
సాక్షి,తాడేపల్లి : ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను ఇవాళ వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం, కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
వైఎస్ జగన్ ట్వీట్‌లో ఏమన్నారంటే
1.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు, నష్టాలే మిగులుతున్నాయి. పంటలకు మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం అమ్ముకుందామన్నా కొనేవారు లేరు. మొన్నటి వరకూ ధాన్యం రైతుల కష్టాలు చూశాం. ఇవాళ మిర్చిరైతుల కష్టాలు చూస్తున్నాం. చంద్రబాబు సీట్లోకి వచ్చారు, మళ్లీ రైతులను పట్టి పీడించడం మొదలుపెట్టారు.
2.మన ప్రభుత్వంలో నిరుడు క్వింటాలుకు అత్యధికంగా రూ.21-27 వేల దాకా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.8-11వేలకు పడిపోయింది.
3.పంట బాగుంటే ఎకరాకు సగటున 20 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. తెగుళ్లు కారణంగా ఈ ఏడాది దిగుబడులు పడిపోయాయి. ఏ జిల్లాలో చూసినా ఎకరాకు 10 క్వింటాళ్లకు మించి రాలేదు. పెట్టుబడి ఖర్చులు చూస్తే, ఎకరా సాగుకు సుమారు రూ.1,50,000 పైమాటే అవుతోంది. కౌలు రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
4.కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఈజిల్లాల్లో రైతులందరి పరిస్థితీ అంతే.
5.పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ఆ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి.. వీరంతా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలో ఒక్క రివ్యూ కూడా చేయలేదు. గవర్నమెంటు తరఫున రైతులను పలకరించే వారు లేరు. రాష్ట్ర సచివాలయానికి అత్యంత సమీపంలో గుంటూరు మార్కెట్ యార్డు ఉంది. ఇక్కడ రైతుల ఆక్రోశం, ఆవేదన చంద్రబాబునాయుడు వినిపించడంలేదు.
6.చంద్రబాబుగారు అధికారంలోకి వచ్చి రైతులకు సహాయం చేయకపోగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ కూడా మూలన పడేశారు.
7.ఆర్బీకేలను, ఈ-క్రాప్ వ్యవస్థలను నిర్వీర్యంచేశారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబులను నిర్వీర్యంచేశారు. సీజన్ మొదలయ్యే సరికి రైతులకు పెట్టుబడి సహాయం, రైతులకు సున్నావడ్డీకే రుణాలు, విత్తనాలు ఎరువులకు సైతం ఆర్బీకేల్లో నాణ్యతకు గ్యారంటీ.. ఇలా ప్రతి విప్లవాత్మక మార్పునూ ఉద్దేశపూర్వకంగా మూలనపెట్టారు.
ధరల్లేక, పంటను కొనేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మిర్చి రైతులను గుంటూరు మార్కెట్ యార్డులో పరామర్శించాను. పెద్ద సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావడంతో మిర్చియార్డు ప్రాంతం కిక్కిరిసిపోయింది. అందుకే ప్రజలనుద్దేశించి మీడియా ద్వారా పూర్తిగా మాట్లాడలేకపోయాను.…
— YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 2025
8.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం MSP ప్రకటించని పసుపు, మిర్చి, ఉల్లి, అరటి లాంటి పంటలకే కాదు, మొత్తంగా 24 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించి, రైతులకు MSP ధరలు రాకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే జోక్యంచేసుకుని కొనుగోలు చేసేది. కనీస మద్దతు ధరలు తెలియజేస్తూ ఆర్బీకేల్లో పోస్టర్లు ఉంచేవాళ్లం. ధాన్యం కొనుగోలుకు రూ.65,258 కోట్లు ఖర్చు చేస్తే, ధాన్యం కాకుండా ఇతర పంటల కొనుగోలు కోసం అక్షరాల రూ. 7,773 కోట్లు ఖర్చు చేసి మన ప్రభుత్వం రైతులను ఆదుకుంది. ఇవాళ మిర్చి రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే, చంద్రబాబునాయుడు కుంభ కర్ణుడిలా నిద్రపోతున్నాడు.
9.మన ప్రభుత్వ హయాంలో CM APP అనే గొప్ప మార్పును తీసుకు వచ్చాం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట ధర ఎలా ఉందో ఆ యాప్‌ద్వారా నిరంతరం సమాచారం వచ్చేది. ఆర్బీకేల్లో ఉండే సిబ్బంది రైతులకు అందుతున్న ధరలమీద ఎప్పటికప్పుడు యాప్‌లో అప్‌డేట్ చేసేవాళ్లు. ఆ సమాచారం ఆధారంగా కనీస మద్దతు ధర రాని పక్షంలో వెంటనే చర్యలు తీసుకునేవాళ్లం. జేసీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖతో కలిసి అవసరమైతే ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు చేసేవాళ్లం. కనీస మద్దతు ధరలు ఎంతో తెలియజేస్తూ ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు ఉంచేవాళ్లం. రైతులనుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించడానికి 14400, 1907 నంబర్లు కూడా ఉండేవి. ఇప్పుడు ఈవ్యవస్థలను పూర్తిగా నాశనం చేశారు.
