సాక్షి, అమరావతి: మిరపను చిదిమేసింది.. మామిడి పూతను ఆశించింది.. చింతను తాకింది.. ఇక కందులు, పెసలు, శనగతో పాటు పత్తి, వంగ, మునగ, దోస, సొర, కాప్సికమ్, బంతి, చామంతి.. ఇలా పలు పంటలను ఆశిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తోంది. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి.. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేస్తున్నాయి.
ఇలా ఒక్కసారిగా దాదాపు అన్ని రకాల పంటలపై దాడి చేసి, నాశనం చేస్తున్న దీనిని వ్యవసాయ శాస్త్రవేత్తలు ‘త్రిప్స్ పార్విస్పైనస్’ అని చెబుతున్నారు. అంటే అదో కొత్త రకం తామర పురుగు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా మూడేళ్లుగా మిరప ధరలు మార్కెట్‌లో నిలకడగా ఉన్నాయి. ఈ ఏడాది ఏకంగా క్వింటాల్ రూ.16 వేల నుంచి రూ.20 వేలకు పైగా పలుకుతోంది. ఈ కారణంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది
రికార్డు స్థాయిలో మిరప సాగైంది. అయితే అనూహ్యంగా ఈ ఏడాది ఈ పంటను ఈ కొత్త తామర పురుగు చిదిమేసింది. తొలుత సాధారణ తామర పురుగు (స్కిప్టో ట్రిప్స్ డార్సాలిస్) గానే భావించారు. సాధారణ పురుగు ఆకుల మీద చేరి రసాన్ని పీలిస్తే, ఈ కొత్త రకం పురుగు పూత, పిందెల్లోకి చేరి రసాన్ని పీల్చి.. కనీస దిగుబడి కూడా రానీయకుండా నాశనం చేస్తుందని గుర్తించారు.
యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు
– ఈ పురుగు ఉధృతిని ఆదిలోనే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టింది. ఏపీ ఎన్జీ రంగా వ్యవసాయ, వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలతో ఏర్పాటు చేసిన బృందాలను తొలుత రంగంలోకి దింపింది. శాంపిల్స్ సేకరించి నేషనల్ బ్యూరో ఫర్ అగ్రికల్చర్ ఇన్‌సెట్ రీసోర్సెస్ (ఎన్‌బీ ఎఐఆర్)కు పంపించింది.
– ఇది సాధారణ తామర పురుగు కాదని సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రిప్స్‌లో ఒకటైన ట్రిప్స్ పార్విస్పైనస్‌గా, ఇండోనేషియా నుంచి 2015లో మన దేశంలోకి చొరబడినట్టుగా గుర్తించారు. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య పద్ధతులు పాటించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు అవగాహన కల్పించడంతో 20–30 శాతం పంటను కాపాడగలిగారు.
రంగంలోకి జాతీయ పరిశోధనా సంస్థలు
– భవిష్యత్‌లో పెనువిపత్తుగా మారబోతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)తో పాటు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు లేఖలు రాసి కేంద్రంపై ఒత్తిడి తీసు కొచ్చింది.
– ఫలితంగా ఐసీఎఆర్‌కు అనుబంధంగా పని చేస్తోన్న డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటక్షన్ క్వారంటైన్ అండ్ స్టోరేజ్ (డీపీపీక్యూఎస్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ (ఐఐహచ్‌ఆర్), నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (ఎన్‌సీఐపీఎం), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ (సీఐపీసీ)లతో పాటు ఎన్‌బీ ఏఐఆర్‌లకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తల బృందాలు.. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించాయి.
– ఇండోనేషియా, మలేషియా దేశాల్లో పుట్టిన ఈ కీటక ఉధృతిని ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌ఘడ్æ, గుజరాత్, మహారాష్ట్రలో గమనించారు. మిరపతో పాటు ఇతర పంటలకూ వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. సాధారణంగా తామర పురుగు బలహీన పడి సంతతి తగ్గిపోవడంతో.. దాని స్థానంలో బలమైన ఈ కొత్త రకం తామర పురుగు వ్యాపిస్తున్నట్టుగా గుర్తించారు.
– ఈ బృందాలు గత నెల రోజుల్లో మూడు విడతలుగా పర్యటించాయి. ప్రస్తుతం ఏపీ–తెలంగాణాలో పర్యటిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలి ఉన్న పంటను ఏ విధంగా కాపాడాలి? రానున్న సీజన్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇతర పంటలకు వ్యాపించకుండా ఏం చేయాలి? అనే అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి త్వరలో కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు.
ఏపీ ప్రభుత్వ చొరవ వల్లే..
2015లో దేశంలో గుర్తించిన ఈ పురుగు 2021లో ఉధృతంగా వ్యాపించింది. ఇందుకు గల కారణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం. దీని ఉధృతిని ఏపీ ప్రభుత్వమే ముందుగా గుర్తించింది. కేంద్రానికి లేఖలు రాయడం వల్లే ఐసీఏఆర్ బృందాలను పంపింది. గ్రామ స్థాయిలో యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇంత ఉధృతిలో కూడా 20–30 శాతం పంటను కాపాడగలిగారు. దీని కట్టడికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్‌లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై వారంలోగా కేంద్రానికి నివేదిక సమర్పించ బోతున్నాం
– డాక్టర్ రచన ఆర్‌ఆర్, సీనియర్ శాస్త్రవేత్త, ఎన్‌బీఎఐఆర్, బెంగళూరు
పంట నష్టం అపారం
ఈ పురుగు మిరపపై ఉధృతంగా వ్యాపించింది. 60 శాతానికి పైగా పంటను దెబ్బతీసింది. నష్ట తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో మిరపతో పాటు ఇతర పంటలపై కూడా ఎక్కువగా కన్పిస్తోంది. సాధ్యమైనంత త్వరగా దీన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వచ్చే సీజన్‌లో విత్తు నుంచి కోత వరకు అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై కేంద్రం త్వరలో ప్రొటోకాల్‌ను రూపొందిస్తుంది.
– డాక్టర్ రాఘవేంద్ర కే.వీ, ఎంటమాలజీ శాస్త్రవేత్త, ఎన్‌సీఐపీఎం, న్యూఢిల్లీ
ప్రారంభ దశలోనే గుర్తించాం
ఈ పురుగు ఉధృతిని ప్రారంభ దశలోనే గుర్తించాం. ఎన్‌బీఏఐఆర్‌కు శాంపిల్స్ పంపించాం. వాటి తీవ్రతను గుర్తించగలిగాం. ఆర్బీకే స్థాయిలో యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాం. రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే జాతీయ స్థాయిలో అధ్యయనం జరుగుతోంది.
– డాక్టర్ ఎస్‌ఎస్ శ్రీధర్, కమిషనర్, ఏపీ ఉద్యాన శాఖ
Comments
Please login to add a commentAdd a comment