Pranav
-
‘పతంగ్’.. ఇదో కొత్తరకమైన స్పోర్ట్స్ డ్రామా
ఇప్పటి వరకు తెలుగు తెరపై చాలా స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. కబడ్డి, ఖోఖో, వాలీబాల్, క్రికెట్..ఇలా పలు ఆటలకు సంబంధించిన సినిమాలను చూశాం. కానీ ఇప్పుడు ఓ కొత్తరమైన స్పోర్ట్స్ డ్రామాను చూడబోతున్నాం. పతంగులతో పోటీ పడే సినిమా రాబోతుంది. అదే ‘పతంగ్’. ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 27నప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలకు చిత్ర టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఈ సినిమా థియేటర్లో యూత్‌ఫెస్టివల్‌లా వుంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో వుంటుంది అన్నారు. ఈ సినిమాకు కథే హీరో. ఈ చిత్రానికి జోస్ జిమ్మి అద్భుతమైన పాటలు ఇచ్చాడు. పాట వింటూంటే అందరిలో పాజిటివ్ వైబ్స్ కలుగుతాయి. తప్పకుండా మా పతంగ్ చిత్రం అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉంది. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. డిసెంబరు 27న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. -
ప్రణవ్ సవాల్ నేపథ్యంలో.. చెల్పూర్లో టెన్షన్.. టెన్షన్!
కరీంనగర్: మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ, అందులో నిజం ఉంటే హుజూరాబాద్ మండలం చెల్పూర్ హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్ విసిరిన సవాల్ మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.ప్రణవ్, పాడి కౌశిక్‌రెడ్డి అక్కడికి చేరుకుంటే పరిస్థితి ఏంటనే ఉత్కంఠ రోజంతా నెలకొంది. ప్రణవ్ పిలుపుమేరకు మంగళవారం ఉదయమే చెల్పూర్‌కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మోసం చేశారంటూ ఫ్లెక్సీ ఏర్పా టు చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరు కుని నిరసనకు దిగారు. ఆలయం వద్ద బీఆర్ఎస్– కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఏసీపీ శ్రీనివాస్‌జి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఇరువర్గాలతో మాట్లాడగా.. శాంతించకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బుర్రకుమార్ గౌడ్‌కు గాయాలయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు జమ్మికుంట, సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. కాగా.. వొడితల ప్రణవ్బాబును సింగాపూర్‌లో, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని వీణవంకలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.చెల్పూర్ లో ఏసీపీ శ్రీనివాస్ జితో వాగ్వాదానికి దిగుతున్న కాంగ్రెస్ నాయకులుతడి బట్టలతో ఎమ్మెల్యే ప్రమాణంవొడితెల ప్రణవ్ చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కరీంనగర్ సీపీకి ఫోన్‌చేసి, తనకు అనుమతి ఇవ్వాలంటూ కోరగా నిరాకరించారు. ఎమ్మెల్యే ఇంటివద్ద జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, సీఐ సృజన్‌రెడ్డి సిబ్బందితో మోహరించారు. పోలీసుల అనుమతి రాకపోవడంతో ఎమ్మెల్యే తడి బట్టలతో దేవుడి మీద ప్రమాణం చేసి తను మంత్రిపై చేసిన ఆరోపణలు నిజమంటూ పేర్కొన్నారు. ప్రణవ్‌బాబు చిన్న పిల్లాడని పేర్కొన్నారు. పోలీసులపై కాంగ్రెస్ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఈ ఘటనపై కేసులు నమోదు చేయాలని డీజీపీని కలుస్తానని పేర్కొన్నారు.రాజకీయ ఉనికి కోసమే..రాజకీయ ఉనికి కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అబద్ధపు ప్రమాణాలు చేస్తున్నారని వొడితెల ప్రణవ్‌బాబు అన్నారు. ఎన్నికల సమయంలో కుటుంబా న్ని అడ్డుపెట్టుకొని గెలిచిన వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకోమన్నారు.ఉద్యోగాల పేరిట కౌశిక్‌రెడ్డి మోసం చేశారుకోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరేళ్ల మహేందర్‌గౌడ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేశారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసిన కౌశిక్‌రెడ్డి ఈ విషయమై సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కేవలం ఉనికి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపారు. -
Pranav Shukla: పండుటాకులే పిల్లలుగా...
దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతుంటాయి. వాటిలో కొన్ని మనల్ని కదిలించి ఆలోచింపచేస్తాయి. మరికొన్ని సందర్భాలు భవిష్యత్‌నే మార్చేస్తాయి. అలాంటి ఓ సంఘటన ప్రణవ్ శుక్లా జీవితాన్ని మార్చేసి సామాజికవేత్తగా తీర్చిదిద్దింది. వందలమంది వృద్ధులను చేరదీసి వారి ఆలన పాలన చూసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాడు ప్రణవ్. హరియాణలోని ఫరిదాబాద్‌కు చెందిన వ్యక్తి ప్రణవ్ నారాయణ్ శుక్లా. ప్రణవ్ శుక్లా ప్రొఫెసర్ కొడుకు కావడంతో ఇంటర్మీడియట్ తరువాత మెడిసిన్ చదవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మెడిసిన్‌లో చేరాడు. కానీ ఫ్యాషన్ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడడంతో నెలరోజుల తరువాత మెడిసిన్ మానేసాడు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. అయినా తనకిష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్‌ను కష్టపడి చదివి ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. కాలేజీ రోజుల్లో... ప్రణవ్ శుక్లా ఫ్యాషన్ డిజైనింగ్ చదివేటప్పుడు రోజూ కాలేజీకి ట్రైన్లో వెళ్తుండేవాడు. ఒకసారి ట్రైన్ ఎక్కేందుకు ఓక్లా స్టేషన్‌కు చేరుకున్నాడు. అది చలికాలం కావడంతో ప్లాట్‌ఫాం మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో ప్లాట్‌ఫాం పైన ఒక మూలన ఒక వృద్ధుడు చలికి వణికిపోతూ అల్లాడిపోతున్నాడు. అదిచూసి చలించిపోయిన ప్రణవ్ తను ఎంతో ఇష్టంతో కొనుక్కున్న జాకెట్‌ను ఆ వృద్ధుడికి ఇచ్చాడు. అప్పుడు అతడి కళ్లలో చూసిన ఆనందం ప్రణవ్‌కు చాలా సంతృప్తినిచ్చింది. తను జీవితంలో ఆర్థికంగా నిలదొక్కుకున్న తరువాత వృద్ధుల బాగోగులను చూసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. ఆనందాల, ఆత్మీయతల ఆశ్రమం.. ప్రణవ్ ఉద్యోగంలో చేరాక కొంతమొత్తాన్ని దాచుకుని వృద్ధులకు ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. çకొంతమొత్తం జమయ్యాక.. నిరాశ్రయులైన వృద్ధులకు బియ్యం, పప్పులు, దుస్తులు వంటి నిత్యావసరాలు సమకూర్చేవాడు. అయితే వారి అవసరాలు తీర్చడానికి మరిన్ని సదుపాయాలు అవసరం అని భావించి... 1996లో ‘అనడి సేవా ప్రకల్ప్’ పేరిట ఓల్డేజ్ హోమ్‌ను ఏర్పాటు చేశాడు. అప్పుడు ప్రణవ్‌కు పంతొమ్మిదేళ్లు. వసతి సదుపాయాలు లేక అనాథలుగా మారిన ఒంటరి వృద్ధులను చేరదీసి వసతి, కడుపునిండా ఆహారం పెట్టడం, అవసరమైన ఆరోగ్య అవసరాలు తీర్చుతూ వృద్ధుల జీవననాణ్యతను మెరుగుపరిచాడు. ఒకపక్క ప్రణవ్ ఉద్యోగం చేస్తూనే అనడిని చూసుకునేవాడు. కొన్నాళ్ల తరువాత పూర్తి సమయాన్ని ఆశ్రమానికి కేటాయించడం కోసం 2017లో ఉద్యోగం వదిలేశాడు. అప్పటినుంచి మరింత సమయాన్ని కేటాయించి ఆశ్రమంలోని వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవడం మొదలు పెట్టాడు. వారికి అవసరమైన వైద్యసదుపాయాలు సకాలంలో అందిస్తూ వారిని ఆనందంగా ఉంచేందుకు తనవంతు కృషి చేస్తున్నాడు. ఆవులు పెంచుతూ... ఆశ్రమాన్ని నడిపేందుకు.. అవసరమైన ఖర్చుల కోసం అనడి ఫారమ్స్ అండ్ గోదామ్ పేరిట ఆవుల పెంపకాన్ని ప్రారంభించాడు. రెండువందల ఆవులను పెంచుతూ.. వాటి ద్వారా వచ్చే పాలు, పెరుగు, నెయ్యిని విక్రయిస్తూ వచ్చిన ఆదాయాన్ని అనడి ఆశ్రమ వృద్ధుల కోసం ఖర్చు చే స్తున్నాడు. గత ఇరవై ఆరేళ్లుగా అనడీలో ఎంతోమంది వృద్ధులు ఆశ్రయం పొందారు. మలివయస్కుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నలభై ఆరేళ్ల ప్రణవ్ సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు, గౌరవ సత్కారాలు దక్కడంలో ఆశ్చర్యం లేదు. అందుకే పిల్లలు వద్దనుకున్నాం కాలేజ్ డేస్‌లో తీసుకున్న నిర్ణయం ఈరోజు ఇంతమందికి ఆశ్రయం కల్పిస్తోంది. పెద్దవారికి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం ఆశ్రమంలో నలభైæరెండు మంది వృద్ధులు ఉన్నారు. వారిని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాము. అందుకే నేను, నా భార్య పిల్లలు వద్దు అనుకున్నాము. -
Grandmaster status: భారత 76వ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రణవ్ ఆనంద్
ఈ ఏడాది భారత్ నుంచి మరో కుర్రాడు చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న 76వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రొమేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–16 విభాగంలో టైటిల్ సాధించిన ప్రణవ్ 2500 ఎలో రేటింగ్ మైలురాయిని కూడా దాటాడు. దాంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. నిబంధనల ప్రకారం జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించడంతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు ఉండాలి. గత జూలైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ చెస్ ఫెస్టివల్లో ప్రణవ్ మూడో జీఎం నార్మ్ సాధించాడు. ఈ సంవత్సరం భరత్ సుబ్రమణియమ్ (తమిళనాడు), రాహుల్ శ్రీవత్సవ్ (తెలంగాణ), ప్రణవ్ వెంకటేశ్ (తమిళనాడు) జీఎం హోదా సాధించారు. -
తండ్రి డబ్బు, లోన్‌తో నిర్మాణరంగ ప్రయాణం మొదలెట్టి.. 26 ఏళ్లకే!
Pranav Sharma Inspirational Journey: ఇల్లు కట్టి చూడు... అంటారు ఇంటినిర్మాణం కష్టాలు చెప్పేలా. ఒక్క ఇల్లు ఏం ఖర్మ...పాతికేళ్ల వయసులోనే వెయ్యి ఇండ్లను నిర్మించి, దిగువ మధ్యతరగతి వారి సొంత ఇంటి కలను నిజం చేశాడు ప్రణవ్ శర్మ, ఫెలిసిటీ అడోబ్, ఫౌండర్. కడుపులో చల్ల కదలకుండా చల్లగా ఉద్యోగం చేసుకోవడం అంటే కొందరికి ఇష్టం. కొందరికి మాత్రం ఆ చల్లదనం వేడిపుట్టిస్తుంది. ఫైర్‌ను ప్రజ్వరిల్లేలా చేస్తుంది. ప్రణవ్‌శర్మ రెండో కోవకు చెందిన యువకుడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు ఇరవైకిలోమీటర్ల దూరంలో ఉన్న టైర్2 సిటీ సంగనేర్‌కు చెందిన శర్మ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. చదువు పూర్తికాగానే బెంగళూరులోని డెలాయిట్‌లో మెనేజ్మెంట్ ఇంటర్న్‌గా చేరాడు. ఆరోజుల్లో ఒకరోజు ‘ప్రధాన మంత్రి ఆవాస్ యెజన’ గురించి విన్న తరువాత తనలో ఒక ఐడియా మెరిసింది. ఆరునెలలు ఉద్యోగం చేసిన తరువాత, ఆ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పి ‘ఫెలిసిటీ అడోబ్’ అనే నిర్మాణసంస్థను మొదలుపెట్టాడు. తండ్రి అశోక్‌శర్మ రిటైర్డ్ ఆయుర్వేద వైద్యుడు. ఆయన దగ్గర తీసుకున్న డబ్బు, లోన్‌తో తన నిర్మాణరంగ ప్రయాణం మొదలైంది. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఈ రిస్క్ ఎందుకు!’ ‘నిర్మాణరంగం అంటేనే రిస్క్. కాకలు తీరినవారు కూడా ఖంగు తింటుంటారు’....ఇలాంటి మాటలు అతడికి వినిపించాయి. వాటిని ప్రణవ్ పెద్దగా పట్టించుకోలేదు. టైర్ సిటీలలో సొంత ఇల్లు అనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతుంది. టైర్సిటీకి చెందిన తనకు కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, శానిటైజేషన్, స్వచ్ఛమైన తాగునీరు, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్....మొదలైన విషయాల గురించి అవగాహన ఉంది. ‘స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన అంశాలను కాలేజీలో కంటే బయటే ఎక్కువ నేర్చుకున్నాను’ అంటాడు శర్మ. ‘ఇంటి అద్దె ఖర్చులతోనే సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి’ అనే ప్రకటనతో రంగంలోకి దిగాడు. నెల తిరగకుండానే 300 అప్లికేషన్లు వచ్చాయి. బుకింగ్ అడ్వాన్స్‌లు వచ్చాయి. ఈ సంతోషం ఆవిరి అయ్యేలా అప్లికేషన్లను బ్యాంకులో సమర్పిస్తున్నప్పుడు సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో యాక్సిస్, హెచ్డీఎఫ్సీ,ఐసీఐసీఐ...మొదలైన బ్యాంకుల నుంచి అప్రూవల్ ప్రాసెస్ గురించి సలహాలు, సూచనలు తీసుకున్నాడు. లోన్ ప్రాసెస్ గురించి క్లయింట్స్‌కు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. అలా తొలిదశలో స్వర్ణగృహ–1 పదహారు నెలల్లో పూర్తయింది. ‘తక్కువ ధర, తక్కువ కాలం’ అయినంత మాత్రాన నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు శర్మ. తుమకూర్, వసంతనరసపుర(కర్నాటక)లో రెండో దశ నిర్మాణం పూర్తయింది. కోలార్‌లో మూడో దశ మొదలైంది. బెల్గామ్‌లోని బెల్గవిలో నాలుగో దశ నిర్మాణం మొదలుకానుంది. 2028 నాటికి 50,000 హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని 26 ఏళ్ల ఈ యంగ్బిల్డర్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా కరువుపీడిత ప్రాంతాలలో సోలార్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం రంగంలోకి దిగాడు. ‘నా విజయం యువతరానికి స్ఫూర్తి ఇచ్చి, సొంతకాళ్ల మీద నిలబడే ధైర్యాన్ని ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంది!’ అంటున్నాడు ప్రణవ్ శర్మ. ‘కొందరికి తమ విజయాల గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వారు చేసిన పనే మాట్లాడుతుంది. ప్రణవ్‌శర్మ ఈ కోవకు చెందిన వ్యక్తి’ అని ప్రశంసిస్తున్నారు నేషనల్ బ్యాంక్, హోమ్లోన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ప్రకాష్. చదవండి👉🏾 చిరుద్యోగి నుంచి సీయీవో దాకా! -
ప్రణవ్–కృష్ణ ప్రసాద్ జంట పరాజయం
బార్సిలోనా (స్పెయిన్): బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా–గారగ కృష్ణ ప్రసాద్ (భారత్) జంట తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణవ్–కృష్ణ ప్రసాద్ ద్వయం 21–19, 16–21, 7–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డారెన్ లియు (మలేసియా)తో హెచ్ఎస్ ప్రణయ్; వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో అజయ్ జయరామ్; శుభాంకర్ డేతో కిడాంబి శ్రీకాంత్; లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైవోని లీ (జర్మనీ)తో సైనా నెహ్వాల్ ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీని సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట ‘ఢీ’కొంటుంది. -
సీఎం షేక్ హ్యాండ్... కాలితో సెల్ఫీ!
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేయి కలిపిన ఈ దివ్యాంగ యువకుడి పేరు ప్రణవ్ ఎంబీ. 22 ఏళ్ల ఈ యువకుడికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితే వైకల్యానికి కుంగిపోకుండా దృఢచిత్తంతో చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. కాళ్లతోనే అత్యద్భుత చిత్రాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. వైకల్యం తన దేహానికే కాని మనసుకు లేదని తాజాగా మరోసారి నిరూపించాడు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ప్రణవ్ ఔదార్యానికి ముగ్దులైన సీఎం పినరయి విజయన్.. అతడి గురించి తన ఫేస్బుక్ పేజీలో రాశారు. ‘ఈరోజు లెజిస్లేటివ్ కార్యాలయానికి రాగానే కలకాలం గుర్తుండిపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అలాచూర్ ప్రాంతానికి చిత్రకారుడు ప్రణవ్ తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు సాయం అందించేందుకు నా దగ్గరకు వచ్చాడు. అతడికి రెండు చేతులూ లేవు. టీవీ రియాలిటీ షోలో సంపాదించిన మొత్తాన్ని చెక్ రూపంలో అతడు విరాళంగా ఇచ్చాడు. ప్రణవ్‌కు రెండు చేతులుగా నిలిచిన అతడి తల్లిదండ్రులు బాలసుబ్రమణియన్, స్వర్ణకుమారితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేడీ ప్రసన్న కూడా వచ్చారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకం తనకు వంద శాతం ఉందని నాతో ప్రణవ్ చెప్పాడు. అతడు అందించిన విరాళం ఎంతో గొప్పది. పలక్కాడ్ జిల్లాలోని చిత్తూర్ ప్రభుత్వ కాలేజీ నుంచి బీకామ్ పూర్తిచేసిన ప్రణవ్ ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలిపాడు. నాతో చాలా సేపు మాట్లాడాడు. కాలితో సెల్ఫీ తీసుకుని ఆశ్చర్యానికి గురిచేశాడ’ని విజయన్ పేర్కొన్నారు. సహృదయం చాటుకున్న ప్రణవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాడు ప్రణవ్. గతేడాది వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తన పెయింటింగ్స్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని సహాయంగా అందించాడు. ఏప్రిల్ 23న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రణవ్ తొలిసారిగా ఓటు వేశాడు. కుడి కాలి రెండో వేలుతో ఈవీఎం మీట నొక్కి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓనమ్ పండుగ సందర్భంగా ప్రణవ్ గురించి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడి ప్రతిభ, పట్టుదల తనకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయని ట్విటర్ ద్వారా ప్రశంసించాడు. ప్రణవ్ కాలితో గీసిన ఫొటోను తనకు ఇస్తున్న ఫొటోలను సచిన్ షేర్ చేశాడు. -
ఒంగోలులో బాలుడి కిడ్నాప్
-
సింగిల్స్ చాంప్స్ ప్రణవ్, అభిలాష
సాక్షి, తెనాలి: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అండర్–15 విభాగంలో మూడు టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు. బాలుర సింగిల్స్‌లో గంధం ప్రణవ్ రావు, బాలికల సింగిల్స్‌లో అభిలాష విజేతలుగా నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో పుల్లెల సాయివిష్ణు–ప్రణవ్ రావు జంట చాంపియన్‌గా అవతరించింది. అండర్–15 బాలుర ఫైనల్లో ప్రణవ్ రావు (తెలంగాణ) 15–21, 23–21, 21–4తో జయంత్ రాణా (హరియాణా)పై గెలుపొందాడు. బాలికల ఫైనల్లో అభిలాష (తెలంగాణ) 21–6, 21–12తో తస్నీమ్ (గుజరాత్)ను ఓడించింది. బాలుర డబుల్స్ టైటిల్ పోరులో ప్రణవ్ రావు–సాయివిష్ణు ద్వయం 21–14, 21–23, 21–12తో జయంత్ రాణా (హరియాణా)–షేక్ అర్షద్ (ఆంధ్రప్రదేశ్) జంటపై విజయం సాధించింది. -
అండర్-13 సింగిల్స్ చాంప్ ప్రణవ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అండర్-13 బాలుర సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గంధం ప్రణవ్ రావు విజేతగా నిలిచాడు. విజయవాడలోని డీఆర్ఎంసీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ప్రణవ్ రావు 21-12, 21-16తో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై నెగ్గి చాంపియన్ అయ్యాడు. అండర్-15 బాలికల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి మోపాటి కేయూర టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఫైనల్లో కేయూర మోపాటి (తెలంగాణ)- కవిప్రియ (పాండిచ్చేరి) జంట 21-14, 21-19తో అనన్య ప్రవీణ్- మేధ శశిధరన్ (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. బాలికల సింగిల్స్ విభాగంలో మేఘనా రెడ్డి (తెలంగాణ) 19- 21, 19-21తో అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ రావు- సాయి విష్ణు పుల్లెల (తెలంగాణ) జంట 16-21, 15-21తో వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్కృష్ణ (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అవంతిక పాండే- అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరాఖండ్) జంట 21-8, 21-16తో శ్రీయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జోడీపై నెగ్గింది. -
మరో స్టార్ వారసుడొస్తున్నాడు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన కొడుకు ప్రణవ్ను హీరోగా పరిచయం చేయాలని భావిస్తున్నాడు. మలయాళ చిత్ర పరిశ్రమకే చెందిన మరో స్టార్ హీరో మమ్ముట్టి తన కుమారుడు సల్మాన్‌ను వెండితెరపై పరిచయం చేసిన తరహాలో మోహన్ లాల్ కూడా తన కొడుకును గ్రాండ్‌గా తీసుకురావాలనుకుంటున్నట్టు సన్నిహితులు చెప్పారు. ప్రణవ్ కోసం మోహన్ లాల్ స్క్రిప్టులు వింటున్నట్టు సమాచారం. కాగా ప్రణవ్ ఇదివరకే బాలనటుడిగా నటించాడు. 2002 కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ బాలనటుడిగా అవార్డు అందుకున్నాడు. ఇక ప్రణవ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. లైఫ్ ఆఫ్ జోసుట్టి సినిమాకు దర్శకుడు జీతు జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా చేశాడు. సల్మాన్ 26 ఏళ్ల వయసులో హీరోగా పరిచయమయ్యాడు. ఇప్పుడు ప్రణవ్ వయసు కూడా 26 ఏళ్లే. ప్రణవ్‌పై అంచనాలు భారీగా ఉంటాయని, దీనికి తగినట్టుగా ప్రాజెక్టు ప్లాన్ చేయాలని మోహన్ లాల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
నిమ్మగడ్డవారి పెళ్లివేడుకలో ప్రముఖులు
-
వయసు చూస్తే ఏడేళ్లు...కానీ
వయసు చూస్తే ఏడేళ్లు. కానీ ఘనతలకు లెక్కే లేదు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న ఎస్.ప్రణవ్... స్కేటింగ్‌తో రికార్డులు స్వీప్ చేస్తున్నాడు. అబ్బుర పరిచే విన్యాసాలతో ఏడు ప్రపంచ రికార్డులు దక్కించుకున్నాడు. ఇటీవల నగరంలో జరిగిన ఈవెంట్లో రెయిన్బో ఫీట్లో వరల్డ్ రికార్డు సాధించిన ప్రణవ్ ప్రతిభకు మెచ్చి... ఆర్గనైజేషన్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ డెవలప్మెంట్ ‘లిటిల్ ఆర్కిడ్’ అవార్డుతో సన్మానించింది. ఈ సందర్భంగా ఈ వండర్ కిడ్ ‘సిటీ ప్లస్’తో తాను సాధించిన రికార్డుల గురించి ముచ్చటించాడు. ఇందిరాపార్కులో జరిగిన ఈవెంట్లో కళ్లకు గంతలు కట్టుకొని.. కాళ్లకు స్కేట్స్, మెడలో కీబోర్డు తగిలించుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ కీబోర్డు మీద ఒక్క గంటలోనే 20 గీతాలను వాయించా. గణనాయక శ్లోకంతో ప్రారంభించి దేశభక్తి గీతం సారే జహా సే అచ్ఛాతో ముగించా. వరల్డ్ రికార్డ్స్ రెయిన్బో ఫీట్‌ను సాధించా. ఒకే వేదిక మీద ఏడు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తా’... ఇది ప్రణవ్ మాట. ఈ బుడతడిని చూస్తుంటే అతడిలో ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడతాయి. అమ్మానాన్న ప్రోత్సాహం వల్లే... ‘నేను ఇన్ని రికార్డులు సాధించడం వెనుక తల్లి దండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. మా నాన్న శ్రీనివాస్ హెచ్ఎండీఏలో ఏఈఓ. అమ్మ జయంతి మదీనా డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్. చిన్నప్పటి నుంచీ వారి ప్రోత్సాహమే నా ప్రదర్శన. నాలుగేళ్ల వయసులో స్కేటింగ్ శిక్షణ తీసుకుంటున్నా. 2012లో సుందరయ్య కళా నిలయంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నా. స్కేటింగ్ కోచ్‌లు నూర్ మహమ్మద్, రతన్ సింగ్‌ల సహకారం ఎంతో ఉంది. అందరి ప్రోత్సాహంతోనే ఈ రికార్డులు సాధించగలిగా’ అంటూ ఎంతో ఉల్లాసంగా చెప్పుకొచ్చిన ప్రణవ్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షిస్తూ... ‘సిటీ ప్లస్’ ఆల్ ది బెస్ట్ చెబుతోంది. వాంకె శ్రీనివాస్ సెవెన్ రికార్డ్స్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యునిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ -
థ్యాంక్యూ డాడీ!
నేడు వరల్డ్ ఆటిజమ్ డే ఆ అబ్బాయి పేరు ప్రణవ్. మంచి స్విమ్మర్. మార్షల్ ఆర్ట్స్ వచ్చు. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ దిట్ట. సైకిలెక్కితే... ఇక దూకుడే! ఇప్పుడు స్పెషల్ ఒలింపిక్స్‌కూ సెలక్టయ్యాడు. తొమ్మిదేళ్ల గుర్రంకొండ ప్రణవ్ పేరుకు ముందు ఇలాంటి ప్రశంసలు పదుల సంఖ్యలో చేర్చవచ్చు. కానీ ఒక ఆటిజం కుర్రాడిని ఇన్ని అంశాల్లో మేటిగా మార్చింది మాత్రం అతని తండ్రి ప్రవీణ్. సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నతోద్యోగిగా కన్నా ఒక ఆటిజం చిన్నారిని తీర్చిదిద్దిన తండ్రిగా ఆయనకు అమెరికాలో లభిస్తున్న గౌరవం అపారం. ‘‘నెల్లూరులో పుట్టి పెరిగాను. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగరీత్యా 1999లో అమెరికాకు వెళ్ళాను. మా ఊరికే చెందిన మమతను వివాహం చేసుకున్నాను. ప్రణవ్ మాకు తొలి సంతానం. హుషారుగా ఉండేవాడు. నెలల వయసులోనే నోటితో శబ్దాలు చేస్తుంటే ‘‘త్వరగా మాటలొచ్చేస్తాయ్’’ అనేవారంతా. వాస్తవంలో అలా జరగలేదు. ప్రణవ్‌కు ఏడాదిన్నర వయసప్పుడు పిలిచినా పలికేవాడు కాదు. నిద్ర సరిగా పోయేవాడు కాదు. తోటి పిల్లలతో కలవలేకపోయేవాడు. మాట రాలేదు. స్పీచ్ పాథాలజిస్ట్, న్యూరాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, డెవలప్మెంట్ పిడియాట్రీషియన్లను కలిశాం. రెండో బిడ్డ కృతిక్ పుట్టడానికి మూణ్నెల్ల ముందు ప్రణవ్‌కు ‘ఆటిజం’ అని నిర్ధారించారు. ఒక సంతోషాన్ని ఒక ఆవేదనను ఎలా సమన్వయం చేసుకోవాలో, అసలు ‘ఆటిజం’ అంటే ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఏమైతేనేం ప్రణవ్‌కు మమ్మల్ని తల్లిదండ్రుల్ని చేయాలన్న భగవంతుడి నిర్ణయాన్ని మేం అంగీకరించాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లాడి బాగోగులు చూసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడనుకున్నాం. ఉద్యోగానికి గుడ్‌బై... ఆటిజంపై యుద్ధం ప్రకటించాను. జీతం గురించి పట్టించుకోకుండా చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి బాగా తీరిక ఉండే ఉద్యోగం చూసుకున్నాను. అంధత్వం, ఆటిజం, డౌన్ససిండ్రోమ్, ఎపిలెప్సీ, సెన్సరీ, స్పీచ్ డిజార్డర్స్, సెరెబ్రల్ పాల్సీ లాంటి తీవ్ర సమస్యలున్న పిల్లల తల్లిదండ్రుల్ని కలిశాను. కౌంటీ సర్వీసెస్వారిని సంప్రదిస్తే మాకో ఎర్లీ చైల్డ్ హుడ్ టీచర్‌ను కుదిర్చారు. ప్రణవ్‌తో ఎలా ఆడుకోవాలి? తనకి ఎలా నేర్పాలి? వంటివి నేర్చుకోవడానికి మేం మళ్లీ విద్యార్థులమయ్యాం. బలహీనత చూడలేదు... నేను, నా భార్య మా జీవనశైలిని మార్చుకున్నాం. ఆలోచనాధోరణినీ, కెరీర్లు, లక్ష్యాలనూ మార్చుకున్నాం. ఆటిజంను దూరం చేయలేమని తెలిశాక ప్రణవ్ బలహీనతల్ని పట్టించుకోవడం మానేసి సామర్థ్యాలను పెంపొందించే పనిలో పడ్డాం. ‘ప్రత్యేక’ పిల్లలున్న తల్లిదండ్రులు ఎటువంటి థెరపీలు ఫాలో అవుతున్నారు? పిల్లలెలా స్పందిస్తున్నారు? మందులు పనిచేస్తున్నాయా? సమాచారం సేకరించాం. ఆటిజం సంబంధిత సమస్యలపై సెమినార్లయినా, అవగాహన కార్యక్రమాలైనా తప్పకుండా హాజరవుతూ వచ్చాం. ఆటిజం టీచర్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్పెషల్ చిల్డ్రన్ కోసం టెక్నాలజీ, బొమ్మలు, పుస్తకాల వంటివి తయారు చేసే వ్యక్తులు - ఇలా అందరం బృందంలా ఏర్పడ్డాం. ఆ సమయంలోనే మాకు రెండో అబ్బాయి కృతిక్ పుట్టాడు. నేర్పడానికి నేర్చుకున్నాం... ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ ఎబిఎ థెరపీ... వీటన్నింటిలో ప్రణవ్ను చేర్చాం. వాడితో సంభాషించడానికి మమత, నేను సైగల భాషను నేర్చుకున్నాం. స్పీచ్ టూల్స్, ఆక్యుపేషనల్ టెక్నిక్స్, సెన్సరీ ఇంటిగ్రేషన్ టెక్నిక్స్, టీచింగ్ సోషల్ బిహేవియర్ ఇస్యూస్... అలవరచుకున్నాం. ఎడ్యుకేషన్ చార్ట్‌లు, బొమ్మలు, సెన్సరీ టూల్స్, డివిడిలు, బుక్స్ వంటివాటితో ఇంటిని నింపేశాం. ప్రణవ్‌తో సహా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ తరగతుల్లో చేరాను. ప్రణవ్‌కు సంగీతం నేర్పడానికి నా భార్య దక్షిణ భారతీయ కర్ణాటక సంగీత తరగతుల్లో చేరింది. ఆటిజం కిడ్స్‌కు మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపకరిస్తాయని కరాటే అకాడమీలో శిక్షణ పొంది ఇంట్లోనే ప్రణవ్‌కు తర్ఫీదునిచ్చాను. గుడ్‌నైట్ డాడీ... గుడ్‌నైట్ మమ్మీ... మా శ్రమ ఫలిస్తోంది. ప్రస్తుతం ప్రణవ్‌కు తొమ్మిదేళ్లు. ఫిగర్ స్కేటింగ్‌తో పాటు 6 రకాల ఈత కొట్టే వెరైటీలతో లెవల్ ఫోర్ స్విమ్మర్ (ల్యాప్ స్విమ్మింగ్)గా స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. సైక్లింగ్ చేస్తాడు. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఇంటరాక్టివ్ వీడియోగేమ్స్ ఆడతాడు. పుస్తకాలు చదువుతాడు. పదరంగాలు, పజిల్స్ చేస్తాడు. అయితే ఇదంతా నా ఒక్కడి వల్లే కాలేదు. దీని కోసం నేను నా ఉద్యోగంతో పాటు చాలా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మా పెద్ద బావ, బంధువులు, స్నేహితులు నా బాధ్యతలు తమ నెత్తి మీద వేసుకొని, నేను పూర్తిగా ప్రణవ్ మీద దృష్టి కేంద్రీకరించడానికి తోడ్పడ్డారు. ప్రతి రాత్రీ ‘‘ గుడ్‌నైట్ డాడీ, మమ్మీ, గుడ్‌నైట్ కృతిక్’’ అంటూ ప్రణవ్ చెప్పే మాటల్లో ఎనలేని సంతోషం కనపడుతుంది. అదే నేను కోరుకుంది. ప్రణవ్ ఈరోజు ఏదో చేయడం లేదని నేనెప్పుడూ బాధపడింది లేదు. తన భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయిందీ లేదు’’అంటారు ప్రవీణ్ . ఏడేళ్ల పాటు తదేక ధ్యానంలా తన కొడుకు జీవితాన్ని తీర్చిదిద్ది, ఆటిజం మీద అనూహ్యమైన విజయాన్ని సాధించి ఎందరో తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికా వైద్యులకు సైతం సలహాదారుగా మారారు ప్రవీణ్.