తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేయి కలిపిన ఈ దివ్యాంగ యువకుడి పేరు ప్రణవ్ ఎంబీ. 22 ఏళ్ల ఈ యువకుడికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయితే వైకల్యానికి కుంగిపోకుండా దృఢచిత్తంతో చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. కాళ్లతోనే అత్యద్భుత చిత్రాలకు ప్రాణం పోసి ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు. వైకల్యం తన దేహానికే కాని మనసుకు లేదని తాజాగా మరోసారి నిరూపించాడు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా సాయం చేసి మంచి మనసు చాటుకున్నాడు. ప్రణవ్ ఔదార్యానికి ముగ్దులైన సీఎం పినరయి విజయన్.. అతడి గురించి తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు.
‘ఈరోజు లెజిస్లేటివ్ కార్యాలయానికి రాగానే కలకాలం గుర్తుండిపోయే అనుభవం ఒకటి ఎదురైంది. అలాచూర్ ప్రాంతానికి చిత్రకారుడు ప్రణవ్ తన పుట్టినరోజు సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు తన వంతు సాయం అందించేందుకు నా దగ్గరకు వచ్చాడు. అతడికి రెండు చేతులూ లేవు. టీవీ రియాలిటీ షోలో సంపాదించిన మొత్తాన్ని చెక్ రూపంలో అతడు విరాళంగా ఇచ్చాడు. ప్రణవ్‌కు రెండు చేతులుగా నిలిచిన అతడి తల్లిదండ్రులు బాలసుబ్రమణియన్, స్వర్ణకుమారితో పాటు స్థానిక ఎమ్మెల్యే కేడీ ప్రసన్న కూడా వచ్చారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న నమ్మకం తనకు వంద శాతం ఉందని నాతో ప్రణవ్ చెప్పాడు. అతడు అందించిన విరాళం ఎంతో గొప్పది. పలక్కాడ్ జిల్లాలోని చిత్తూర్ ప్రభుత్వ కాలేజీ నుంచి బీకామ్ పూర్తిచేసిన ప్రణవ్ ఉన్నత చదువుల కోసం కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలిపాడు. నాతో చాలా సేపు మాట్లాడాడు. కాలితో సెల్ఫీ తీసుకుని ఆశ్చర్యానికి గురిచేశాడ’ని విజయన్ పేర్కొన్నారు. సహృదయం చాటుకున్న ప్రణవ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాడు ప్రణవ్. గతేడాది వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు తన పెయింటింగ్స్ అమ్మగా వచ్చిన మొత్తాన్ని సహాయంగా అందించాడు. ఏప్రిల్ 23న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రణవ్ తొలిసారిగా ఓటు వేశాడు. కుడి కాలి రెండో వేలుతో ఈవీఎం మీట నొక్కి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఓనమ్ పండుగ సందర్భంగా ప్రణవ్ గురించి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడి ప్రతిభ, పట్టుదల తనకు సంభ్రమాశ్చర్యాలు కలిగించాయని ట్విటర్ ద్వారా ప్రశంసించాడు. ప్రణవ్ కాలితో గీసిన ఫొటోను తనకు ఇస్తున్న ఫొటోలను సచిన్ షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment