పత్తి రైతుకు ‘ధర’హాసం | Andhra pradesh : minimum support price of cotton has been decided at Rs 7020 per quintal | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు ‘ధర’హాసం

Published Mon, Oct 23 2023 5:53 AM | Last Updated on Mon, Oct 23 2023 11:13 AM

Andhra pradesh : minimum support price of cotton has been decided at Rs 7020 per quintal - Sakshi

ఆదోని మార్కెట్‌ యార్డ్‌ లో పత్తి నిల్వలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్‌ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 

12.85 లక్షల టన్నుల దిగుబడులు
రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్‌కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది.

అప్రమత్తమైన ఫ్రభుత్వం
కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్‌ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్‌ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

నిబంధనలు ఇవీ
తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్‌ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్‌కు రూ.25 తగ్గిస్తారు.

పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్‌ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు.

ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం
ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్‌ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్‌ తీసుకోవాలి. ఆ టోకెన్‌లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్‌ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. 

తొందరపడి అమ్ముకోవద్దు
మార్కెట్‌లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి.  – రాహుల్‌ పాండే, కమిషనర్, మార్కెటింగ్‌ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement