ఆరేళ్లకే వరల్డ్ రికార్డు
బెంగళూరు: సంకల్పబలం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చని ఓ బాలుడు మరోసారి నిరూపించాడు. ఆరేళ్లకే ప్రపంచ రికార్డు నెలకొల్పడంతో పాటు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించాడు స్వరూప్ గౌడ్. ఆదివారం బెంగళూరులో ఆరిన్ మాల్ లో జరిగిన ఈ స్కేటింగ్ ద్వారా స్వరూప్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒకేసారి 36 కార్ల కింద నుంచి లింబో స్కేటింగ్ చేసి ఔరా అనిపించాడు. ఆ లక్ష్యాన్ని 33. 64 సెకన్లలోనే పూర్తి చేసి అబ్బురపరిచాడు.
తొలి ప్రయత్నంలో విఫలమైనా, పట్టువిడకుండా రెండోసారి ప్రయత్నించి విజయవంతమయ్యాడు. స్వరూప్ తన మొదటి ప్రయత్నంలో భాగంగా 10 కార్లకు దూరంలో నిలిచిపోయాడు. దీంతో కాస్త ఆందోళన చెందిన స్వరూప్ ను కోచ్, అతని కుటుంబ సభ్యులు ఉత్సాహపరచడంతో మరోసారి యత్నించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆర్వీ స్కేటింగ్ క్లబ్లో కోచ్ రాఘవేంద్ర పర్యవేక్షణలో ఆ బాలుడు శిక్షణ పొందుతున్నాడు. తాను స్కేటింగ్ పై మక్కువ పెంచుకోవడానికి స్కూల్లోని సీనియర్లే కారణమని స్వరూప్ గౌడ్ స్పష్టం చేశాడు.
ఈ పోటీలో కార్ల మధ్య దూరం 20 సెం.మీ కంటే తక్కువ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం 35 సెం.మీ మించకుండా చూశారు. కేవలం శరీరాన్ని గ్రౌండ్ కు సమాంతరంగా ఉంచుతూ స్కేటింగ్ చేయాలి. ఇందుకోసం గ్రౌండ్ ను ఎటువంటి ఎత్తుపల్లాలు లేకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నారు.