సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అండర్-13 బాలుర సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గంధం ప్రణవ్ రావు విజేతగా నిలిచాడు. విజయవాడలోని డీఆర్‌ఎంసీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో ప్రణవ్ రావు 21-12, 21-16తో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై నెగ్గి చాంపియన్ అయ్యాడు. అండర్-15 బాలికల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి మోపాటి కేయూర టైటిల్‌ను కై వసం చేసుకుంది. ఫైనల్లో కేయూర మోపాటి (తెలంగాణ)- కవిప్రియ (పాండిచ్చేరి) జంట 21-14, 21-19తో అనన్య ప్రవీణ్- మేధ శశిధరన్ (కర్ణాటక) జోడీపై గెలుపొందింది.
బాలికల సింగిల్స్ విభాగంలో మేఘనా రెడ్డి (తెలంగాణ) 19- 21, 19-21తో అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరాఖండ్) చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బాలుర డబుల్స్ ఫైనల్లో ప్రణవ్ రావు- సాయి విష్ణు పుల్లెల (తెలంగాణ) జంట 16-21, 15-21తో వంశీకృష్ణ (ఏపీ)- ఉనీత్‌కృష్ణ (తెలంగాణ) జోడీ చేతిలో ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది. బాలికల డబుల్స్ ఫైనల్లో అవంతిక పాండే- అనుపమా ఉపాధ్యాయ (ఉత్తరాఖండ్) జంట 21-8, 21-16తో శ్రీయ (తెలంగాణ)- ప్రవీణ (తమిళనాడు) జోడీపై నెగ్గింది.