10.ఇప్పుడు మిర్చికి వచ్చినట్టే పంటలకు వ్యాధులు వస్తే, ఆర్బీకే సిబ్బంది, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు వెంటనే విషయాన్ని ప్రభుత్వానికి చేరవేయడం, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సూచనలు ఇచ్చి, రైతులు పాటించేలా చేసేవాళ్లం. ఆర్బీకేలద్వారా రైతులకు తగిన శిక్షణ అందేది. రైతులకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్, పొలంబడి లాంటి కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం.
11.రైతులకు అందే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగేవి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన 147 ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబుల్లో పరీక్షలు జరిగేవి. ఇప్పుడు ఈ ల్యాబులను గాలికొదిలేశారు. ప్రైవేటుకు అప్పగిస్తున్నారు.
12.మార్కెట్లో క్రమం తప్పకుండా అధికారులు తనిఖీలు చేసేవారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్రమం తప్పకుండా ఈ తనిఖీలమీద, తీసుకుంటున్న చర్యలమీద రిపోర్టులు ఇస్తూ, గట్టి పర్యవేక్షణ చేసేవారు. దీనివల్ల నకిలీలకు అడ్డుకట్టపడేది. ఎక్కడైనా తప్పు జరిగితే సంబంధిత వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకునేవాళ్లం.
13.మనం అధికారంలో ఉన్నప్పుడు మిరప రైతులకు ఎప్పుడూలేని విధంగా చాలా గొప్పగా పంటలబీమా అందించాం. 2019-20లో రూ.90.24 కోట్లు, 2020-21లో రూ.36.02 కోట్లు, 2021-22లో రూ.439.79 రైతులకు కోట్లు అందించాం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దుచేసి రైతులపై భారాన్ని మోపారు. మన ప్రభుత్వంలో రైతులపై ఒక్కపైసా భారం మోపకుండా ఉచిత పంటలబీమాను అమలు చేసి, 54.55లక్షల మందికి రూ.7,802 కోట్లు పంట నష్టపరిహారం కింద చెల్లించాం.
14.ఒక్క మిర్చే కాదు, కంది పండిస్తున్న రైతులు కూడా ధరల్లేక విలవిల్లాడుతున్నారు. కందిపప్పు క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.7,550 అయితే, ఇప్పుడు రూ.5,500లు కూడా రావడంలేదు. గత ఏడాది రూ.9-10వేల మధ్య ధర వచ్చేది. కాని మార్కెట్లో కిలో కందిపప్పు రూ.150లు పైనే ఉంది.
15.గత ఏడాది క్వింటాలు పత్తి ధర రూ.10వేలు ఉండేది. ఇప్పుడు రూ.5వేలుకూడా దాటడం లేదు. పెసలు కనీస మద్దతు ధర రూ.8,558లు. ఇప్పుడు రూ.6వేలు రావడం కష్టంగా ఉంది. అలాగే మినుములు కనీస మద్దతు ధర రూ.7,400. గత ఏడాది క్వింటాలుకు రూ.10వేలు రాగా, ఇప్పుడు రూ.7వేలు కూడా రావడంలేదు. టమోటా రైతులకు కిలోకి రూ.3-5లు కూడా రావడంలేదు.
16.ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు. రైతుకు ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ కాకుండా, రూ.20వేలు ఇస్తామని నమ్మబలికారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల్ని మోసం చేశారు. పోనీ మన ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా కొనసాగించకుండా, రద్దుచేశారు. పలావూ.. లేదు, బిర్యానీ లేదు. కాని, మన ప్రభుత్వంలో ఒక్క రైతు భరోసా కిందే క్రమం తప్పకుండా సుమారు 54 లక్షల మంది రైతులకు రూ.34,288 కోట్లు ఇచ్చాం.
17.ఇదొక్కటే కాదు ఉచిత పంటల బీమాను చంద్రబాబు రద్దుచేశారు, ఒక సీజన్‌లో పంట నష్టం జరిగితే, అదే సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీని చెల్లించే గొప్ప విధానాన్ని, రైతులకు సున్నావడ్డీ పథకాన్ని రద్దుచేశారు. ఈ-క్రాప్‌ను లేకుండా చేసేశారు, ధరల స్థిరీకరణ నిధికీ ఎగనామం పెట్టారు. కనీసం ఎరువులను కూడా సకాలంలో పంపిణీ చేయడంలోనూ కొరతే. ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకోవడం అత్యంత దారుణం.
18.చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరవండి. రైతే రాజని గుర్తించండి, రైతు కన్నీరు పెట్టుకుంటే..అది రాష్ట్రానికి అరిష్టం. చంద్రబాబు గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి, మిర్చి రైతులతో మాట్లాడి, వారికి బాసటగా నిలవాలి. ప్రభుత్వమే మిర్చిని కొనుగోలుచేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేస్తున్నాం.’ అని ట్వీట్‌లో వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment