కత్తెర పురుగును జయించి కళకళలాడుతున్న మొక్కజొన్న పంట వద్ద డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి, మహారాష్ట్రకు చెందిన రైతు శాస్త్రవేత్త సుభాష్ శర్మ(కుడి)
మన దేశంలో గత సంవత్సర కాలంగా మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు అతలాకుతలం చేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మన శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎన్నో రకాల పురుగులను చూశాం కానీ, ఇటువంటి వేగం, ఉధృతితో పంటకు నష్టం చేయగల కీటకాన్ని చూడటం ఇదే తొలిసారి అని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో దొరుకుతున్న పురుగుమందులన్నీ తెచ్చి పిచికారీ చేస్తున్నా వారం తిరగక ముందే పురుగు యథాస్థితికి వచ్చేస్తోంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో కత్తెర పురుగు నివారణ ఖర్చు మెండై కూర్చుంది. కేవలం రసాయనిక పురుగు మందులకే ఎకరానికి రూ. 2,500 – 4,000 వరకు రైతులు ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఒక మహమ్మారిలా దాపురించింది.
తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో రబీ మొక్కజొన్న కూడా దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో కత్తెర పురుగుపై జరిగిన పరిశోధనలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. దీనికి సారథ్యం వహిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గత 8 నెలల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో జరిగిన విస్తృతమైన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చాయి. రబీలో ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించగలమని డా. శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’ కి తెలిపారు. మొక్కజొన్న రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఆ ప్రయోగ వివరాలు..
కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) మొక్కజొన్న రైతులను వణికిస్తోంది. అయితే, పూర్తి సేంద్రియ పద్ధతుల్లో కొన్ని ప్రత్యేక మెలకువలు పాటిస్తూ సాగు చేస్తే ఈ పురుగు అంత భయంకరమైనదేమీ కాదని డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించి గడచిన ఖరీఫ్, రబీ కాలాల్లో మొక్కజొన్నను పండించి కత్తెర పురుగును జయించే పద్ధతులపై నిర్థారణకు వచ్చారు. ఏయే దశల్లో ఏయే చర్యలు తీసుకున్నదీ, వాటి ఫలితాలు ఎలా వచ్చినదీ నమోదు చేశారు.
భూసారం పెరిగితే కత్తెరకు తెర!
మొక్కజొన్న సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే తొలుత భూ సారం పెంపుదలపై దృష్టి పెట్టాలి. అంతకుముందు పంట పూర్తయిన తర్వాత 3 నెలలు భూమికి విరామం ఇచ్చిన తర్వాత మొక్కజొన్న సాగు చేశారు. గుంటకు 100 కిలోల చొప్పున.. ఎకరానికి 4 టన్నుల (2 ట్రాక్టర్ ట్రక్కుల) గొర్రెల ఎరువు వెదజల్లి దున్ని విత్తనం వేశారు. విత్తనం మొలకెత్తిన తర్వాత 2వ వారంలో.. గుంటకు 10 కిలోలు.. ఎకరానికి 400 కిలోల చొప్పున ఘన జీవామృతం చల్లారు. వర్షం వచ్చినప్పుడో లేక నీటి తడి పెట్టినప్పుడో.. పది రోజులకోసారి.. వేస్ట్ డీ కంపోజర్ లేదా జీవామృతాను.. అదొకసారి, ఇదొకసారి ఎకరానికి వెయ్యి లీటర్ల చొప్పున ఇస్తూ వచ్చారు. భూసారం పెంపుదలకు ఈ రెంటినీ కలిపి మొత్తం 6 సార్లు నేలకు నీటితోపాటు పారగట్టినట్లు శాస్త్రవేత్త డి.నరేశ్ తెలిపారు.
కత్తెర పురుగు బెడద 5–10 వారాలు
కత్తెర పురుగు జీవిత చక్రం వర్షాకాలంలో 5 వారాలు, (ఖరీఫ్) శీతాకాలం (రబీ)లో 10 వారాలు ఉంటుందని, ఈ రెండు కాలాల్లోనూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సమర్థవంతంగా అరికట్టామని డా. శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. రబీ పంట కోతకు సిద్ధమవుతోంది. ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి సాధించగలిగే పరిస్థితి ఉందని ఆయన ధీమాగా చెబుతున్నారు. రైతుకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయవచ్చని.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులెవరైనా ఈ పద్ధతులను అనుసరించి కత్తెర పురుగు దాడి నుంచి మొక్కజొన్న పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చనడంలో సందేహం లేదన్నారు.
మొదటి 2–3 వారాలు కత్తెర బెడద ఎక్కువ
మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత తొలి 2–3 వారాలు అతి సున్నితమైన రోజులు. మొలకెత్తిన రెండో వారానికి పంట 3 ఆకుల దశలో ఉంటుంది. 3వ వారం తర్వాత సుడి ఏర్పడుతుంది. 6 ఆకుల దశ వరకు.. అంటే విత్తిన తర్వాత 35 రోజుల వరకు.. కత్తెర పురుగు బెడద నుంచి పంటను రక్షించుకోగలిగితే చాలా వరకు గట్టెక్కినట్టే. ఆ తర్వాత దశలో కత్తెర పురుగు ఆశించినా పంట ఎదుగుదల వేగాన్ని పుంజుకుంటుంది కాబట్టి నష్టాన్ని పూడ్చుకోగలుగుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే.. పంట మోకాలెత్తుకు ఎదిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుము ఎత్తుకు పెరిగిందంటే చాలు.. ఒక వైపు కత్తెర పురుగు తింటున్నా మొక్క లెక్క చేయదు. ఎదుగుదల ఆగదు.
వేపనూనె, అగ్ని అస్త్రం, లొట్టపీచు కషాయం..
పంట తొలి 2–3 వారాల్లోనే తల్లి పురుగు గుడ్లు విపరీతంగా పెడుతుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో వర్షం లేదా మంచు నీటి చుక్కలతో సుడి నిండి ఉండటంతో పురుగు సుడిలోకి వెళ్లలేదు. ఆ మేరకు సుడికి ప్రకృతి సిద్ధంగానే రక్షణ లభిస్తుంది. ఎండాకాలం పంటకు ఈ రక్షణ తక్కువ. తల్లి పురుగు లేత ఆకులపై, మొదళ్ల దగ్గర కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన లేత లార్వాలు(పురుగులు) ఆకులను తినేస్తుంటాయి. ఈ దశలో వేపనూనె (లీ. నీటికి 1500 పీపీఎం వేపనూనె 5 ఎం.ఎల్.) లేదా అగ్ని అస్త్రం (10%. 10 లీ. నీటికి 1 లీ. అగ్ని అస్త్రం) లేదా లొట్ట పీచు కషాయం (10%. వంద లీ. నీటిలో 10 కిలోల లొట్టపీచు ఆకులు 3,4 పొంగులు పొంగించి, చల్లార్చి వాడాలి) పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధిలో వీటిల్లో ఏదో ఒక దాన్ని 3 లేదా 4 సార్లు పిచికారీ చేయాలి. కత్తెర పురుగు గుడ్లు నశిస్తాయి. లేత లార్వాలు మాడిపోయి చనిపోతాయి.
మట్టి, ఇసుక, ఊకతో సుడికి రక్షణ
మొక్కజొన్న మొలిచిన 4వ వారం, ఆ తదనంతర దశలో సుడి లోపలికి చేరే కత్తెర పురుగు తీవ్రనష్టం కలిగిస్తుంది. అయితే, పొడి మట్టిని లేదా ఇసుకను లేదా వరి ఊక వంటి పదార్థాలను మొక్కజొన్న మొక్క సుడిలో పోయాలి. అప్పటికే సుడిలో ఉండే పురుగు చనిపోతుంది. బయటి నుంచి పురుగులు లోపలికి వెళ్లలేవు. పంట మొలిచిన తర్వాత 4వ వారంలో సుడిలో వేసిన పదార్థం వల్ల.. సుడి నుంచి ఆ తర్వాత వెలువడే 3 నుంచి 5 ఆకులను కత్తెర పురుగు నుంచి కాపాడగలుగుతాయి.
కండెలను మొక్కజొన్న మొలిచిన తర్వాత 7వ వారంలో మొక్క సుడుల్లో పొడి మట్టి లేదా ఇసుక లేదా వరి ఊకను మరోసారి పోయాలి. ఆ తర్వాత సుంకు (మగ పూత) బయటకు వస్తుంది. కత్తెర పురుగు సుంకును ఆశించినప్పటికీ పంటకు పెద్దగా నష్టం జరగదు. పైన సూచించిన విధంగా 7వ వారంలోగానే 90% పైగా కత్తెర పురుగులను నాశనం చేయగలగాలి. ఈ దశలో అదుపు చెయ్యలేకపోతే.. ఆ తర్వాత దశలో ఎదుగుతున్న లేత కండెలను ఆశించి లేత గింజలను, కండె భాగాలను పురుగులు తినేసి నష్టం కలిగిస్తాయి. ఈ వయసుకు మొక్కలు మనిషి ఎత్తున పొలంలో వత్తుగా ఉంటాయి. కాబట్టి కండెలపై కషాయాన్ని లేదా ద్రావణాన్ని పిచికారీ చేయడం కష్టమే.
జీవ నియంత్రణ ద్రావణాలతో మేలు
సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే రైతుల పొలాల్లో మెండుగా వృద్ధి చెందే మిత్రపురుగులు మొక్కజొన్న కంకులకు రక్షణగా నిలుస్తాయి. జీవ నియంత్రణ సూక్ష్మజీవులతో కూడిన ద్రావణాలను పిచికారీ చేయడం వల్ల కత్తెరు పురుగు లార్వాలు రోగాల బారిన పడి నశిస్తాయి. బవేరియా, నొమేరియా శిలీంధ్రాలు.. బీటీ బాక్టీరియా.. కీటక నాశక నులిపురుగులు(ఈ.పి.ఎన్.).. ఎన్‌పీ వైరస్ ద్రావణాలను పిచికారీ చేశారు. వీటిలో అందుబాటులో ఉన్న ఏరెండిటినైనా మొక్కజొన్న మొలకెత్తిన 5 నుంచి 8 వారాల మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయడం వల్ల కత్తెర పురుగులు జబ్బుల పాలై చనిపోయాయని సస్యరక్షణ శాస్త్రవేత్త రవి పాల్థియ తెలిపారు. తడి వాతావరణంలో ఇ.పి.ఎన్. అత్యంత ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు.
కత్తెర పురుగును అరికట్టడానికి రసాయనిక పురుగుమందులను సకాలంలో వాడిన రైతులు తొలి దశల్లో కత్తెర పురుగును అదుపు చేయగలుగుతున్నారు. అయితే, సమయం మీరినప్పుడు పంటకు నష్టం జరుగుతోంది. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల రైతుకు అదనపు ఖర్చు కావడంతోపాటు మిత్ర పురుగులు కూడా నశిస్తాయి. కండె దశలో పంటకు ప్రకృతిసిద్ధంగా మిత్రపురుగుల ద్వారా రక్షణ దొరక్క దిగుబడి నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో జరుగుతున్నది ఇదే.
పైన సూచించిన విధంగా సస్యరక్షణకు సేంద్రియ పద్ధతులను సకాలంలో పాటించి మంచి దిగుబడులు తీయవచ్చని డా. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. ప్రతి రైతూ కత్తెర పురుగును సమర్థవంతంగా కట్టడి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా పండించిన రసాయనిక అవశేషాల్లేని మొక్కజొన్నలు మనుషులకు, పశువులు, కోళ్లకు కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాయన్నారు.
(డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి– 99082 24649)
అగ్ని అస్త్రం ధాటికి బుగ్గి అయిన కత్తెర పురుగు
బీటీ బాక్టీరియా పిచికారీతో మాడిపోయిన కత్తెర పురుగు
ఈపీ నులిపురుగుల ధాటికి చనిపోయిన కత్తెర పురుగు
బవేరియా శిలీంద్రం పిచికారీతో...
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment