గజ్వేల్: వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులు ‘రబీ’లోనైనా కోలుకోవాలనే ఆశలతో సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే భూగర్భజలాలు పడిపోయినందువల్ల ‘వరి’కి సాగుకు స్వస్తి పలికి ఆరుతడి పంటలే వేసుకోవాలని వ్యవసాయాశాఖ సూచిస్తున్నారు. ఈ తరుణంలో రైతుల ‘ఆరుతడి’ పంటల సాగుపై దృష్టి సారించారు. రెండురోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలతో రైతులు శనగ, ఇతర ఆరుతడి పంటల సాగును వేగవంతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
రబీకి ఊతమిచ్చిన వర్షం
ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావం రైతన్నను కోలుకోలేని దెబ్బతీసింది. కళ్ల ముందే వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటలు ఎండుముఖం పట్టడంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఈ కారణంగా చేలన్నీ న్లై బారాయి. రేగడి భూముల్లోనూ తేమ కరువైంది. మొక్కజొన్న పంట కోసిన తర్వాత అదే భూమిలో రబీలో శనగ, పొద్దుతిరుగుడు, ఆముదం తదితర ఆరుతడి పంటలు వేసుకోవాలంటే తేమ తప్పనిసరి. ఎక్కడా కూడా తేమ లేకపోవడంతో భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్న తరుణంలో రెండు రోజులుగా కురిసిన వర్షాలు‘రబీ’సాగుకు ఊతమిచ్చాయి.
అంచనా తప్పింది!
గతేడాది రబీలో జిల్లాలో 1.49 లక్షల హెక్టార్లు సాగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఈసారి 1.52 లక్షల హెక్టార్లలో శనగ, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, ఆముదం, జొన్న, మినుములు, వరి, కూరగాయలు తదితర పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసినప్పటికీ, ఇప్పటి వరకు కేవలం 27 వేల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 626.1 మి.మీల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 399.8 మి.మీలు మాత్రమే నమోదైంది. ఫలితంగా భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం వల్ల కరెంట్ సరఫరా చేసినా నీరు పారే పరిస్థితి లేదు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ‘వరి’కి దూరంగా ఉండాలని రైతులకు సూచిస్తున్నారు. ఫలితంగా వరి సాగు గణనీయంగా పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పడిపోనున్న వరి సాగు విస్తీర్ణం
గజ్వేల్ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, తూప్రాన్ మండలాల్లో గతేడాది శనగ పంట 2,083 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,700 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1,117 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 600 హెక్టార్లు, మొక్కజొన్న 233 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 1,000 హెక్టార్లు, ఇతర పంటలు 790 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 509 హెక్టార్లలో సాగయ్యాయి. ఇదిలావుంటే వరి మాత్రం 4,356 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి గానూ 3,200 హెక్టార్లలో సాగైంది. ఈసారి వ్యవసాయశాఖ పంటలు ఇదే విధంగా సాగులోకి వస్తాయని భావించింది.
ప్రధానంగా శనగ పంట 2,700 హెక్టార్లలో సాగులోకి వస్తుందని భావించి 2,000 క్వింటాళ్ల విత్తనం అవసరముంటుందని అంచనా వేసింది. ఇందులో ఇప్పటివరకు 400 క్వింటాళ్ల విత్తనం జిల్లాకు రాగా, వ్యవసాయాధికారులు ఇప్పటివరకు అతికష్టం మీద 300 క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే పంపిణీ చేయగలిగారు. 100 క్వింటాళ్ల విత్తనం కొనుగోలు చేసేవారు లేక వ్యవసాయశాఖ కార్యాలయాల్లో ఉండిపోయింది. వాస్తవానికి ఈపాటికి విత్తనాల పంపిణీ పూర్తయి, విత్తడం కూడా ముగింపు దశకు చేరుకోవాల్సి ఉండగా, అందుకుభిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రెండురోజులుగా కురిసిన వర్షంతో శనగ సాగు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘వరి’కి దూరంగా ఉండాలి
ఖరీఫ్‌లో ఏర్పడిన వర్షాభావం వల్ల భూగర్భజలాలు గణనీయంగా పడిపోయాయి. అందువల్ల ప్రస్తుత రబీలో వరి సాగు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటలే వేసుకోవాలి. సబ్సీడీ విత్తనాలు వ్యవసాయశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. -జేడీఏ హుక్యా నాయక్
రబీకి సన్నద్ధం
Published Fri, Nov 14 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement