ఖమ్మం: శాస్త్రీయ సర్వేల పేరుతో కొండంత నష్టం జరిగితే గోరంతే జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనాలు పంపారు. అప్పుడు ఆ అధికారులు చేసిన సర్వే పాపమే ఇప్పుడు జిల్లా రైతులకు శాపమైందని జిల్లాలోని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం రిజర్వుబ్యాంక్ ప్రకటించిన రైతు రుణాల రీ షెడ్యూల్ జాబితాలో జిల్లా పేరు గల్లంతైందని అంటున్నారు.
గత సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో వచ్చిన గోదావరి వరదలతో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. వరదలతో జిల్లాలో 35వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, సుమారు రూ.13 కోట్ల మేరకు పంటనష్టం జరిగిందని అంచనాలు వేశారు. కానీ ఈ పంటలు నాటు వేసే దశలోనే ఉన్నాయని, వీటికి నష్టపరిహారం రాదని వ్యవసాయశాఖ అధికారులు కొట్టిపారేశారు.
అక్టోబర్ 22వ తేదీ నుండి ఎడతెరపి లేకుండా వారం రోజులు కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా పంటలు నీటిపాలయ్యాయి. జిల్లాలో సుమారు 2.5లక్షల ఎకరాల పత్తి, 28 వేల ఎకరాల వరి, 15 వేల ఎకరాల మిర్చి, 22 వేల ఎకరాల మొక్కజొన్న, 20 వేల ఎకరాల కూరగాయ, ఇతర పంటలు మొత్తం 3.3 లక్షల ఎకరాలకు పైగా దెబ్బతిన్నాయని అధికారులు, రైతు సంఘాల నాయకులు ప్రాథమిక అంచనాల్లో తేల్చారు. పంటనష్టం రూ. 430 కోట్లకు పైగా ఉంటుందని రైతు సంఘాలు, రాజకీయ పక్షాలు ముక్తకంఠంతో చెప్పారు.
కానీ వ్యవసాయశాఖ అధికారులకు మాత్రం చలనం రాలేదు. నష్టం జరిగిన పదిహేను రోజులకు కానీ అంచనాలు వేసేందుకు వెళ్ళలేదని రైతులు ఆరోపిస్తున్నారు. శాస్త్రీయసర్వేలు, అంచనాలు పేరుతో పంటనష్టాన్ని కుదించారు. 50 శాతం కంటే ఎక్కువగా పంటనష్టం జరిగితేనే పరిహారం వస్తుందని చెప్పారు. ఈ లెక్కన జిల్లాలో కేవలం 76 వేల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని నివేదిక పంపించి చేతులు దులుపుకున్నారు.
ఇరత జిల్లాలతోపాటు ఖమ్మం జిల్లాలో కూడా పంటనష్టం అధికంగా ఉందని అందరూ ప్రకటించారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను పరామర్శించడానికి జిల్లాకు వచ్చిన వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ముందు రైతులు కన్నీరు పెట్టారు. జిల్లా పరిస్థితులు చూసిన ఆమె ఖమ్మం జిల్లా పంటనష్టంపై రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు.
అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకున్న నాథుడే కరువయ్యాడు. ఈ లోపు సార్వత్రిక ఎన్నికలు రావడం, టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమన కల్గుతుందని రైతులు భావించారు. రిజర్వ్‌బ్యాంక్ రీషెడ్యూల్‌పై మెలిక పెట్టి గత సంవత్సరం కరువు, వరదల మూలంగా పంటనష్టం వాటిల్లిన జిల్లాలకే రీషెడ్యూల్ చేస్తామని ప్రకటించింది. ఇందులో మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల పేర్లు మాత్రమే ప్రకటించారు.
ఈ వార్త విన్న జిల్లా రైతాంగం ఒక్కసారిగి ఖంగుతిన్నది. నాడు వ్యవసాయశాఖ అధికారులు చేసిన పాపం మూలంగానే జిల్లాకు ఆర్‌బీఐ జాబితాలో చోటు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీషెడ్యూల్ అయితే ఊరట కల్గుతుందని భావించిన రైతులు నిరాశకు లోనవుతున్నారు. రుణమాఫీ వర్తిస్తుందో, లేదో అని ఆందోళన చెందుతున్నారు.
అయ్యో రైతు
Published Sun, Aug 10 2014 1:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement