‘అవకాడో’ గురించి మీరెప్పుడైనా విన్నారా? దీన్ని తెలుగులో ‘వెన్నపండు’ అనుకుందాం. విని ఉంటారు గానీ.. తిని ఉండరు. అయితే ఎక్కడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికా ప్రాంతానికి చెందిన ఈ పండు ఇప్పుడు భారత్‌లోనూ పండుతోంది. సూపర్ మార్కెట్లలో కిలోకు రూ.300 వరకూ పలికే ఈ వెన్నపండు ఆంధ్రప్రదేశ్‌లోనూ మరీ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో విరివిగా పండుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉద్యానపంటల్లో భాగంగా అవకాడోను పండించుకోవడం ద్వారా రైతులు లాభాలు గడించవచ్చునని అంటున్నారు.. జి.ఎన్.శ్రీవత్స. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉద్యాన విభాగంలో సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీవత్స దేశంలో అవకాడో పంటకు సంబంధించిన సమాచారం ‘సాక్షి సాగుబడి’కి అందించారు. ఆ వివరాలు..
అర శతాబ్దంగా భారత్‌లో..
ముందుగా చెప్పుకున్నట్లు అవకాడో బ్రెజిల్, సెంట్రల్ అమెరికాకు చెందిన పండు. శాస్త్రీయ నామం పెర్సియా అమెరికానా. పచ్చటి రంగు, గుండ్రటి, కోలగా ఉండే రెండు రకాల్లో లభిస్తాయి. కొన్ని వందల ఏళ్ల క్రితమే బ్రెజిల్ నుంచి దేశాలు తిరిగి జమైకాకు.. ఆ తరువాత సుమారు 50–60 ఏళ్ల క్రితం భారత్‌కూ వచ్చింది. తమిళనాడులోని కోయంబత్తూరు, నీలగిరి ప్రాంతాల్లో ప్రస్తుతం ఎక్కువగా సాగవుతోంది. అవకాడో పండ్లలో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు గణనీయంగా ఉంటాయి. ఈ రకమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయని మనకు తెలుసు. ఈ పండుతో వచ్చే కేలరీల్లో 77 శాతం వరకూ కొవ్వుల ద్వారానే లభిస్తాయి. కాకపోతే అన్నీ శరీరానికి మేలు చేసే కొవ్వులు కావడం గమనార్హం. ఓలిక్ ఆసిడ్ రూపంలో లభించే కొవ్వులు శరీరంలో మంట/వాపులను తగ్గిస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రకంగా చూస్తే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్లు లభించే శాకాహారాల్లో ఇది ఒకటి అని చెప్పుకోవచ్చు. తమిళనాడు తీర ప్రాంతాల్లో బాగా పండుతున్న అవకాడోకు తూర్పు కనుమల్లోనూ అనుకూలమైన వాతావరణం ఉందని శ్రీవత్స తెలిపారు.
అంతర పంటలకూ అవకాశం..
అనేక ఉద్యాన పంటల మాదిరిగానే అవకాడో సాగులోనూ అంతర పంటలకు అవకాశాలు ఉన్నాయి. పది అడుగుల ఎడంతో మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. విత్తనం ద్వారా నేరుగా మొలకెత్తించే అవకాశం లేదు. విత్తనాన్ని పాక్షికం గా నీటిలో ఉంచేలా చేయడం ద్వారా రెండు నుంచి ఆరు వారాల్లో మొలకెత్తుతుంది. కొంతకాలం తరువాత నేలలో నాటుకోవచ్చు. ఆరేడు సంవత్సరాలకు కాపునిచ్చే అవకాడో జీవితకాలం సుమారు 50 సంవత్సరాలు. ఒక్కో చెట్టు ఏటా 200 నుంచి 500 వరకూ పండ్లు కాస్తాయని, వెరైటీని బట్టి ఒక్కో పండు 250 గ్రాముల నుంచి కిలో వరకూ బరువు తూగుతాయని శ్రీవత్స తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే ఖర్చులతో పోలిస్తే దేశీయంగా సాగు చేసుకోవడం ద్వారా అటు రైతులు, ఇటు ప్రజలకూ ప్రయోజనమని ఆయన వివరించారు. బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అవకాడో సాగుకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, అవసరమైన వారు జnటటజీఠ్చ్టిట్చఃజఝ్చజీ .ఛిౌఝ ఈ మెయిల్ ద్వారా తనను సంప్రదించవచ్చునని శ్రీవత్స తెలిపారు.
వెన్నపండు వచ్చెనండి
Published Tue, Feb 11 2020 6:45 AM | Last Updated on Tue, Feb 11 2020 6:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment