ్రెస్ ఇన్‌చార్జి ప్రణవ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గృహ నిర్బంధం
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ, అందులో నిజం ఉంటే హుజూరాబాద్ మండలం చెల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్ విసిరిన సవాల్ మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
ప్రణవ్, పాడి కౌశిక్‌రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ రోజంతా నెలకొంది. ప్రణవ్ పిలుపుమేరకు మంగళవారం ఉదయమే చెల్పూర్‌కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మోసం చేశారంటూ ఫ్లెక్సీ ఏర్పా టు చేయడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు అక్కడికి చేరు కుని నిరసనకు దిగారు. ఆలయం వద్ద బీఆర్‌ఎస్– కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్‌జి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
ఇరువర్గాలతో మాట్లాడగా.. శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బుర్రకుమార్ గౌడ్‌కు గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు జమ్మికుంట, సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా.. వొడితల ప్రణవ్‌బాబును సింగాపూర్‌లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని వీణవంకలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
చెల్పూర్ లో ఏసీపీ శ్రీనివాస్ జితో వాగ్వాదానికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులు
తడి బట్టలతో ఎమ్మెల్యే ప్రమాణం
వొడితెల ప్రణవ్ చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ సీపీకి ఫోన్‌చేసి, తనకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా నిరాకరించారు. ఎమ్మెల్యే ఇంటివద్ద జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, సీఐ సృజన్‌రెడ్డి సిబ్బందితో మోహరించారు. పోలీసుల అనుమతి రాకపోవడంతో ఎమ్మెల్యే తడి బట్టలతో దేవుడి మీద ప్రమాణం చేసి తను మంత్రిపై చేసిన ఆరోపణలు నిజమంటూ పేర్కొన్నారు. ప్రణవ్‌బాబు చిన్న పిల్లాడని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలుస్తానని పేర్కొన్నారు.
రాజకీయ ఉనికి కోసమే..
రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని వొడితెల ప్రణవ్‌బాబు అన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబా న్ని అడ్డుపెట్టుకొని గెలిచిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.
ఉద్యోగాల పేరిట కౌశిక్‌రెడ్డి మోసం చేశారు
కోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్‌గౌడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కౌశిక్‌రెడ్డి ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment