తెల్లదోమ టమాటా పంటకు తీవ్రనష్టం కలిగిస్తుంటుంది. ఈ తెల్లదోమ ద్వారా వైరస్‌లు, మోల్డ్ వంటి తెగుళ్లు టమాటాకు సోకి తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి. అయితే, టొమాటా మొక్కల పక్కన బంతి మొక్కలు పెంచితే చాలు తెల్లదోమ బెడద తీరిపోతుందని పెద్దలు చెబుతుంటారు. బంతి మొక్క ఆకులు, పూల ద్వారా వెలువరించే వాసనలు తెల్లదోమను పారదోలుతుంటాయని కూడా మనకు తెలుసు. ఇంతకీ బంతి చెట్లు వెలువరించే వాసనల్లో ఏ రసాయనం ఉంది? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై గతంలో పెద్దగా అధ్యయనాలు జరగలేదు. ఇటీవల ఇంగ్లండ్‌లోని న్యూక్యాజిల్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ నేచురల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో అధ్యయనం జరిగింది.
లిమొనెనె అనే రసాయనాన్ని బంతి మొక్కలు గాలిలోకి వదులుతూ ఉంటాయని, ఈ వాసన తెల్లదోమకు నచ్చక దూరంగా వెళ్లిపోతాయని తేలింది. ఈ వాసన పీల్చిన తెల్లదోమలు చనిపోవు. దీని వల్ల టమాటాల నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గడం లేదని గుర్తించారు. రసాయనిక పురుగుమందులకు ప్రత్యామ్నాయంగా ఇదే తరహాలో తెల్లదోమను పారదోలే స్ప్రేను తయారు చేయడానికి అవకాశం ఉందా అన్న అంశంపై అధ్యయనానికి సారధ్యం వహించిన డా. కొలిన్ టోష్, నియల్ కాన్‌బాయ్ దృష్టి సారిస్తున్నారు. బత్తాయి, నారింజ, నిమ్మ పండ్ల తొక్కల్లో కూడా లిమొనెనె పుష్కలంగా ఉంటుందట. ఉద్యాన తోటల్లో బంతి మొక్కలు వేసుకుంటే తేనెటీగలు కూడా వస్తాయి. ఉద్యాన తోటల సాగులో ఒకే రకం పంటను సాగు చేయడానికి బదులు.. కలిసి పెరుగుతూ పరస్పరం చీడపీడల నుంచి రక్షించుకునే రకరకాల పంటలను పక్క పక్కన నాటుకోవడం మేలన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చిచెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment