పట్టణాలు.. నగరాల సరిహద్దు కమతాలు ప్లాట్లుగా.. బహుళ అంతస్తుల భవనాలుగా కనిపిస్తున్న సంగతి తెలుసు! అవే పట్టణాలు, నగరాల పొలిమేర భూములే కాదు.. నడిబొడ్డు ఖాళీస్థలాలు కూడా కూరగాయలు పండించే తోటలుగా మారుతున్న వైనం తెలుసా?! దీన్నే అర్బన్.. పెరీ అర్బన్ హార్టికల్చర్’ అంటున్నారు. సింపుల్‌గా ‘గ్రీన్ సిటీస్ ప్లానింగ్’ అన్నమాట!!
ఇదే ప్రస్తుత ప్రపంచ ఒరవడి.. అభివృద్ధి చెందుతున్న దేశాలకు గొప్ప వరం! అనుసరిస్తే పోయేది మురికివాడలు.. పెరిగేది ఉపాధి.. సిద్ధించేవి పర్యావరణ ప్రియ ప్రాంతాలు!! ఈ ట్రెండ్‌ను ప్రోత్సహించడానికి వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ ‘ప్రైజ్ ఫర్ సిటీస్’ అవార్డులనూ అందిస్తోంది రెండేళ్లకోసారి. ఈ ఏడు అర్జెంటీనాలోని ‘రొసారియో’ ఆ అవార్డ్‌ను అందుకుంది. అసలు గ్రీన్ సిటీస్ ప్లానింగ్ ఎలా ఉంటుంది? రొసారియో సక్సెస్ స్టోరీ ఏంటీ?
వివరాలు ఈ కవర్ స్టోరీలో..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాలు, పట్టణాలు గతమెన్నడూ ఎరుగనంత వేగంగా విస్తరిస్తున్నాయి. ఉపాధిని వెతుక్కుంటూ పొట్ట చేత పట్టుకొని గ్రామీణులు వలస బాట పడుతున్న కారణంగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరాలు/పట్టణ ప్రాంత జనాభా నానాటికీ భారీగా పెరుగుతోంది. ప్రపంచంలో సగానికిపైగా జనం ఇప్పటికే నగరవాసులు. 2050 నాటికి ప్రపంచ జనాభా (900 కోట్లు)లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు పట్టణ ప్రాంతవాసులవుతారట. 2025 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల జనాభాలో సగానికి సగం (350 కోట్ల) మంది పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తూ ఉంటారని ఓ అంచనా.
ఐరోపా, ఉత్తర అమెరికా దేశాల్లో నగరీకరణకు శతాబ్దాల కాలం పట్టింది. అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పారిశ్రామికీకరణ నేపథ్యంలో వేగంగా పెరుగుతున్న తలసరి ఆదాయం మూలంగా రెండు–మూడు తరాల్లోనే నగరీకరణ వేగవంతమవుతోంది. ఉపాధి అవకాశాల మెరుగుకన్నా అధిక జననాల రేటు కారణంగానే ఈ పట్టణ ప్రాంతాల్లో జనాభా సాంద్రత పెరుగుతోంది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అల్పాదాయ దేశాల్లోని నగరాల జనాభా ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇక్కడ నగరీకరణతో పేదరికం, నిరుద్యోగం, ఆహార అభద్రత కూడా పోటీపడుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు తగినంత ఆరోగ్య, నీటి, పారిశుద్ధ్య సదుపాయాలకు నోచుకోక, కాలుష్యపు కోరల్లో చిక్కి, కిక్కిరిసిన మురికివాడల్లో జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని నగరాలు, పట్టణాల్లో నివాసం ఉండే 77 కోట్ల మందిలో సుమారు 30% మంది నిరుద్యోగులు లేదా అత్యల్ప ఆదాయంతో బతుకులీడుస్తున్న నిరుపేదలు. లాటిన్ అమెరికా దేశాల్లో పేదల్లో 85% మంది.. ఆఫ్రికా, ఆసియా దేశాల్లోని పేదల్లో సగానికి సగం మంది ఇప్పటికే నగరాలు, పట్టణ ప్రాంతాలకు చేరి ఉపాధి వెతుక్కుంటున్నారు. దీని అర్థం ఏమిటంటే.. సాంఘిక భద్రత, ఉపాధి అవకాశాలు కొరవడిన పేదలతో మన పట్టణాలు, నగరాలు గతమెన్నడూ ఎరుగనంతగా కిక్కిరిసిపోయి ఉన్నాయి.
గ్రీన్ సిటీలే శరణ్యం
చారిత్రకంగా నగరీకరణలో ఆశావహ పరిస్థితి కొరవడిందని చెప్పలేం. అయితే, నగరీకరణ జరుగుతున్న తీరు మాత్రం ప్రజలకు సుస్థిరమైన జీవనాన్ని అందించే రీతిలో లేదన్నది వాస్తవం. వందల కిలోమీటర్ల దూరం నుంచి రవాణా అయ్యే ఆహారోత్పత్తులపైనే నగరాలు, పట్టణాలు అమితంగా ఆధారపడుతుండటం పెను సవాలుగా నిలిచింది. దూర ప్రాంతాల నుంచి ఆహారోత్పత్తుల్ని తరలించడం వల్ల భూతాపం పెరుగుతున్నది.
అస్థిర పద్ధతుల నుంచి మళ్లించి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా నగరీకరణను నడిపించడం ఇప్పుడు మానవాళి ముందున్న పెద్ద సవాలు. నగరాలు, పట్టణాల్లో ప్రజలు స్థానికంగా ఉత్పత్తి చేసుకునే పౌష్టికాహార లభ్యతతో కూడిన మెరుగైన సుస్థిర జీవనం వైపు.. ఆశావహమైన అవకాశాల దిశగా అడుగులు వేయాలంటే ‘గ్రీనర్ సిటీస్’ను నిర్మించుకోవటం అనివార్యమని, అసాధ్యమూ కాదని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. భరోసా ఇస్తోంది.
అర్బన్ హార్టికల్చర్‌కు పెద్ద పీట
పర్యావరణ మార్పుల్ని తట్టుకోవటం, స్వావలంబన, సాంఘిక, ఆర్థిక, పర్యావరణ సుస్థిరత ప్రధానాంశాలే గ్రీన్ సిటీస్ భావన. పర్యావరణ అనుకూల సూత్రాలను ఇముడ్చుకున్న అత్యాధునిక భవన నిర్మాణ పద్ధతులు, సైకిల్ గ్రీన్‌వేస్, పట్టణ వ్యర్థాల పునర్వినియోగం.. వంటి అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. దీన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పటి నుంచో అమలుపరుస్తున్నాయి.
అల్పాదాయ దేశాల్లో స్థితిగతులు అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే భిన్నంగా ఉన్నప్పటికీ గ్రీనర్ సిటీస్ నమూనాతో కూడిన పట్టణాభివృద్ధి ప్రణాళికను అనుసరించవచ్చు. ఆహార భద్రతను కల్పించడం, గౌరవప్రదమైన పనిని, ఆదాయాన్ని పొందే మార్గాలు చూపటం, శుద్ధమైన పర్యావరణాన్ని, సుపరిపాలనను ప్రజలందరికీ అందించాలన్నవి ఈ నమూనాలో ముఖ్యాంశాలు.
ఒక్కమాటలో చెప్పాలంటే పట్టణ, నగర పరిధిలో, పరిసర ప్రాంతాల్లో ప్రకృతికి, ప్రజారోగ్యానికి హాని కలగని వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు వంటి ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమివ్వటం గ్రీనర్ సిటీస్ నమూనా. అటు అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, ఇటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం గ్రీన్ సిటీ ప్లానింగ్‌లో ‘అర్బన్ అండ్ పెరీ అర్బన్ హార్టికల్చర్’కు చోటు కల్పిస్తుండటం ఆధునిక ధోరణిగా ప్రాచుర్యంలోకి వస్తోంది.
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళదుంపలు, బీట్‌రూట్ వంటి దుంప పంటలు, అలంకరణ, ఔషధ మొక్కలను సాగు చేయవలసింది గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు. పట్టణాలు, నగరాలు వాటి పరిసర ప్రాంతాల్లోనూ చేయాలి. ఇలా ప్రత్యేక శ్రద్ధతో రైతులు, పట్టణ పేదలతో సాగు చేయించడాన్నే ‘అర్బన్, పెరీ అర్బన్ హార్టికల్చర్’ అంటున్నాం. పట్టణాలు, నగరాల్లో తమ కుటుంబం తినటం కోసం, మిగతాది అమ్మటం కోసం ఉద్యాన పంటలు పండించే అర్బన్ ఫార్మర్స్ ఆఫ్రికాలో 13 కోట్ల మంది, లాటిన్ అమెరికాలో 23 కోట్ల మంది ఉన్నారని ఎఫ్.ఎ.ఓ. అంచనా.
గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాలకు వలస వచ్చిన పేదలు ఉద్యాన పంటలు సాగు చేసి పొట్టపోసుకోవటం కొన్ని దేశాల్లో సాధారణమే. మరికొన్ని దేశాల్లో అర్బన్ హార్టికల్చర్‌పై నిషేధం అమల్లో ఉంది. అయితే, క్రమంగా ఈ ధోరణిలో మార్పు వస్తోంది. సిటీ ఫార్మర్స్‌కు అడ్డంకిగా ఉన్న నిబంధనలు తొలగించి, ప్రోత్సాహకాలను అందించటం, శిక్షణ ఇవ్వటం వంటి విషయాలపై విధాన సహాయం కోసం ఇటీవల కాలంలో 20 ఆఫ్రికా దేశాలు ఎఫ్.ఎ.ఓ.ను ఆశ్రయించడం ట్రెండ్ మారుతున్నదనడానికి నిదర్శనం.
నగర పరిసర ప్రాంతాల్లో వాణిజ్యస్థాయిలో విస్తృతంగా పంటల సాగు, మురికివాడల్లో మట్టి లేకుండా హైడ్రోపోనిక్ పద్ధతుల్లో మైక్రో గార్డెన్ల నిర్వహణ.. నగరాల్లో కిక్కిరిసిన ఇళ్లపై రూఫ్‌టాప్ కిచెన్ గార్డెన్ల సాగుపై ఎఫ్.ఎ.ఓ. మార్గదర్శనం చేస్తోంది. పట్టణ పేదలకు పౌష్టికాహార, ఆహార భద్రతను కల్పించడంలో, సాధికారత చేకూర్చడంలో అర్బన్, పెరీ అర్బన్ హార్టీకల్చర్ నిస్సందేహంగా దోహదపడుతున్నట్లు ఎఫ్.ఎ.ఓ. తదితర సంస్థల కార్యక్రమాల ద్వారా రుజువైంది. అర్బన్ హార్టీకల్చర్‌కు నగర అభివృద్ధి ప్రణాళికల్లో పెద్ద పీటవేయడం ద్వారా గ్రీన్ సిటీల వికాసం సాధ్యమేనని వివిధ దేశాల అనుభవాలూ తెలియజెబుతున్నాయి.
రొసారియో.. ఓ వేగుచుక్క!
లాటిన్ అమెరికా దేశమైన అర్జెంటీనా లోని రొసారియో నగరం అర్బన్ హార్టికల్చర్‌పై ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. నగరాభివృద్ధి ప్రణాళికలో అర్బన్ హార్టికల్చర్‌ను అంతర్భాగం చేయటం ద్వారా బహుళ ప్రయోజనాలు సాధిస్తూ ప్రపంచ నగరాలకు ఆదర్శంగా నిలిచింది. మురికివాడల్లోని నిరుపేదలకు నగరంలో, నగర పరిసరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాలను శాశ్వత ప్రాతిపదికన లీజుపై కేటాయించారు.
ఆయా స్థలాల్లో సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించుకునేందుకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో శిక్షణ ఇవ్వటంతోపాటు రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ సదుపాయాలు కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉద్యాన అధికారులను నియమించింది. కర్షక కుటుంబాలు తినగా మిగిలిన కూరగాయలు, పండ్లను, వాటితో తయారు చేసిన అనేక రకాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు ప్రత్యేక మార్కెట్లను ఏర్పాటు చేసింది. తద్వారా వారు ఉపాధి పొందేందుకు వినూత్న అవకాశం కల్పించింది. నగరంలో ప్రతి పౌరుడికి 12 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేస్తున్న అత్యంత ఆకుపచ్చని అర్జెంటీనా నగరంగా రొసారియోను అమెరికా అభివృద్ధి బ్యాంకు 2019లో గుర్తించింది.
నగరంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుతో పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా నగర వాతావరణాన్ని సైతం చల్లబరచుకోవచ్చని, భూతాపాన్ని తగ్గించవచ్చని రొసారియో రుజువు చేస్తోంది. ప్రజలకు అవసరమైన పంటలను వందల కిలోమీటర్ల నుంచి తీసుకురాకుండా నగరం పరిధిలోనే సాగు చేసుకొని తింటున్నందున హరిత గృహ వాయువులు 95% మేరకు తగ్గాయని రొసారియో నేషనల్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
20 ఏళ్ల కృషి
అర్జెంటీనాలో మూడో పెద్ద నగరం రొసారియో. ప్రముఖ మార్క్సిస్టు విప్లవకారుడు చేగువేరా జన్మస్థలం ఇదే. ప్రస్తుత జనాభా 17.5 లక్షలు. పరనా నది ఒడ్డున రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ 179 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. పారిశ్రామిక కేంద్రంగా, వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల కేంద్రంగా విరాజిల్లిన రొసారియో.. 2001లో, సరిగ్గా 20 ఏళ్ల క్రితం, పెను ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. చాలా పరిశ్రమలు మూతపడి నగరంలో సగానికిపైగా జనాభా నిరుపేదలుగా మారిపోయారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి.. ఆహారం ధరలు నాలుగు రెట్లు అధికమై.. జనం ఆకలి దాడులకు పాల్పడాల్సిన దుస్థితి. అటువంటి సంక్షోభ కాలంలో రొసారియో మునిసిపల్ కార్పొరేషన్ 2002లో అర్బన్ హార్టికల్చర్ పథకం ‘ప్రో–గార్డెన్’ అమలుకు శ్రీకారం చుట్టింది.
రసాయనాలు వాడకుండా ఉద్యాన పంటలు సాగు చేయటంలో 700 కుటుంబాలకు తొలుత శిక్షణ ఇచ్చారు. వీరంతా పేదలే. మహిళలు, వయోవృద్ధులు, యువత, వలస జీవులు. మొదట్లో జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ, స్థానికంగా ఆహార భద్రత, ఆదాయ భద్రత ఏర్పడుతున్న విషయం అర్థమయ్యేటప్పటికి అర్బన్ హార్టికల్చర్ ప్లాట్లకు, ఉమ్మడిగా నిర్వహించుకునే కమ్యూనిటీ గార్డెన్లకు గిరాకీ పెరిగింది. కనీస వేతనం కన్నా ఎక్కువగానే సంపాదన కనిపించసాగింది. ఒక దశలో పదివేలకు పైగా పేద కుటుంబాలు ఈ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. తొలి రెండేళ్లలోనే 800కు పైగా పౌర బృందాల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటయ్యాయి.
ఇప్పుడు నగరపరిధిలో ఉన్న ఖాళీ స్థలాలు 185 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సాగు చేస్తున్నారు. నగర పరిధిలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లలో 2,400కు పైగా పేద కుటుంబాలు సొంతంగా ఫ్యామిలీ గార్డెన్లను పెంచుతున్నాయి. జాతీయ కుటుంబ వ్యవసాయదారుల జాబితాలో వీరి పేర్లు నమోదు కావడంతో సాంఘిక భద్రతా పథకాల ద్వారా ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటును వీరు అందుకోగలిగారు. పండించిన సేంద్రియ ఉద్యాన ఉత్పత్తులను ప్రజలకు విక్రయించుకునేందుకు 7 చోట్ల ప్రత్యేక శాశ్వత మార్కెట్లను నెలకొల్పారు.
నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఎక్కువగా జన్యుమార్పిడి సోయా చిక్కుళ్లను ఏకపంటగా రసాయనిక సాగు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. నగర పరిసరాల్లోని 1,977 ఎకరాల అర్బన్ భూముల్లో చిన్న ప్లాట్లలో రకరకాల సేంద్రియ ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఏటా 2,500 టన్నుల సేంద్రియ పండ్లు, కూరగాయలను సాగు చేస్తూ స్థానిక ప్రజలకు అందిస్తున్నారు. 25 మంది ఉద్యాన నిపుణుల ప్రత్యక్ష సేవలను ఉపయోగించుకుంటూ ఆశాజనకమైన సేంద్రియ దిగుబడులు సాధిస్తున్నారు. ఇటు మునిసిపాలిటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు రెండు దశాబ్దాలు చురుగ్గా పాల్గొనడంతో రొసారియో అర్బన్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ నగర పేదలకు ఆహార, ఆరోగ్య, ఆదాయ భద్రతతోపాటు గణనీయమైన స్థాయిలో పర్యావరణ సేవలను సైతం అందించడంతో సూపర్ హిట్ అయ్యింది.
దీన్ని అర్బన్ ప్లానింగ్‌లోనూ చేర్చారు. ప్రకృతి వనరులను కలుషితం చేయకుండా, వ్యర్థాలను పునర్వినియోగిస్తూ ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తిని చేపట్టడంతో సిటీలోని అర్బన్ ఫామ్స్ ద్వారా కనీసం 40 వేల మందికి ఆహార భద్రత చేకూరింది. 340 ఉత్పాదక బృందాలు పంట దిగుబడులకు విలువ జోడించి రకరకాల ఉత్పత్తులను తయారు చేసే సామాజిక వ్యాపార సంస్థలుగా మారాయి. నగరంలో ఖాళీగా ఉండి ఎందుకూ పనికిరావనుకున్న ఖాళీ స్థలాలు, గతంలో చెత్తాచెదారం పోసిన డంపింగ్ యార్డులను సైతం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పునరుజ్జీవింప జేయటంతో పట్టణ ప్రాంతం అంతా పచ్చని పంటలతో నిండిపోయింది.
