అల్లాడిస్తున్న తెల్లదోమ! | Loss of coconut and palm gardens with white mosquitoes | Sakshi
Sakshi News home page

అల్లాడిస్తున్న తెల్లదోమ!

Published Tue, Feb 6 2018 12:26 AM | Last Updated on Tue, Feb 6 2018 12:26 AM

Loss of coconut and palm gardens with white mosquitoes - Sakshi

విదేశాల నుంచి దిగుమతయ్యే వ్యవసాయోత్పత్తులు,మొక్కలు, పండ్లు, కాయలపై సరైన నిఘాలేకపోవడం వల్ల కొత్త రకం చీడపీడలు మన దేశంలోకి ప్రవేశించి రైతులకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ‘రూగోస్‌ వలయాకారపు తెల్లదోమ’ తాజాగా ఈ జాబితాలోకి చేరింది. ఫ్లోరిడా నుంచి ఏడాదిన్నర క్రితం కేరళకు దిగుమతైన రూగోస్‌ తెల్లదోమ అక్కడి కొబ్బరి తోటలను చావుదెబ్బ తీíసింది.  తమిళనాడు, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, గోవాలకు పాకింది. ఉభయ గోదావరి జిల్లాల్లో నర్సరీలకు, కొబ్బరి, పామాయిల్‌ తోటలకు సోకింది.  ఈ తోటలను కేరళకు చెందిన కేంద్రీయ వన్యతోట పంటల పరిశోధనా కేంద్రం ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్‌ రాజ్‌కుమార్‌ ఇటీవల పరిశీలించారు. రసాయనిక పురుగుమందులు చల్లకుండా ఉండటమే పరిష్కారమని  ‘సాగుబడి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.. ముఖ్యాంశాలు..

ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి తోటలను తీవ్రంగా నష్టపరుస్తున్న కొత్త రకం తెల్లదోమ గురించి రైతాంగంలో ఇటీవల ఆందోళన నెలకొంది. ఈ తెల్లదోమ కేరళ మీదుగా ఇతర రాష్ట్రాలకు వ్యాపించిందని చెబుతున్నారు. ఇది కేరళకు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది? 2016 జూలైలో కేరళలో కొబ్బరి తోటలపై ‘రూగోస్‌ వలయాకారపు తెల్లదోమ’(అల్యూరోడికస్‌ రుగియో పెర్యులేటస్‌) కనిపించింది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతం నుంచి తెచ్చిన పూల మొక్కల ద్వారా ఇది మన దేశంలోకి వచ్చింది. కేరళలోని అనేక జిల్లాల్లో కొబ్బరి తోటలను ఇది తీవ్రంగా నష్టపరిచింది. ఇక్కడి నుంచి తమిళనాడు, ఆంధ్రపదేశ్, కర్ణాటక, గోవాలకు పాకింది.
    
  ముఖ్య శాస్త్రవేత్త డా. జోసెఫ్‌ రాజ్‌కుమార్‌

► రూగోస్‌ తెల్లదోమను గుర్తించడమెలా?
రూగోస్‌ తెల్లదోమ.. దక్షిణ భారత రాష్ట్రాల్లో విరివిగా జామ, కొబ్బరి తోటల్లో కనిపించే వలయాకార తెల్లదోమ(స్పైరలింగ్‌ వైట్‌ఫ్లై)ని పోలి ఉంటుంది. ఈ దోమ రెక్కల మీద గోధుమ రంగు పట్టీలను బట్టి రూగోస్‌ తెల్లదోమను గుర్తించవచ్చు. దీన్ని 2009లో ఫ్లోరిడా(అమెరికా)లో కొన్ని పూల మొక్కలపై తొలుత గుర్తించారు. మెక్సికో, గౌటెమాలాకు కూడా పాకింది. మన దేశంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కేరళలోని అన్ని జిల్లాలకు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలకు వ్యాప్తిచెందింది. కోస్తా తీర ప్రాంతాల్లోని కొబ్బరి తోటలను ఆశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి, హైబ్రిడ్‌ రకాల కొబ్బరి తోటలు, కొబ్బరి మొక్కలకు సోకింది. అయితే, కేరళలో ఎత్తయిన కొబ్బరి తోటలకు కూడా సోకినా, నష్టం తక్కువగా ఉంది.  

► రూగోస్‌ తెల్లదోమ పంటలను ఎలా నష్టపరుస్తుంది?
రూగోస్‌ తెల్లదోమ ఒక రకమైన రసంపీల్చే తరగతికి చెందిన రెక్కల పురుగు. ఇది సుమారు 2.5 మి.మీ. పొడువుతో మిగతా తెల్లదోమల కంటే పెద్దదిగా ఉంటుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల చెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఆకుల మీద అర్ధవృత్తాకారంలో వలయాలు వలయాలుగా గుడ్లు పెడుతుంది. ఈ వలయాలు తెల్లని దూదిలాంటి పదార్థాన్ని కలిగి ఉంటాయి... అంతేకాక, రెక్కల పురుగులు తేనె వంటి జిగురును విసర్జిస్తాయి. ఈ జిగురుకు నల్లరంగులో ఉండే ఒక శిలీంధ్రం(సూటి మౌల్డ్‌) ఆకర్షితమై.. ఆకులపై నల్లగా పరుచుకుంటుంది. దాని వల్ల కిరణజన్య సంయోజక క్రియ తగ్గి, చెట్టు బలహీన పడుతుంది. తెల్లదోమ తాకిడి తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆకులేకాక, రెమ్మ మొదళ్లు, లేత కొబ్బరికాయలు సైతం తెల్లని దూదిలాంటి పదార్థంతో నిండిపోయి ఉంటాయి.

► తెల్లదోమ తీవ్రత ఎలా ఉంది?
దీన్ని ప్రకృతిసిద్ధమైన జీవనియంత్రణతోనే అదుపు చేయగలం. రసాయనిక పురుగుమందుల ద్వారా నియంత్రించలేం. రసాయనిక పురుగుమందుల వాడకం తక్కువ కాబట్టి కేరళలో 3–5 నెలల్లో రూగోస్‌ తెల్లదోమ తీవ్రత తగ్గింది. అయితే, తమిళనాడులో రసాయనిక పురుగుమందుల వాడకం ఎక్కువ కాబట్టి అక్కడ అదుపులోకి రాలేదు.

► సహజ పద్ధతుల్లో తెల్లదోమను అదుపు చేసేదెలా?
కందిరీగ జాతికి చెందిన చిన్న దోమ పరిమాణంలో ఉండే ఒక పరాన్నజీవి రూగోస్‌ తెల్లదోమ వృద్ధిని అదుపులో పెడుతుండటం గమనించాం. దీన్ని ఎన్‌కార్సియ గోడెలోపి అంటారు. వీటితోపాటు కొన్ని టెంకరెక్క పురుగులు (బీటిల్స్‌), సాలెపురుగులు కూడా ఈ తెల్లదోమ నియంత్రణలో తోడ్పడతాయి. రసాయనిక పురుగుమందులు ఎక్కువగా వాడిన తోటల్లో ఈ సహజ శత్రువులు తక్కువ సంఖ్యలో ఉంటున్నట్లు గమనించాం.

► ఎటువంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి?
తెల్లదోమ మరీ తీవ్రస్థాయిలో ఉంటే 0.5 శాతం వేపనూనె(లీటరు నీటికి 5 గ్రాముల వేపనూనె)ను పిచికారీ చేయాలి. నల్లని శిలీంధ్రం ఉధృతంగా పరచుకున్న ఆకుల మీద 1% మైదా పిండి (లీటరు నీటికి 10 గ్రాముల మైదా పిండి) ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ సహజ శత్రువులను బాగా వృద్ధి అయిన తోటల్లో నుంచి ఆకు ముక్కలను తీసుకెళ్లి.. ఉధృతంగా ఉన్న తోటల్లో చెట్లపైన ఉంచాలి. జిగురుతో కూడిన పసుపు అట్టలను చెట్ల మొదళ్లకు చుట్టాలి. తద్వారా కొంతవరకు ఈ దోమలను దిగ్బంధించవచ్చు. నల్ల శిలీంధ్రాన్ని తినే టెంకరెక్క పురుగులను గుర్తించి, పరిరక్షించాలి.

► ఇంకా పాటించాల్సిన నియమాలేమైనా ఉన్నాయా?
తెల్లదోమ తాకిడి గల ప్రాంతం నుంచి కొబ్బరి మొక్కలుగానీ, ఆకులు గానీ, కాయలుగానీ లేదా పామ్‌ సంతతికి చెందిన అలంకారపు మొక్కలు గాని వేరే ప్రాంతాలకు తరలించకూడదు. దోమ తాకిడి గల ప్రదేశాల నుంచి తాకిడి లేని ప్రదేశాలకు వెళ్లే రవాణా వాహనాలను పూర్తిగా శుద్ధి చేయాలి. విమానాశ్రయాలలో/నౌకాశ్రయాలలో మొక్కలు, కాయల తరలింపుపై కఠిన నియమాలను అమలు చేయడం ద్వారా హానికర చీడపీడల వ్యాప్తిని అరికట్టాలి.

► నర్సరీల నుంచి కొబ్బరి మొక్కల అమ్మకాలను ఆపెయ్యాల్సిన అవసరం ఉందా?
పూర్తిగా ఆపెయ్యనక్కరలేదు. అయితే, రూగోస్‌ తెల్లదోమ లేదని నిర్ధారణ జరిగిన తర్వాతే నర్సరీ నుంచి కొబ్బరి మొక్కలను బయటకు పంపాలి. తెల్లదోమ ఆశించిన మొక్కలను ఇవ్వకూడదు.

 ► రసాయనిక పురుగుమందులను నిషేధించాలా?
పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లదోమ ఉధృతంగా ఉన్న కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటల్లో, ఆ పరిసరాల్లో కనీసం 4–5 నెలల పాటు రసాయనిక పురుగు మందుల వాడకాన్ని కచ్చితంగా ఆపెయ్యాలి. ప్రభుత్వ పర్యవేక్షణలో రైతులు స్వచ్ఛందంగా ఈ జాగ్రత్త పాటించాలి. ఇలా జాగ్రత్తపడిన రైతుల తోటల్లో తెల్లదోమ అదుపులోకి వచ్చింది. 

► రూగోస్‌ తెల్లదోమ ఆశించే ఇతర పంటలేవి?
ఇది ప్రపంచవ్యాప్తంగా 43 కుటుంబాలకు చెందిన 118 పంటలకు, మొక్కలకు ఆశిస్తుంది. దక్షిణ భారతదేశంలో కొబ్బరితోపాటు మామిడి, జామ, అరటి, రామాఫలం, పనస చెట్లతోపాటు, కరివేపాకుపైన, హెలికోనియా అనే పూల జాతి మొక్కలపైన రూగోస్‌ తెల్లదోమ కనిపించింది. అయితే, వీటిలో ఒక్క అరటి మొక్కల మీద మాత్రమే ఇది తన పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేయగలదు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది?
పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో రూగోస్‌ తెల్లదోమ సోకిన కొబ్బరి తోటలను ఇటీవల పరిశీలించాను. రూగోస్‌ తెల్లదోమలు సోకిన చెట్ల మీద వీటిని సహజంగా అదుపు చేసే ఎన్‌కార్పియా గౌడలోపే రకం కందిరీగల్లాంటి పురుగులు కూడా కనిపించాయి. కాబట్టి, మరీ భయపడనక్కరలేదు. తెల్లదోమ తోటలను చంపెయ్యదు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా జాగ్రత్తలు పాటిస్తే కొన్నాళ్లలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. రసాయనిక పురుగుమందులను చల్లితే మిత్రపురుగులూ చనిపోయి.. తెల్లదోమ ఉధృతి పెరుగుతుంది.
‘‘
బదనికలు వదిలిన తర్వాత తెల్లదోమ తగ్గింది..
మా కొబ్బరి తోటకు సోకిన రూగోస్‌ తెల్లదోమ వలన దిగుబడి తగ్గుతుందని ఆందోళనగా ఉంది. ఆరు ఎకరాల్లో గోదావర గంగా టీఅండ్‌డీ రకం కొబ్బరిని సాగు చేస్తున్నాను. మొదటిసారిగా 2017 అక్టోబర్‌ నెలాఖర్లో కొబ్బరి తోటను తెల్లదోమ ఆశించింది. కొవ్వూరు, అంబాజీ పేట కొబ్బరి పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి, తెల్లదోమ నివారణకు వేపనూనెను పిచికారీ చేయమని సూచించారు. మళ్లీ డిసెంబర్‌లో మరోసారి తెల్లదోమ విజృంభించింది. నిడదవోలు, చాగల్లు మండలాల్లో సుమారు 12 వందల హె క్టార్లో కొబ్బరికి, ఆరు వందల హెక్టారుల్లో  పామాయిల్‌ తోటలకు తెల్లదోమ ఆశించింది. శాస్త్రవేత్తలు కేరళ నుంచి బదనికలు తీసుకువచ్చి జనవరి మొదటి వారంలో నా వ్యవసాయక్షేత్రంలో వదిలారు. బదనికలు వదిలాక తెల్లదోమ తీవ్రత తగ్గింది. తెల్లదోమను పూర్తి స్థాయిలో అరికట్టకపోతే పంట దిగుబడులు తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలున్నాయి.

              ముళ్లపూడి మురళీకృష్ణ (94405 83725), కొబ్బరి రైతు, కలవలపల్లి, చాగల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా

– ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌‘‘

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement