వయసు చూస్తే ఏడేళ్లు...కానీ
వయసు చూస్తే ఏడేళ్లు. కానీ ఘనతలకు లెక్కే లేదు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఎస్.ప్రణవ్... స్కేటింగ్‌తో రికార్డులు స్వీప్ చేస్తున్నాడు. అబ్బుర పరిచే విన్యాసాలతో ఏడు ప్రపంచ రికార్డులు దక్కించుకున్నాడు.
ఇటీవల నగరంలో జరిగిన ఈవెంట్‌లో రెయిన్‌బో ఫీట్‌లో వరల్డ్ రికార్డు సాధించిన ప్రణవ్ ప్రతిభకు మెచ్చి... ఆర్గనైజేషన్ ఫర్ చైల్డ్ అండ్ యూత్ డెవలప్‌మెంట్ ‘లిటిల్ ఆర్కిడ్’ అవార్డుతో సన్మానించింది. ఈ సందర్భంగా ఈ వండర్ కిడ్ ‘సిటీ ప్లస్’తో తాను సాధించిన రికార్డుల గురించి ముచ్చటించాడు.
ఇందిరాపార్కులో జరిగిన ఈవెంట్‌లో కళ్లకు గంతలు కట్టుకొని.. కాళ్లకు స్కేట్స్, మెడలో కీబోర్డు తగిలించుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ కీబోర్డు మీద ఒక్క గంటలోనే 20 గీతాలను వాయించా. గణనాయక శ్లోకంతో ప్రారంభించి దేశభక్తి గీతం సారే జహా సే అచ్ఛాతో ముగించా. వరల్డ్ రికార్డ్స్ రెయిన్‌బో ఫీట్‌ను సాధించా. ఒకే వేదిక మీద ఏడు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకోవడం ఎంతో
ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తా’... ఇది ప్రణవ్ మాట. ఈ బుడతడిని చూస్తుంటే అతడిలో ఎంతో అంకితభావం, ఆత్మవిశ్వాసం తొణికిసలాడతాయి.
అమ్మానాన్న ప్రోత్సాహం వల్లే...
‘నేను ఇన్ని రికార్డులు సాధించడం వెనుక తల్లి దండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. మా నాన్న శ్రీనివాస్ హెచ్‌ఎండీఏలో ఏఈఓ. అమ్మ జయంతి మదీనా డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్. చిన్నప్పటి నుంచీ వారి ప్రోత్సాహమే నా ప్రదర్శన. నాలుగేళ్ల వయసులో స్కేటింగ్ శిక్షణ తీసుకుంటున్నా. 2012లో సుందరయ్య కళా నిలయంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నా. స్కేటింగ్ కోచ్‌లు నూర్ మహమ్మద్, రతన్ సింగ్‌ల సహకారం ఎంతో ఉంది. అందరి ప్రోత్సాహంతోనే ఈ రికార్డులు సాధించగలిగా’ అంటూ ఎంతో ఉల్లాసంగా చెప్పుకొచ్చిన ప్రణవ్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షిస్తూ... ‘సిటీ ప్లస్’ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.
వాంకె శ్రీనివాస్
సెవెన్ రికార్డ్స్
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యునిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్