
ఈ ఏడాది భారత్ నుంచి మరో కుర్రాడు చెస్‌లో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా సంపాదించాడు. బెంగళూరుకు చెందిన 15 ఏళ్ల ప్రణవ్ ఆనంద్ భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్ హోదా దక్కించుకున్న 76వ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
రొమేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్–16 విభాగంలో టైటిల్ సాధించిన ప్రణవ్ 2500 ఎలో రేటింగ్ మైలురాయిని కూడా దాటాడు. దాంతో అతనికి జీఎం హోదా ఖరారైంది. నిబంధనల ప్రకారం జీఎం హోదా లభించాలంటే మూడు జీఎం నార్మ్‌లు సంపాదించడంతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లు ఉండాలి. గత జూలైలో స్విట్జర్లాండ్‌లో జరిగిన బీల్ చెస్ ఫెస్టివల్‌లో ప్రణవ్ మూడో జీఎం నార్మ్ సాధించాడు. ఈ సంవత్సరం భరత్ సుబ్రమణియమ్ (తమిళనాడు), రాహుల్ శ్రీవత్సవ్ (తెలంగాణ), ప్రణవ్ వెంకటేశ్ (తమిళనాడు) జీఎం హోదా సాధించారు.