అర్బన్ లాండ్ బ్యాంక్
ఉద్యాన పంటల కోసం అర్బన్ గార్డెన్లను ఏర్పాటుచేయడంతో అనాదరణకు గురైన పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి ఉపాధి అవకాశాలు దొరికాయి. సాంఘికంగా పరపతి పెరిగింది. రొసారియో యూనివర్సిటీ ప్రభుత్వ, ప్రైవేటు ఖాళీ స్థలాల వివరాలతో డేటాబేస్ తయారు చేసింది. మునిసిపల్ అధికారులు అర్బన్ లాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసి, భూయజమానులకు, అర్బన్ ఫార్మర్స్‌కు అనుసంధానంగా పనిచేస్తూ దీర్ఘకాలిక కౌలు ఒప్పందం అమలు చేయడంతో ఇది సజావుగా సాగుతోంది.
సామాజికంగా పరస్పరం సహకరించుకుంటూ నగర పేదలు సేంద్రియ ఆహారాన్ని ఉత్పత్తి చేసే సానుకూల పరిస్థితులు నెలకొనటం అర్బన్ హార్టికల్చర్ పథకం సాధించిన మరో ఘనతగా చెప్పవచ్చు. సేంద్రియ అర్బన్ హార్టికల్చర్ క్షేత్రాలను ‘ఆహార పర్యాటక’ కేంద్రాలుగా తీర్చిదిద్దటం మరో విశేషం. ‘రొసారియో గ్రాస్ రూట్స్’ పేరిట ప్రతి వసంత రుతువులో నిర్వహించే ఉత్సవానికి పర్యాటకులు పోటెత్తుతుంటారు.
అర్బన్ హార్టికల్చర్ ప్రయోజకతకు మా అనుభవమే రుజువు!
20 ఏళ్లుగా నిరంతరాయంగా విధానపరమైన మద్దతుతో అర్బన్ హార్టికల్చర్ పథకం దిగ్విజయంగా అమలవుతోంది. ‘ప్రైజ్ ఫర్ సిటీస్’ పురస్కారం ఉత్సాహంతో ఈ పథకం అమలును మరింత బలోపేతం చేస్తాం. అర్బన్ హార్టికల్చర్ ద్వారా సుస్థిర ఆహారోత్పత్తితోపాటు సాంఘిక, పర్యావరణపరమైన ప్రయోజనాలనూ చేకూర్చవచ్చని మా అనుభవం రుజువు చేస్తోంది. ప్రకృతితో వ్యవహరించే తీరు మార్చుకోవాల్సిన అవసరం గతమెన్నడూ లేనంతగా ఇప్పుడు మనకు అర్థమవుతోంది.
– పాబ్లో జావ్‌కిన్, రొసారియో నగర మేయర్, అర్జెంటీనా
ప్రైజ్ ఫర్ సిటీస్
ఈ నేపథ్యంలో రొసారియో నగరం ప్రతిష్ఠాత్మకమైన ‘ప్రైజ్ ఫర్ సిటీస్ అవార్డు–2021’ను ఇటీవల గెలుచుకుంది. వరల్డ్ రిసోర్స్ ఇన్‌స్టిట్యూట్ రెండేళ్లకోసారి రెండున్నర లక్షల డాలర్లతో కూడిన ఈ పురస్కారాన్ని అందిస్తుంటుంది. ‘మారుతున్న వాతావరణ పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటున్న నగరం’ పేరిట నిర్వహించిన పోటీకి 54 దేశాల నుంచి 262 నగరాలు దరఖాస్తు చేయగా రొసారియో విజేతగా నిలిచింది.
అర్బన్ హార్టికల్చర్ పథకాలకు అమృతాహారం ద్వారా నగర పేదలు, మధ్యతరగతి ప్రజల ఆహార, ఉపాధి అవసరాలను తీర్చడంతోపాటు.. కాంక్రీటు జంగిల్‌గా మారుతున్న నగరానికి పర్యావరణాభివృద్ధి చేకూర్చి ‘గ్రీన్ సిటీ’గా మార్చే శక్తి కూడా సమృద్ధిగా ఉందని రొసారియో సుసంపన్న అనుభవం చాటిచెబుతోంది. నగర పాలకులూ వింటున్నారా?
– పంతంగి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment