విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం | Farmers Worried Due To Loss Of Crops In Andhra Pradesh, Urging For Compensation And Drought Relief | Sakshi
Sakshi News home page

విపత్తులను మించిన ప్రభుత్వ నిర్లక్ష్యం

Published Tue, Mar 25 2025 5:47 AM | Last Updated on Tue, Mar 25 2025 9:03 AM

Farmers Worried Due To Loss Of Crops: Andhra pradesh

వరుస వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు

సీజన్‌ ముగుస్తున్నా అందని పంట నష్టపరిహారం, కరువు సాయం

ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరువు సాయం కలిపి చెల్లించాల్సింది రూ.838 కోట్లు

చెల్లించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.285 కోట్లే

రైతులకిస్తానన్న రూ. 26 వేల సాయం ఊసే లేదు

వ్యాపారులు, దళారుల చేతిలో దగా పడుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు  

సాక్షి, అమరావతి: కరువు ఉరిమినా.. తుఫాన్లు తుడిచిపెట్టినా.. వరదలు, వర్షాలు ముంచెత్తినా.. అన్నదాతపై చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేదు. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోవాల్సిందిపోయి వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసి, రబీ కూడా చివరి దశకు చేరుకుంది. అయినా, ఖరీఫ్‌ ప్రారంభంలో దెబ్బతిన్న పంటలకూ పరిహారం ఇవ్వాలన్న ధ్యాసే లేదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా అటకెక్కించి ఆ పరిహారమూ అందకుండా చేసింది. సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి రైతుకు చెల్లించాల్సిన రూ.26 వేల ( పీఎం కిసాన్‌ సాయంతో కలిపి)పెట్టుబడి సాయమూ ఇవ్వకుండా మోసం చేసింది. 

ఇంకొక వైపు సీజన్‌ ముగియకుండానే అందించాల్సిన పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లింపులోనూ కావాలనే కాలయాపన చేస్తోంది. పంటలకు మద్దతు ధర లభించేలా చూడటంలోనూ చంద్రబాబు సర్కారుది మొండి వైఖరే. ఎరువులు, పురుగు మందులు, నాణ్యౖ­మెన విత్తనాలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదు. వ్యాపారులు, దళారుల చేతిలో అన్యాయానికి గురవుతున్న అన్నదాతను ఆదుకోవాలన్న ఆలోచనే లేదు. మొత్తం మీద ప్రకృతి విపత్తులకంటే అన్నదాతకు కూటమి సర్కారు నిర్లక్ష్యమే పెద్ద విపత్తుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.

అడ్డగోలు కోతలతో.. 
కూటమి ప్రభుత్వం గద్దెనెక్కింది మొదలు నెలకొక వైపరీత్యం రైతులను వెంటాడుతూనే ఉంది. ఖరీఫ్‌ మొదట్లోనే జూలైలో అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. 16 జిల్లాల 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం మాత్రం 44 వేల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నాయని, 31 వేల మందికి రూ.31.53 కోట్లు చెల్లించాలని లెక్కతేల్చింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కృష్ణా, వంశధార, నాగావళి నదులతో పాటు బుడమేరు, ఏలేరు వరదలు పంట పొలాలను ముంచెత్తాయి.

 10 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తొలుత 5.93 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి రూ.557.63 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనావేశారు. ప్రభుత్వం ఇందులో అడ్డగోలుగా కోతలు వేసి దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 3.11 లక్షల ఎకరాలకు కుదించింది. కేవలం 2 లక్షల మందికి రూ.319.08 కోట్లు ఇవ్వాలని చెప్పింది. పోనీ అదైనా ఇచ్చిందా అంటే అదీ లేదు.

వైఎస్‌ జగన్‌ హయాంలో..
విపత్తులకు పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేకంగా రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు 
ఏ సీజన్‌ పంట నష్ట పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) అదే సీజన్‌ ముగిసేలోగా జమ. ఇలా ఐదేళ్లలో 34.41 లక్షల మందికి రూ.3,261.60 కోట్లు చెల్లించి 
అండగా నిలిచారు. 
రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో 54.48 లక్షల మంది రైతులకు రూ.7,802.05 కోట్లు అందజేశారు. 
వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288.17 కోట్లు లబ్ధి చేకూర్చారు.

చంద్రబాబు హయాంలో.. 
బీమా ప్రీమియం బకాయిలు రూ.1,280 కోట్లు చెల్లించకపోవడం వల్ల రైతులకు దాదాపు రూ.2వేల కోట్లకు పైగా పరిహారం అందకుండా మోకాలడ్డారు.  
2024–25 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఈ పాటికే రూ.833 కోట్లు బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంది. ఇందులో పైసా కూడా చెల్లించకపోవడంతో రైతులకు రూ.1200 కోట్లకుపైగా బీమా పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. 
కూటమి పాలనలో పంటల బీమా పథకం ఉందో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొంది. 
సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రమిచ్చే పీఎం కిసాన్‌ సాయంతో సంబంధం లేకుండానే ఒకే విడతలో ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున 2024–25లో 
చెల్లించాల్సిన రూ.10,717 కోట్లు కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు.

సగం మండలాల్లోనే కరువంటూ..
లోటు వర్షపాతంతో రాయలసీమ జిల్లాల్లో 100 మండలాలకు పైగా కరువు కోరల్లో చిక్కుకున్నాయి. 60 రోజులకు పైగా చినుకు జాడ లేదు. 10 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా 54 మండలాలనే కరువు ప్రభావితంగా ప్రకటించింది. వీటికీ పైసా పరిహారం విదల్చలేదు. నవంబరులో విరుచుకుపడిన ఫెంగల్‌ తుఫాను కోతకొచ్చిన పంటలను తుడిచిపెట్టింది. దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయినా రైతులను ఆదుకున్న పాపాన పోలేదు. 

ఇలా కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది జూలై మొదలుకొని డిసెంబర్‌ వరకు వివిధ వైపరీత్యాలకు 20 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిని, రూ.2 వేల కోట్లకు పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఇందులోనూ కోతలేసి చివరికి 6.65 లక్షల ఎకరాల్లోనే పంటలు దెబ్బతిన్నట్లు, రూ.527.18 కోట్లు చెల్లించాలంటూ లెక్కగట్టింది.

దీంతోపాటు ఆధార్‌ సీడింగ్‌ కాకపోవడం, సరైన బ్యాంక్‌ ఖాతా నంబర్లు ఇవ్వక పోవడం వంటి సాంకేతిక కారణాలతో నిలిచిన 2023, 24 సీజన్ల కరువు సాయం బకాయిలు రూ.311.39 కోట్లు విడుదల చేయకుండా మోకాలడ్డింది. ఇలా మొత్తం రూ.838.57 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో కేవలంæ 1.85 లక్షల మందికి రూ.284.56 కోట్లు చెల్లించి చేతులు దులిపేసుకుంది. అదీ కూడా ప్రజలు, వివిధ సంస్థలు ఇచ్చిన వరద విరాళాల పుణ్యమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement