తెల్లదోమ విజృంభణ | White mosquitoes impacts on crops | Sakshi
Sakshi News home page

తెల్లదోమ విజృంభణ

Published Tue, Mar 17 2020 6:55 AM | Last Updated on Tue, Mar 17 2020 6:56 AM

White mosquitoes impacts on crops - Sakshi

సర్పిలాకార తెల్లదోమ దెబ్బకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉద్యానతోటలు అతలాకుతలమవుతున్నాయి. మరీ ముఖ్యంగా కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటలను ఇది పీల్చి పిప్పి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూల ð ¬క్కలకు ప్రసిద్ధిగాంచిన కడియం నర్సరీలనూ తెల్లదోమ చుట్టుముట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల రైతాంగంతోపాటు తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంత కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ రైతులను సైతం కలవరపెడుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా కృషి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఉద్యాన శాఖ సమీక్షలో ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఈ పనిలో నిమగ్నమైన అధికార యంత్రాంగం సీఎం ఆదేశాలతో నివారణ చర్యలను ఉధృతం చేసింది.

రూగోస్‌ తెల్లదోమ ఇలా వ్యాపిస్తుంది
► వలయాకారపు తెల్లదోమ (రూగోస్‌) ప్రధానంగా గాలి ద్వారా తొలుత కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ చెట్లను ఆశిస్తుంది. వీటిలో చక్కెర ఎక్కువ ఉండటమే దీనికి ప్రధాన కారణం.
► అక్కడి నుంచి జామ, మామిడి, పూలు, అలంకరణ మొక్కలను ఆశిస్తుంది.
► ఆకులో ఉండే పత్ర హరితాన్ని హరిస్తుంది.
► ఆకుల నుంచి రసాన్ని పీల్చి వేసి మైనం లాంటి తెల్లటి పదార్థాన్ని విసర్జిస్తుంది. దానిపై ’కాప్నోడియం’ అనే బూజు పెరిగి.. ఆకుపై నల్లటి పొర ఏర్పడుతుంది. దీని వల్ల సూర్యరశ్మి అందక కిరణజన్య సంయోగ ► క్రియ స్తంభించి చెట్టు పూర్తిగా నీరసించిపోతుంది.
► కొబ్బరిలో 40 శాతం, ఆయిల్‌ పామ్‌లో 35 శాతం దిగుబడి తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
► తెల్లదోమను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదని, నివారణే మార్గమంటున్నారు.

ఎక్కడెక్కడ ఉందంటే..?
► తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని కొబ్బరి తోటల్ని, ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని వేలాది ఎకరాల ఆయిల్‌ పామ్‌ తోటల్ని ఇది ఆశించింది.
► తెలంగాణలోని సత్తుపల్లి ప్రాంతంలో కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటల్ని కూడా తెల్లదోమ ఆశించింది.  
► కడియం నర్సరీలలో కొబ్బరి, ఆయిల్‌ పామ్, జామ, అలంకరణ మొక్కలను సైతం తెల్లదోమ కమ్మేసింది.
► 1.60 లక్షల ఎకరాల కొబ్బరిని, అదే స్థాయిలో ఆయిల్‌ పామ్‌ తోటల్ని ఇది ఆశించినట్టు అనధికారిక అంచనా.


సమగ్ర యాజమాన్యంతోనే తెల్లదోమకు చెక్‌
► సర్పలాకార తెల్లదోమ సోకితే రసాయనిక పురుగుమందులు చల్లటం తగదు. వీటిని చల్లితే మిత్రపురుగులు నశించి తెల్లదోమ రెండు–మూడు రెట్లు విజృంభిస్తుంది. అందువలన అవాంఛిత పురుగుమందుల వాడకం నివారించి మిత్రపురుగులను పెంచుకోవాలి.
► జీవ నియంత్రణతో తెల్లదోమను అదుపు చేయొచ్చు.
► కొబ్బరి, ఆయిల్‌పామ్‌ తోటల్లో పసుపు రంగు టార్పలిన్‌ అట్టలను ఎకరానికి 10 నుంచి 15 చొప్పున (1 మీ.“ 1 మీ. విస్తీర్ణం) అతికించి, వాటికి ఆముదం పూసి, తెల్లదోమ తల్లి పురుగులను ఆకర్షించి, చంపాలి.
► వీటి ద్వారా దోమను పూర్తిగా అదుపు చేయకున్నా.. ఒక తల్లి దోమను చంపడం ద్వారా 100 పిల్ల దోమలను నిరోధించవచ్చు.
► తెల్లదోమ సోకిన మొక్కలను ఒక చోట నుంచి మరొక చోటకు తరలించకూడదు.
► డైకోక్రైసా ఆస్టర్‌ పురుగు తెల్లదోమ గుడ్లను తినేస్తుంది. డైకోక్రైసా ఆస్టర్‌ సంతతి వృద్ధికి దాని గుడ్లను తెల్లదోమ ఆశించిన తొలి దశలోనే చెట్ల ఆకులకు పిన్‌ చేసుకోవాలి. వీటిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా స్థానంలోనే దేశంలోకెల్లా మొట్టమొదటి సారిగా ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. దేశవ్యాప్తంగా రోజుకు 3–4 లక్షల గుడ్లకు డిమాండ్‌ ఉంది. వచ్చే ఏడాది నుంచి రోజుకు లక్ష గుడ్ల ఉత్పత్తికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
► మిత్రపురుగైన ఎన్‌కర్సియా గ్వడెలోపే అనే బదనికలు ఈ తెల్లదోమలను అదుపులో ఉంచుతాయి. ఈ పురుగును ప్రయోగశాలలో ఉత్పత్తి చేసే అవకాశం లేదు. సహజ సిద్ధంగా కొబ్బరి తోటల్లో ఈ మిత్ర పురుగులు అభివృద్ధి చెందుతుంటాయి. అక్కడి నుంచి సేకరించి తెల్లదోమ ఆశించిన ప్రాంతాల్లో విడుదల చేయాలి.
► రిజర్వాయర్‌ మొక్కలు / బ్యాంకర్‌ మొక్కలను పెంచడం వలన ఎన్‌కార్సియా గ్వడెలోపే సంతతి పెరుగుతుంది.  
► పురుగు స్థాయి ఎక్కువగా ఉండి మిత్రపురుగులు లేకపోతే, 1 శాతం వేపనూనెకు 10 గ్రా. డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపి ఆకు అడుగు భాగాలు పూర్తిగా తడిచేలా 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
► ఐసోరియ ఫ్యూమోసోరోసే అనే రకం కీటకాలను అరికట్టే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 5 గ్రాముల స్పోర్స్‌ సాంద్రత  1“108గా ఉండాలి చొప్పున కలిపి తయారు చేసుకున్న శిలీంద్ర ద్రావణాన్ని 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా తెల్లదోమను అదుపులోకి తేవచ్చు. శిలీంద్రం సాంద్రత తగినంత లేకపోతే ఫలితాలు పాక్షికంగానే వస్తాయి. ఒక ప్రాంతంలో రైతులందరూ కలిసికట్టుగా చేయాల్సి ఉంటుంది. శిలీంద్ర ద్రావణాన్ని తయారు చేసుకునే పద్ధతిని అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధనా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మదర్‌ కల్చర్‌ను కూడా పంపిణీ చేస్తున్నారు.
► నీటికి కొరత లేకపోతే.. నీటిలో డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపి తెల్లదోమ ఆశించిన మొక్కలపై 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి.
► పగటి ఉష్ణోగ్రత పెరగేకొద్దీ తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. 40 డిగ్రీల సెల్షియస్‌కు పెరిగేటప్పటికి తగ్గుతుంది.
► రైతులు సామూహికంగా నివారణ చర్యలు చేపడితే సర్పలాకార తెల్లదోమను సమర్థవంతంగా అరికట్టవచ్చు.


– డా. ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన స్థానం, డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, అంబాజీపేట, తూ.గో. జిల్లా  
 
– ఎ. అమరయ్య, సాక్షి బ్యూరో,  అమరావతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement