సంచలనంగా మారిన‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయి వాగ్వాదం! | - | Sakshi
Sakshi News home page

సంచలనంగా మారిన‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయి వాగ్వాదం!

Published Thu, Jan 4 2024 12:48 AM | Last Updated on Thu, Jan 4 2024 9:05 AM

- - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి

కరీంనగర్/జమ్మికుంట/కొత్తూరు: హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో బుధవారం రాజకీయ గొడవకు దారి తీసింది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగడం సంచలనంగా మారింది. ఇరు పార్టీల నాయకులు వందలాదిగా 15 మంది కౌన్సిలర్లు ఉన్న ఫాంహౌస్‌ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రంగప్రవేశం.. చర్చలతో లొల్లి సద్దుమణిగింది. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న రాజేశ్వర్‌రావుపై ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొన్నగంటి మల్లయ్య వర్గం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా మల్లయ్య తనకు అనుకూలంగా ఉన్న వారిని మంగళవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఓ హోటల్‌లో క్యాంపు కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ప్రస్తుత చైర్మన్‌, ఆయన వర్గీయులు క్యాంపు నుంచి ఒక కౌన్సిలర్‌ను బయటకు రప్పించి, తమతో తీసుకెళ్లారు. అవిశ్వాస తీర్మానానికి ఇంకా సమయం ఉండటం.. క్యాంపు ప్రాంతాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు తెలుసుకోవడంతో మల్లయ్య వర్గం షాద్‌నగర్‌ కాంగ్రెస్‌ నాయకులను సంప్రదించింది. దీంతో కొత్తూరు మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి ఇన్ముల్‌నర్వ సమీపంలోని వైఎంతండా దగ్గర ఉన్న ఓ ఫాంహౌస్‌లో అదేరాత్రి వారికి బస ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న చైర్మన్‌, ఆయన అనుచరులు అర్ధరాత్రి ఫాంహౌస్‌ వద్దకు వచ్చి, గేటు తెరవాలని గొడవ చేయగా వారు మాజీ జెడ్పీటీసీకి సమాచారం ఇచ్చారు.

దీంతో శ్యాంసుందర్‌రెడ్డి ఉదయం ఫాంహౌస్‌ వద్దకు బయలుదేరారు. దారిలో కార్లు కనిపించడంతో వారిని వివరాలు అడిగే క్రమంలో వాగ్వాదం మొదలైంది. విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ కుమారుడు, కేశంపేట ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు విడివిడిగా పెద్ద సంఖ్యలో ఫాంహౌస్‌ వద్దకు చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను అక్రమంగా తీసుకొచ్చారని ఆరోపిస్తుండగా కాంగ్రెస్‌ నాయకులు పోలీసుల సమక్షంలో కౌన్సిలర్ల వద్దకు తీసుకెళ్లగా తమ ఇష్టంతోనే క్యాంపునకు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ క్రమంలోనే గేటు బయట ఇరువర్గాల నాయకులు తమ వారికి అనుకూలంగా నినాదాలు చేస్తూ నెట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకొని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

చైర్మన్‌ హత్యకు ప్లాన్‌ చేశారు..
జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు హత్యకు షాద్‌నగర్‌ నియోజకవరగంలోని కొత్తూరులో ప్లాన్‌ చేశారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జమ్మికుంట కౌన్సిలర్లను పొనగంటి మల్లయ్య ఓ రిసార్టులో నిర్బంధించారని, శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని కౌన్సిలర్లు సమాచారం ఇవ్వడం వల్లే చైర్మన్‌ కొత్తూరు వచ్చారని పేర్కొన్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు..
కౌన్సిలర్లు తమ ఇష్టంతోనే ఫాంహౌస్‌కు వచ్చినట్లు మాజీ జెడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు రఘు, మల్లయ్య తెలిపారు. ఇవేవీ తెలుసుకోకుండా తాము ప్రస్తుత చైర్మన్‌ రాజేశ్వర్‌రావును హత్య చేయడానికి సుపారీ తీసుకున్నామని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. నిజంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లను అక్రమంగా తీసుకొస్తే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఫాంహౌస్‌కు రావాలన్నారు. అర్ధరాత్రి వచ్చి ఎందుకు రెక్కీ నిర్వహించారని నిలదీశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు వాస్తవాలు దాచి అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

చర్యలు తీసుకోవాలి..
జమ్మికుంట మున్సిపల్‌ చైర్మన్‌పై దాడి చేసిన కాంగ్రెస్‌ నేత శ్యాంసుందర్‌రెడ్డితోపాటు పలువురిపై పోలీ సులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు కొత్తూ రు సీఐ నర్సింహారావుకు ఫిర్యాదు చేశారు.

ఇవి చ‌ద‌వండి: తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement