థ్యాంక్యూ డాడీ! | Thank you Daddy! | Sakshi
Sakshi News home page

థ్యాంక్యూ డాడీ!

Published Wed, Apr 2 2014 1:10 AM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

థ్యాంక్యూ డాడీ! - Sakshi

థ్యాంక్యూ డాడీ!

నేడు వరల్డ్ ఆటిజమ్ డే
 
 ఆ అబ్బాయి పేరు ప్రణవ్.
 మంచి స్విమ్మర్.
 మార్షల్ ఆర్ట్స్ వచ్చు.
 హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ దిట్ట.
 సైకిలెక్కితే... ఇక దూకుడే!
 ఇప్పుడు స్పెషల్ ఒలింపిక్స్‌కూ సెలక్టయ్యాడు.


 తొమ్మిదేళ్ల గుర్రంకొండ ప్రణవ్ పేరుకు ముందు ఇలాంటి ప్రశంసలు పదుల సంఖ్యలో చేర్చవచ్చు. కానీ ఒక ఆటిజం కుర్రాడిని ఇన్ని అంశాల్లో మేటిగా మార్చింది మాత్రం అతని తండ్రి ప్రవీణ్. సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉన్నతోద్యోగిగా కన్నా ఒక ఆటిజం చిన్నారిని తీర్చిదిద్దిన తండ్రిగా ఆయనకు అమెరికాలో లభిస్తున్న గౌరవం అపారం.    
 
‘‘నెల్లూరులో పుట్టి పెరిగాను. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగరీత్యా 1999లో అమెరికాకు వెళ్ళాను. మా ఊరికే చెందిన మమతను వివాహం చేసుకున్నాను. ప్రణవ్  మాకు తొలి సంతానం. హుషారుగా ఉండేవాడు. నెలల వయసులోనే నోటితో శబ్దాలు చేస్తుంటే ‘‘త్వరగా మాటలొచ్చేస్తాయ్’’ అనేవారంతా. వాస్తవంలో అలా జరగలేదు. ప్రణవ్‌కు ఏడాదిన్నర వయసప్పుడు పిలిచినా పలికేవాడు కాదు. నిద్ర సరిగా పోయేవాడు కాదు. తోటి పిల్లలతో కలవలేకపోయేవాడు. మాట రాలేదు. స్పీచ్ పాథాలజిస్ట్, న్యూరాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, డెవలప్‌మెంట్ పిడియాట్రీషియన్‌లను కలిశాం. రెండో బిడ్డ కృతిక్ పుట్టడానికి మూణ్నెల్ల ముందు ప్రణవ్‌కు ‘ఆటిజం’ అని నిర్ధారించారు. ఒక సంతోషాన్ని ఒక ఆవేదనను ఎలా సమన్వయం చేసుకోవాలో,  అసలు ‘ఆటిజం’ అంటే ఏమిటో  అర్థం  కాని పరిస్థితి. ఏమైతేనేం ప్రణవ్‌కు మమ్మల్ని తల్లిదండ్రుల్ని చేయాలన్న భగవంతుడి నిర్ణయాన్ని మేం అంగీకరించాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లాడి బాగోగులు చూసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడనుకున్నాం.
 
ఉద్యోగానికి గుడ్‌బై...


 ఆటిజంపై యుద్ధం ప్రకటించాను. జీతం గురించి పట్టించుకోకుండా చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి బాగా తీరిక ఉండే ఉద్యోగం చూసుకున్నాను. అంధత్వం, ఆటిజం, డౌన్‌‌ససిండ్రోమ్, ఎపిలెప్సీ, సెన్సరీ, స్పీచ్ డిజార్డర్స్, సెరెబ్రల్ పాల్సీ లాంటి తీవ్ర సమస్యలున్న పిల్లల తల్లిదండ్రుల్ని కలిశాను. కౌంటీ సర్వీసెస్‌వారిని సంప్రదిస్తే మాకో ఎర్లీ చైల్డ్ హుడ్ టీచర్‌ను కుదిర్చారు. ప్రణవ్‌తో ఎలా ఆడుకోవాలి? తనకి ఎలా నేర్పాలి? వంటివి నేర్చుకోవడానికి మేం మళ్లీ విద్యార్థులమయ్యాం.  
 
బలహీనత చూడలేదు...

 
నేను, నా భార్య మా జీవనశైలిని మార్చుకున్నాం. ఆలోచనాధోరణినీ, కెరీర్లు, లక్ష్యాలనూ మార్చుకున్నాం. ఆటిజంను దూరం చేయలేమని తెలిశాక ప్రణవ్ బలహీనతల్ని పట్టించుకోవడం మానేసి  సామర్థ్యాలను పెంపొందించే పనిలో పడ్డాం. ‘ప్రత్యేక’ పిల్లలున్న తల్లిదండ్రులు ఎటువంటి థెరపీలు ఫాలో అవుతున్నారు? పిల్లలెలా స్పందిస్తున్నారు? మందులు పనిచేస్తున్నాయా?  సమాచారం సేకరించాం. ఆటిజం సంబంధిత సమస్యలపై సెమినార్లయినా, అవగాహన కార్యక్రమాలైనా తప్పకుండా హాజరవుతూ వచ్చాం.   ఆటిజం టీచర్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్పెషల్ చిల్డ్రన్ కోసం టెక్నాలజీ, బొమ్మలు, పుస్తకాల వంటివి తయారు చేసే వ్యక్తులు - ఇలా అందరం బృందంలా ఏర్పడ్డాం. ఆ సమయంలోనే మాకు రెండో అబ్బాయి కృతిక్ పుట్టాడు.  

నేర్పడానికి నేర్చుకున్నాం...
 
ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ ఎబిఎ థెరపీ... వీటన్నింటిలో ప్రణవ్‌ను చేర్చాం. వాడితో సంభాషించడానికి మమత, నేను సైగల భాషను నేర్చుకున్నాం. స్పీచ్ టూల్స్, ఆక్యుపేషనల్ టెక్నిక్స్, సెన్సరీ ఇంటిగ్రేషన్ టెక్నిక్స్, టీచింగ్ సోషల్ బిహేవియర్ ఇస్యూస్... అలవరచుకున్నాం. ఎడ్యుకేషన్ చార్ట్‌లు, బొమ్మలు, సెన్సరీ టూల్స్, డివిడిలు, బుక్స్ వంటివాటితో ఇంటిని నింపేశాం. ప్రణవ్‌తో సహా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ తరగతుల్లో చేరాను. ప్రణవ్‌కు సంగీతం నేర్పడానికి నా భార్య దక్షిణ భారతీయ కర్ణాటక సంగీత తరగతుల్లో చేరింది.   ఆటిజం కిడ్స్‌కు మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపకరిస్తాయని  కరాటే అకాడమీలో శిక్షణ పొంది ఇంట్లోనే ప్రణవ్‌కు తర్ఫీదునిచ్చాను.

 గుడ్‌నైట్ డాడీ... గుడ్‌నైట్ మమ్మీ...

 మా శ్రమ ఫలిస్తోంది. ప్రస్తుతం ప్రణవ్‌కు తొమ్మిదేళ్లు. ఫిగర్ స్కేటింగ్‌తో పాటు 6 రకాల ఈత కొట్టే వెరైటీలతో లెవల్ ఫోర్ స్విమ్మర్ (ల్యాప్ స్విమ్మింగ్)గా స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. సైక్లింగ్ చేస్తాడు. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఇంటరాక్టివ్ వీడియోగేమ్స్ ఆడతాడు. పుస్తకాలు చదువుతాడు. పదరంగాలు, పజిల్స్ చేస్తాడు.     అయితే ఇదంతా నా ఒక్కడి వల్లే కాలేదు. దీని కోసం నేను నా ఉద్యోగంతో పాటు చాలా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మా పెద్ద బావ, బంధువులు, స్నేహితులు నా బాధ్యతలు తమ నెత్తి మీద వేసుకొని, నేను పూర్తిగా ప్రణవ్ మీద దృష్టి కేంద్రీకరించడానికి తోడ్పడ్డారు.

 ప్రతి రాత్రీ ‘‘ గుడ్‌నైట్ డాడీ, మమ్మీ, గుడ్‌నైట్ కృతిక్’’ అంటూ ప్రణవ్ చెప్పే మాటల్లో ఎనలేని సంతోషం కనపడుతుంది. అదే నేను కోరుకుంది. ప్రణవ్ ఈరోజు ఏదో చేయడం లేదని నేనెప్పుడూ బాధపడింది లేదు. తన భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయిందీ లేదు’’అంటారు ప్రవీణ్ . ఏడేళ్ల పాటు తదేక ధ్యానంలా తన కొడుకు జీవితాన్ని తీర్చిదిద్ది, ఆటిజం మీద అనూహ్యమైన విజయాన్ని సాధించి ఎందరో తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికా వైద్యులకు సైతం సలహాదారుగా మారారు ప్రవీణ్.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement