Sorghum crops
-
ప్రతికూలతలను తట్టుకునే ‘కుద్రత్–3’
ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రకాశ్ సింగ్ రఘువంశీ రూపుకల్పన చేసిన కుద్రత్–3 రకం కంది ప్రతికూల వాతవరణ పరిస్థితులను ధీటుగా తట్టుకొని అధిక దిగుబడులనిస్తూ అనేక రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తోందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పప్పుధాన్యాల విభాగం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డా. యు.పి. సింగ్ తెలిపారు. హెక్టారుకు 36 క్వింటాళ్ల కందుల దిగుబడినిచ్చే ఈ రకం యూపీతోపాటు బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందిందన్నారు. భూతాపం వల్ల మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈ రకం రైతులకు స్థిరమైన భరోసానిస్తుందని కుద్రత్–3 ఆవిష్కర్త రఘువంశీ అంటున్నారు. దీని పంటకాలం 235 రోజులు. వంద గింజల బరువు 17.57 గ్రాముల బరువు తూగుతాయి. వివరాలకు.. ప్రకాశ్ సింగ్ రఘువంశీ – 98392 53974, 70203 07801. -
జొన్న విత్తు.. రికార్డు సొత్తు
సాక్షి, హైదరాబాద్: ఇక్రిశాట్ సహకారంతో అభివృద్ధి చేసిన జొన్నపంట దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. పాడి రైతులకు చౌకగా పశుగ్రాసం అందించేందుకు నమూనా వంగడంగా జాతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం దీన్ని గుర్తించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్), ఉత్తరాఖండ్‌లోని జీబీ పంత్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ కొత్తరకం జన్యు వంగడాన్ని అభివృద్ధి చేశారు. ఇక్రిశాట్ వంగడం ఐసీఎస్ఏ 467, పంత్ చారి–6 రకాల వంగడాలు రెండింటినీ కలిపి సీఎస్హెచ్ 24 ఎంఎఫ్ పేరుతో దీన్ని అభివృద్ధి చేశారు. జొన్న చొప్పను పలుమార్లు కత్తిరించి వాడుకునే అవకాశముండటం దీని ప్రత్యేకత. అతితక్కువ నీటితోనే ఎక్కువ గ్రాసాన్ని ఇవ్వగలదు. వేసవిలో నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా పశువులకు తగినంత పచ్చి ఆహారాన్ని అందించవచ్చని దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే దీనిని దేశవ్యాప్తంగా పలువురు రైతులు విజయవంతంగా వాడుతున్నారని చెప్పారు. ఈ పంట కేవలం పశుగ్రాసం కోసం మాత్రమే వాడతారని, జొన్న గింజలు రాకమునుపే కత్తిరించేస్తారని ఆయన స్పష్టం చేశారు. జొన్న పంటపై చేపట్టిన జాతీయ కార్యక్రమంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కూడా లభించింది. కొత్త హైబ్రిడ్ జొన్న వంగడాలు తయారు చేయాలంటే.. సీఎస్హెచ్–24ఎంఎఫ్‌ను నమూనాగా ఎంచుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్దేశించారు. దీనికి ఉన్న డిమాండ్ ఎంత అంటే.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఏటా 10 నుంచి 12 కొత్త కంపెనీలకు గ్రాసం విత్తనాల సాగుకు లైసెన్స్ ఇచ్చేంత! పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారత్‌ను పశుగ్రాసం కొరత చాలా తీవ్రంగా వేధిస్తోంది. ఓ అంచనా ప్రకారం దేశంలో ఏటా దాదాపు 132.57 కోట్ల టన్నుల పశుగ్రాసం (పచ్చి, ఎండు) అవసరముండగా.. 35 శాతం తక్కువగా కేవలం 97.87 కోట్ల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. తాజా వంగడంతో పశుగ్రాసం కొరత తీరనుంది. -
కత్తెరపై సేంద్రియ విజయం!
మన దేశంలో గత సంవత్సర కాలంగా మొక్కజొన్న రైతులను కత్తెర పురుగు అతలాకుతలం చేస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి మన శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎన్నో రకాల పురుగులను చూశాం కానీ, ఇటువంటి వేగం, ఉధృతితో పంటకు నష్టం చేయగల కీటకాన్ని చూడటం ఇదే తొలిసారి అని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. మార్కెట్లో దొరుకుతున్న పురుగుమందులన్నీ తెచ్చి పిచికారీ చేస్తున్నా వారం తిరగక ముందే పురుగు యథాస్థితికి వచ్చేస్తోంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో కత్తెర పురుగు నివారణ ఖర్చు మెండై కూర్చుంది. కేవలం రసాయనిక పురుగు మందులకే ఎకరానికి రూ. 2,500 – 4,000 వరకు రైతులు ఖర్చు పెడుతున్నారు. మొత్తానికి మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఒక మహమ్మారిలా దాపురించింది. తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో రబీ మొక్కజొన్న కూడా దెబ్బతిన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మెదక్ జిల్లా తునికిలోని రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రంలో కత్తెర పురుగుపై జరిగిన పరిశోధనలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. దీనికి సారథ్యం వహిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గత 8 నెలల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో జరిగిన విస్తృతమైన ప్రయోగాలు మంచి ఫలితాలనిచ్చాయి. రబీలో ఎకరానికి 35 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధించగలమని డా. శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’ కి తెలిపారు. మొక్కజొన్న రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్న ఆ ప్రయోగ వివరాలు.. కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీ వార్మ్) మొక్కజొన్న రైతులను వణికిస్తోంది. అయితే, పూర్తి సేంద్రియ పద్ధతుల్లో కొన్ని ప్రత్యేక మెలకువలు పాటిస్తూ సాగు చేస్తే ఈ పురుగు అంత భయంకరమైనదేమీ కాదని డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతులను పాటించి గడచిన ఖరీఫ్, రబీ కాలాల్లో మొక్కజొన్నను పండించి కత్తెర పురుగును జయించే పద్ధతులపై నిర్థారణకు వచ్చారు. ఏయే దశల్లో ఏయే చర్యలు తీసుకున్నదీ, వాటి ఫలితాలు ఎలా వచ్చినదీ నమోదు చేశారు. భూసారం పెరిగితే కత్తెరకు తెర! మొక్కజొన్న సేంద్రియ సాగులో మంచి దిగుబడులు సాధించాలంటే తొలుత భూ సారం పెంపుదలపై దృష్టి పెట్టాలి. అంతకుముందు పంట పూర్తయిన తర్వాత 3 నెలలు భూమికి విరామం ఇచ్చిన తర్వాత మొక్కజొన్న సాగు చేశారు. గుంటకు 100 కిలోల చొప్పున.. ఎకరానికి 4 టన్నుల (2 ట్రాక్టర్ ట్రక్కుల) గొర్రెల ఎరువు వెదజల్లి దున్ని విత్తనం వేశారు. విత్తనం మొలకెత్తిన తర్వాత 2వ వారంలో.. గుంటకు 10 కిలోలు.. ఎకరానికి 400 కిలోల చొప్పున ఘన జీవామృతం చల్లారు. వర్షం వచ్చినప్పుడో లేక నీటి తడి పెట్టినప్పుడో.. పది రోజులకోసారి.. వేస్ట్ డీ కంపోజర్ లేదా జీవామృతాను.. అదొకసారి, ఇదొకసారి ఎకరానికి వెయ్యి లీటర్ల చొప్పున ఇస్తూ వచ్చారు. భూసారం పెంపుదలకు ఈ రెంటినీ కలిపి మొత్తం 6 సార్లు నేలకు నీటితోపాటు పారగట్టినట్లు శాస్త్రవేత్త డి.నరేశ్ తెలిపారు. కత్తెర పురుగు బెడద 5–10 వారాలు కత్తెర పురుగు జీవిత చక్రం వర్షాకాలంలో 5 వారాలు, (ఖరీఫ్) శీతాకాలం (రబీ)లో 10 వారాలు ఉంటుందని, ఈ రెండు కాలాల్లోనూ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లోనే సమర్థవంతంగా అరికట్టామని డా. శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. రబీ పంట కోతకు సిద్ధమవుతోంది. ఎకరానికి 35 క్వింటాళ్ల దిగుబడి సాధించగలిగే పరిస్థితి ఉందని ఆయన ధీమాగా చెబుతున్నారు. రైతుకు అందుబాటులో ఉండే పదార్థాలతోనే తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం చేయవచ్చని.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులెవరైనా ఈ పద్ధతులను అనుసరించి కత్తెర పురుగు దాడి నుంచి మొక్కజొన్న పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చనడంలో సందేహం లేదన్నారు. మొదటి 2–3 వారాలు కత్తెర బెడద ఎక్కువ మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత తొలి 2–3 వారాలు అతి సున్నితమైన రోజులు. మొలకెత్తిన రెండో వారానికి పంట 3 ఆకుల దశలో ఉంటుంది. 3వ వారం తర్వాత సుడి ఏర్పడుతుంది. 6 ఆకుల దశ వరకు.. అంటే విత్తిన తర్వాత 35 రోజుల వరకు.. కత్తెర పురుగు బెడద నుంచి పంటను రక్షించుకోగలిగితే చాలా వరకు గట్టెక్కినట్టే. ఆ తర్వాత దశలో కత్తెర పురుగు ఆశించినా పంట ఎదుగుదల వేగాన్ని పుంజుకుంటుంది కాబట్టి నష్టాన్ని పూడ్చుకోగలుగుతుంది. మామూలు మాటల్లో చెప్పాలంటే.. పంట మోకాలెత్తుకు ఎదిగే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. నడుము ఎత్తుకు పెరిగిందంటే చాలు.. ఒక వైపు కత్తెర పురుగు తింటున్నా మొక్క లెక్క చేయదు. ఎదుగుదల ఆగదు. వేపనూనె, అగ్ని అస్త్రం, లొట్టపీచు కషాయం.. పంట తొలి 2–3 వారాల్లోనే తల్లి పురుగు గుడ్లు విపరీతంగా పెడుతుంది. వర్షాకాలం, శీతాకాలాల్లో వర్షం లేదా మంచు నీటి చుక్కలతో సుడి నిండి ఉండటంతో పురుగు సుడిలోకి వెళ్లలేదు. ఆ మేరకు సుడికి ప్రకృతి సిద్ధంగానే రక్షణ లభిస్తుంది. ఎండాకాలం పంటకు ఈ రక్షణ తక్కువ. తల్లి పురుగు లేత ఆకులపై, మొదళ్ల దగ్గర కుప్పలు కుప్పలుగా గుడ్లు పెడుతుంది. గుడ్డు నుంచి బయటకు వచ్చిన లేత లార్వాలు(పురుగులు) ఆకులను తినేస్తుంటాయి. ఈ దశలో వేపనూనె (లీ. నీటికి 1500 పీపీఎం వేపనూనె 5 ఎం.ఎల్.) లేదా అగ్ని అస్త్రం (10%. 10 లీ. నీటికి 1 లీ. అగ్ని అస్త్రం) లేదా లొట్ట పీచు కషాయం (10%. వంద లీ. నీటిలో 10 కిలోల లొట్టపీచు ఆకులు 3,4 పొంగులు పొంగించి, చల్లార్చి వాడాలి) పిచికారీ చేయాలి. 5 రోజుల వ్యవధిలో వీటిల్లో ఏదో ఒక దాన్ని 3 లేదా 4 సార్లు పిచికారీ చేయాలి. కత్తెర పురుగు గుడ్లు నశిస్తాయి. లేత లార్వాలు మాడిపోయి చనిపోతాయి. మట్టి, ఇసుక, ఊకతో సుడికి రక్షణ మొక్కజొన్న మొలిచిన 4వ వారం, ఆ తదనంతర దశలో సుడి లోపలికి చేరే కత్తెర పురుగు తీవ్రనష్టం కలిగిస్తుంది. అయితే, పొడి మట్టిని లేదా ఇసుకను లేదా వరి ఊక వంటి పదార్థాలను మొక్కజొన్న మొక్క సుడిలో పోయాలి. అప్పటికే సుడిలో ఉండే పురుగు చనిపోతుంది. బయటి నుంచి పురుగులు లోపలికి వెళ్లలేవు. పంట మొలిచిన తర్వాత 4వ వారంలో సుడిలో వేసిన పదార్థం వల్ల.. సుడి నుంచి ఆ తర్వాత వెలువడే 3 నుంచి 5 ఆకులను కత్తెర పురుగు నుంచి కాపాడగలుగుతాయి. కండెలను మొక్కజొన్న మొలిచిన తర్వాత 7వ వారంలో మొక్క సుడుల్లో పొడి మట్టి లేదా ఇసుక లేదా వరి ఊకను మరోసారి పోయాలి. ఆ తర్వాత సుంకు (మగ పూత) బయటకు వస్తుంది. కత్తెర పురుగు సుంకును ఆశించినప్పటికీ పంటకు పెద్దగా నష్టం జరగదు. పైన సూచించిన విధంగా 7వ వారంలోగానే 90% పైగా కత్తెర పురుగులను నాశనం చేయగలగాలి. ఈ దశలో అదుపు చెయ్యలేకపోతే.. ఆ తర్వాత దశలో ఎదుగుతున్న లేత కండెలను ఆశించి లేత గింజలను, కండె భాగాలను పురుగులు తినేసి నష్టం కలిగిస్తాయి. ఈ వయసుకు మొక్కలు మనిషి ఎత్తున పొలంలో వత్తుగా ఉంటాయి. కాబట్టి కండెలపై కషాయాన్ని లేదా ద్రావణాన్ని పిచికారీ చేయడం కష్టమే. జీవ నియంత్రణ ద్రావణాలతో మేలు సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే రైతుల పొలాల్లో మెండుగా వృద్ధి చెందే మిత్రపురుగులు మొక్కజొన్న కంకులకు రక్షణగా నిలుస్తాయి. జీవ నియంత్రణ సూక్ష్మజీవులతో కూడిన ద్రావణాలను పిచికారీ చేయడం వల్ల కత్తెరు పురుగు లార్వాలు రోగాల బారిన పడి నశిస్తాయి. బవేరియా, నొమేరియా శిలీంధ్రాలు.. బీటీ బాక్టీరియా.. కీటక నాశక నులిపురుగులు(ఈ.పి.ఎన్.).. ఎన్పీ వైరస్ ద్రావణాలను పిచికారీ చేశారు. వీటిలో అందుబాటులో ఉన్న ఏరెండిటినైనా మొక్కజొన్న మొలకెత్తిన 5 నుంచి 8 వారాల మధ్యలో రెండు సార్లు పిచికారీ చేయడం వల్ల కత్తెర పురుగులు జబ్బుల పాలై చనిపోయాయని సస్యరక్షణ శాస్త్రవేత్త రవి పాల్థియ తెలిపారు. తడి వాతావరణంలో ఇ.పి.ఎన్. అత్యంత ప్రభావవంతంగా పనిచేసినట్లు గుర్తించారు. కత్తెర పురుగును అరికట్టడానికి రసాయనిక పురుగుమందులను సకాలంలో వాడిన రైతులు తొలి దశల్లో కత్తెర పురుగును అదుపు చేయగలుగుతున్నారు. అయితే, సమయం మీరినప్పుడు పంటకు నష్టం జరుగుతోంది. రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల రైతుకు అదనపు ఖర్చు కావడంతోపాటు మిత్ర పురుగులు కూడా నశిస్తాయి. కండె దశలో పంటకు ప్రకృతిసిద్ధంగా మిత్రపురుగుల ద్వారా రక్షణ దొరక్క దిగుబడి నష్టపోతున్నారు. చాలా జిల్లాల్లో జరుగుతున్నది ఇదే. పైన సూచించిన విధంగా సస్యరక్షణకు సేంద్రియ పద్ధతులను సకాలంలో పాటించి మంచి దిగుబడులు తీయవచ్చని డా. శ్యాంసుందర్‌రెడ్డి అంటున్నారు. ప్రతి రైతూ కత్తెర పురుగును సమర్థవంతంగా కట్టడి చేయగల సామర్థ్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధంగా పండించిన రసాయనిక అవశేషాల్లేని మొక్కజొన్నలు మనుషులకు, పశువులు, కోళ్లకు కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాయన్నారు. (డా. జి. శ్యాంసుందర్‌రెడ్డి– 99082 24649) అగ్ని అస్త్రం ధాటికి బుగ్గి అయిన కత్తెర పురుగు బీటీ బాక్టీరియా పిచికారీతో మాడిపోయిన కత్తెర పురుగు ఈపీ నులిపురుగుల ధాటికి చనిపోయిన కత్తెర పురుగు బవేరియా శిలీంద్రం పిచికారీతో... – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
మిక్సీ.. సిరిధాన్యాల మిల్లు!
చిరు(సిరి)ధాన్యాల ఆహారం ఎంతో ఆరోగ్యదాయకమన్న స్పృహ ఇప్పుడిప్పుడే తిరిగి మేలుకొంటున్న తరుణంలో చిరుధాన్యాలను పప్పుధాన్యాలతో కలిపి మిశ్రమ సాగు చేసే రైతుల సంఖ్య తెలుగునాట అంతకంతకూ పెరుగుతోంది. అయితే, శుద్ధి యంత్రాల ధరలు అందుబాటులో లేక చాలా మంది రైతులు సిరిధాన్యాలను పండించడం లేదు. పండించిన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే, కేవలం మిక్సీతోనే ఇంటిపట్టున మహిళలు శుద్ధి చేసుకోగలిగిన సులువైన పద్ధతి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిపై సాగుబడి ప్రత్యేక కథనం.. జొన్నలు (Sorghum), రాగులు (Finger Millet), సజ్జలు (Pearl Millet).. ఈ మూడు రకాల చిరుధాన్యాలను కంకుల నుంచి రాలగొట్టి నూర్చుకుంటే చాలు.. వాడకానికి సిద్ధమవుతాయి. గింజలపైన పొట్టు ఉండదు. కాబట్టి వీటికి ప్రాసెసింగ్ సమస్య లేదు. అయితే, కొర్రలు (fox tail millet), అండుకొర్రలు (brown top milletట), సామలు (little millet), ఊదలు (Barnyard Millet), అరికలు (Kodo Millet) వంటి చిరుధాన్యాల (సిరిధాన్యాలు) సంగతి కొంచెం భిన్నంగా ఉంటుంది. వీటి ధాన్యం నూర్పిడి చేసిన అనంతరం బియ్యం పొందాలంటే ప్రాసెసింగ్ చేయాల్సి ఉంటుంది. ధాన్యం పైన పొట్టును తొలగిస్తే.. తినడానికి వీలయ్యే చిరుధాన్యాల బియ్యం సిద్ధమవుతాయి. సాంప్రదాయకంగా ఈ ధాన్యాన్ని తిరగలి (ఇసుర్రాయి)లో ఇసిరి, తర్వాత రోట్లో దంచుకొని, చెరిగి బియ్యాన్ని సిద్ధం చేసుకోవటం ఆనవాయితీ. అయితే, ఇది అధిక శ్రమ, సమయంతో కూడిన పని. కాబట్టే, ఈ మైక్రో మిల్లెట్స్ ఎంత ఆరోగ్యదాయకమైనవైనప్పటికీ కాలక్రమంలో కనుమరుగయ్యాయి. తిరగలి, రోలు అవసరం లేకుండా.. ఖరీదైన యంత్రాలతో పని లేకుండా.. మరుగున పడిపోయిన ఈ 5 రకాల (కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు) మైక్రో మిల్లెట్సే మానవాళిని ప్రాణాంతక జబ్బుల నుంచి రక్షించే నిజమైన ‘సిరిధాన్యాల’ంటూ కర్ణాటకలోని మైసూరు కేంద్రంగా స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ చిరకాలంగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సిరిధాన్యాలను పాత పద్ధతిలోనే ఇసుర్రాయిలో ఇసిరి, రోట్లో దంచి శుభ్రం చేసుకోవటం తప్ప మరో మార్గం లేదా? యంత్రాలు అవసరం లేకుండా బియ్యం మార్చుకోగలిగే మార్గం ఇక లేదా? సిరిధాన్యాలను సాగు చేసే చిన్న, సన్నకారు రైతు కుటుంబాలు ఇల్లు దాటి వెళ్లకుండా ఈ ధాన్యాలను బియ్యంగా మార్చుకోగలిగే పద్ధతిని రూపొందించలేమా? అని డా. ఖాదర్ మదనపడేవారు. తన సోదరీమణులు మహబున్నీ, కాశింబిలతో కలిసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మహబున్నీ కొత్త ఆలోచనతో తిరగలి, రోలు అవసరం లేకుండా.. ఖరీదైన యంత్రాలతో పని లేకుండానే.. ప్రతి ఇంట్లో ఉండే మిక్సీ ద్వారానే చిరు ధాన్యాలపై పొట్టును సులభంగా తీసివేసి బియ్యంగా మార్చుకునే పద్ధతిని అన్వేషించటంలో మహబున్నీ కొద్ది నెలల క్రితం సఫలీకృతులయ్యారు. వృత్తి రీత్యా నర్సు అయిన ఆమె స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నారు. తన సోదరిని ‘బుచ్చి’ అని పిలుచుకునే డా. ఖాదర్ ఆమె కనిపెట్టిన ఈ పద్ధతికి ‘సిరిధాన్యాలను శుద్ధి చేసే బుచ్చి పద్ధతి’ అని పేరు పెట్టారు. రైతుకు ఏడాది పొడవునా ఆదాయం సిరిధాన్యాలను సాగు చేసే చిన్న, సన్నకారు రైతులు రూ. లక్షలు వెచ్చించి యంత్రాలను ఏర్పాటు చేసుకొని ముడి సిరిధాన్యాలను శుద్ధి చేసుకోలేరు. గంపగుత్తగా వ్యాపారులకు తక్కువ ధరకే అమ్మేసుకుంటారు. అయితే, మిక్సీతోనే ఇంటిపట్టున అవసరం మేరకు రోజుకు 20 కిలోల చొప్పున సిరిధాన్యాల బియ్యం తయీరు చేసుకోగలిగే ఈ సదుపాయం వల్ల.. వారు అవసరమైనప్పుడు, ఇతర వ్యవసాయ పనులు లేనప్పుడు ఈ పని చేసుకుంటారు. సిద్ధమైన బియ్యాన్ని తాము తినటంతోపాటు గ్రామస్తులకు, స్థానిక మార్కెట్లలోనూ ఏడాది పొడవునా అమ్ముకొని మంచి నికరాదాయం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కువ ఎకరాల్లో పండించే రైతులైనా బుచ్చి పద్ధతిలో చిరుధాన్యాలను శుద్ధి చేయడటం ద్వారా.. తన గ్రామంలోనే మహిళలకు నీడపట్టున పని కల్పించడానికి కూడా ఇది నిస్సందేహంగా ఉపకరిస్తుంది. నిబద్ధతతో సృజనాత్మకంగా.. వికేంద్రీకరణ, గ్రామస్వరాజ్యం దిశగా ముందడుగు వేస్తున్న డా. ఖాదర్, ఆయన కుటుంబ సభ్యులు, సహచర బృందానికి జేజేలు! రైతుల చేతుల్లోనే సిరిధాన్యాలు! డాక్టర్ ఖాదర్ తన సోదరి మహబున్నితో కలిసి వినూత్నమైన మిక్సీ పద్ధతిని కనుగొన్నారు. ముడి సిరిధాన్యాలకు పైన ఉండే పొట్టు తీసి బియ్యంగా తయారు చేసే ప్రక్రియ కంపెనీల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ‘బుచ్చి పద్ధతి’ ఉపయోగపడుతుంది. యంత్రాల అవసరం లేకుండా కేవలం మిక్సీతోనే రైతులు, మహిళలు కుటీర పరిశ్రమగా సిరిధాన్యాల బియ్యం తయారీని చేపట్టవచ్చు. ముడి సిరిధాన్యాల పైపొట్టు తీయడంలో ఇబ్బందుల వల్లనే సిరిధాన్యాల సాగు, వాడకం మరుగునపడిపోయింది. డా. ఖాదర్ కృషి వల్ల సిరిధాన్యాల సాగు గత రెండేళ్లలోనే రెట్టింపైంది. మిక్సీ పద్ధతితో పొట్టు తీయడం కూడా సులభమైంది. మిక్సీలతో ఇంటి స్థాయిలోనే కాకుండా, వాణిజ్య స్థాయిలో కూడా సిరిధాన్యాల బియ్యం తయారీని చేపట్టవచ్చు. ఇప్పటికే మైసూరులో, తమిళనాడులో ఇటువంటి యూనిట్లను ఏర్పాటు చేయించాము. మిక్సీ సాధారణ వేగాన్ని 2,800 ఆర్.పి.ఎం. నుంచి 1,500 ఆర్.పి.ఎం.కు తగ్గించుకోవాలి (మిక్సీలోని కాయిల్‌ను మార్చడం ద్వారా వేగాన్ని తగ్గించవచ్చు). కొంచెం వంచిన సింగిల్ బ్లేడును(పదును లేకుండా సానరాయితో మొండి చేసి) వాడితే నూక శాతం బాగా తగ్గినట్లు గుర్తించాం. అటవీ వ్యవసాయ(కాడు కృషి) పద్ధతిలో రసాయనాల్లేకుండా సిరిధాన్యాల సాగుపై రైతు శిక్షణా శిబిరాల్లోనే మిక్సీతో బియ్యం తయారీ పద్ధతిపైన కూడా శిక్షణ ఇస్తున్నాం. ఇటీవల రాయచూర్‌లో శిక్షణ ఇచ్చాం. తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగులోనే రైతులకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. – బాలన్ కృష్ణ (097405 31358), అటవీ వ్యవసాయ నిపుణుడు, మైసూరు, కర్ణాటక balan71@gmail.com మిక్సీ బర్నర్‌ను వెనక్కి తిప్పినట్టే తిప్పి వదలాలి..! కొర్రలు తదితర సిరిధాన్యాలకు పైన ఉండే పొట్టును తీయడానికి మామూలుగా ఇసుర్రాయితో ఇసిరి, తర్వాత రోట్లో దంచి చెరిగే వాళ్లం. మిక్సీతోనే పొట్టు తీసే పద్ధతిని కొన్ని నెలలుగా వాడుతున్నాం. ఇది చాలా సులువు. పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో ఉంటున్న వాళ్లు కూడా సిరిధాన్య బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. ముడి సిరిధాన్యాలను చెరిగి మట్టిపెళ్లలు, పుల్లలు, ఇసుక లేకుండా సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జారులో సగానికి పైగా నింపుతాను. తర్వాత బర్నర్‌ను (ముందుకు.. అంటే 1 వైపు తిప్పకూడదు) కొంచె వెనక్కి(‘పల్స్’వైపు) తిప్పినట్టే తిప్పి వదిలేస్తాను. ఇలా 50 సార్లు చేసిన తర్వాత చేటతో చెరుగుతాను. మళ్లీ మిక్సీలో పోసి 30 సార్లు మళ్లీ వెనక్కి తిప్పి వదిలేసి, మరోసారి చెరుగుతాను. పొట్టు చాలా వరకు పోతుంది. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే మళ్లీ జారులో పోసి ఐదారు సార్లు పల్స్ వైపు తిప్పి వదిలేసి.. చెరిగితే సరిపోతుంది. ఇంట్లో మిక్సీ ఉన్న ఎవరైనా సిరిధాన్యాల బియ్యాన్ని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సులువుగా తయారు చేసుకోవచ్చు. – మహెబున్నీ (70930 11240), ప్రొద్దుటూరు, డా.వైఎస్సార్ కడప జిల్లా సిరిధాన్యాలను రైతులే నగరాలకు సరఫరా చేయొచ్చు! సిరిధాన్యాలను పండించే రైతులు తమ గ్రామాల్లోనే తక్కువ ఖర్చుతో బియ్యం తయారు చేసుకొని, స్థానిక మహిళలకు పని కల్పిస్తూ, మంచి నికరాదాయం పొందవచ్చు. యంత్రాల అవసరం లేకుండా మిక్సీలతోనే సిరిధాన్యాల బియ్యం తయారీని రైతులు తాము తినడం కోసం మాత్రమే కాదు పట్టణాలు, నగరాల్లో నివాసం ఉండే వారి కోసం కూడా పెద్ద ఎత్తున చేపట్టవచ్చు. రెండు సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకొని 20 మిక్సీలను సమకూర్చుకుంటే విద్యుత్తు సదుపాయం కూడా అవసరం లేదు. 20 మంది మహిళలతో రోజుకు 400 కిలోల వరకు సిరిధాన్యాల బియ్యాన్ని తయారు చేసుకుంటూ.. వినియోగదారులకు నేరుగా సరఫరా చేయవచ్చు. అనేక చోట్ల ఇప్పటికే ఇలాంటి యూనిట్లు ఏర్పాటయ్యాయి. – డాక్టర్ ఖాదర్‌వలి (94485 61472), స్వతంత్ర అటవీ వ్యవసాయ, ఆహార శాస్త్రవేత్త, మైసూరు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పశుగ్రాసానికీ కరువు!
ఎక్కడికక్కడ ఎండిపోయిన పంటలు ♦ చుక్కనీరు దొరకని పరిస్థితి ♦ మేత దొరకక పశువులను అమ్ముకుంటున్న రైతులు ♦ తక్కువ ధరకు కొని కబేళాలకు తరలిస్తున్న వ్యాపారులు ♦ ఏటేటా తగ్గిపోతున్న పశు సంపద వానల్లేక వరి పంట ఎండిపోయింది ఉన్న ఓ బర్రె, ఆవుకు మేత కరువైంది. పది కుంటల గడ్డి అలుకుతే నీళ్లు లేక ఎండిపోయింది. మనకే నీళ్లు లేవు పశువులకు ఎక్కడి నుంచి దొరుకుతయి. ఏం చెయ్యాలె 10వేలు పెట్టి ట్రాక్టర్ గడ్డి కొనుక్కున్నాను.. బర్రెపాలతో అంతో ఇంతో వస్తుంటే రోజులు గడుస్తున్నాయి. - కరీంనగర్ జిల్లా మహ్మదాపూర్ రైతు బుర్ర రాజయ్య ఆవేదన ఇది పశువులకు మేత దొరుకుత లేదు. పాలిచ్చే పశువులను కూడా తెగనమ్ముకోవాల్సి వస్తోంది. గతేడాది ఒక గేదెను 28 వేలు పెట్టి కొన్న. ఇప్పుడా గేదెను అమ్ముకుందామంటే 13 వేలే ఇస్తామంటున్నరు.. - నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెం రైతు లింగస్వామి బాధ ఇది. సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో కరువు ఏ స్థాయిలో ఉందో ఈ మాటలను బట్టి అవగతమవుతోంది. ఈ కరువు తీవ్రతకు సాగు, తాగునీటికే కాదు.. పశువుల మేతకు, వాటికి తాగడానికి నీళ్లు కూడా దొరకని దుస్థితి వచ్చింది. దీనితో ఉన్న పశువులను రైతులు అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం సరఫరాపై దృష్టిపెట్టకపోవడం, రైతులకు గడ్డి విత్తనాలు సరఫరా చేస్తామని ప్రకటించినా.. ఆశించిన మేరకు ముందుకు సాగకపోవడం పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చుతోంది. పశుగ్రాసం కొరత కారణంగా గడ్డి ధర బాగా పెరిగిపోయింది. వర్షాల్లేక వరి, జొన్న పంటలు తగ్గిపోవడం, వాణిజ్య పంటల సాగు పెరగడం కూడా పశుగ్రాసం కొరతకు కారణమని చెబుతున్నారు. ముందు ముందు మరింత దారుణం వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోవడంతో పశుగ్రాసం కొరత అధికమైనట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ట్రాక్టర్ ఎండు గడ్డి ధర రూ. పదివేల వరకు పలుకుతోంది. 50 కిలోల దాణాను రూ. 600 నుంచి రూ. 800 వరకు విక్రయిస్తున్నారు. అసలే పంటలు నష్టపోయి అప్పుల్లో ఉన్న రైతులు... చూస్తూ చూస్తూ పశువులను చంపుకోవడం కంటే అమ్ముకోవడమే మంచిదని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లి పశుగ్రాసం కొనుగోలు చేసుకువస్తున్నారు. పాడి పశువులకు మేత తగ్గడంతో పాల ఉత్పత్తి తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పశుగ్రాసం విత్తనాల పంపిణీపై ప్రభుత్వం సరిగా ప్రచారం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పశుగ్రాస బ్యాంకులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేవు. అన్ని జిల్లాల్లో ఇదే దుస్థితి.. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 62 వేల హెక్టార్లలో వరిసాగు కాగా.. 32 వేల హెక్టార్లలో పూర్తిగా ఎండిపోయింది. మిగతా చోట్ల 30 శాతం కూడా దిగుబడి రాలేదు. చివరికి పశుగ్రాసానికీ తీవ్ర కొరత వచ్చింది. రబీలో వరిసాగే మొదలు కాలేదు. రోజుకు జిల్లాలో ఐదు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తయ్యేవి, ఇప్పుడు 3.46 లక్షల లీటర్లకు తగ్గిపోయింది. కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో గ్రాసం లేక పశువులను అమ్మేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాకు ప్రాణాధారమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటడడంతో... ఇక్కడి పరిస్థితి దారుణంగా మారింది. మేత దొరకక పశువులను తెగనమ్ముకుంటున్నారు. వ్యాపారులు వాటిని తక్కువ ధరకు కొని కబేళాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ పశుగ్రాసం కొరత తీర్చేందుకు అధికారులు విత్తనాలు సరఫరా చేస్తున్నా... నీళ్లు లేక రైతులెవరూ విత్తనాలు తీసుకోవడం లేదు. ఇక్కడ పశువుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని అంచనా. వరంగల్ జిల్లాలో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. ఒక్కో గడ్డికి రూ. 200 వరకు పలుకుతుండడంతో.. అంతపెట్టి కొనలేక, పశువులను మేపలేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. రాయపర్తి మండలం సన్నూరుకు చెందిన వెంకన్న రెండు ఎడ్లను రూ. 55 వేలకు అమ్మేశాడు. ఖమ్మంలోనూ పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ట్రాక్టర్ వరిగడ్డిని రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక వేసవి వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలకు అరిగోస.. ఇక వలసల జిల్లా మహబూబ్‌నగర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే పనులు దొరకక ఇతర రాష్ట్రాలు, నగరాలకు వలసలు వెళ్లే పరిస్థితి. ఉన్న కొందరూ కరువు కారణంగా పశువులను అమ్మేసుకుని వెళుతున్నారు. జిల్లాలో పూర్తిగా పంటలు ఎండిపోయాయి. తమకే తాగడానికి నీరు లేకపోతే పశువులకు ఎక్కడి నుంచి తెచ్చేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలో పశుగ్రాసం దొరకని పరిస్థితి ఏర్పడింది. పాడి ఆవులను సైతం రైతులు అమ్ముకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో సాగర్ కింద భూములకు కూడా నీరు ఇవ్వకపోవడంతో వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో పశుగ్రాసానికి కొరత వచ్చిపడింది. పాడి ఆవుల్ని అమ్ముకుంటున్న.. ‘‘రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసినం. రూ. 35 వేలు పెట్టుబడి పెట్టిన. 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడిలో సగం డబ్బులు కూడా రాలే. వర్షాలు లేక పంట దిగుబడులు తగ్గినయ్. రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. రెండు ఆవు (వాటికి రెండు దూడ)లు ఉన్నాయి. వాటికి గడ్డి లేదు. రూ. 650 పెట్టి దాణా కొంటే రెండు ఆవులకు 15 రోజులు వచ్చింది. మేత దొరకడం కష్టంగా ఉంది. అందుకే దూడలతో సహా ఆవులను అమ్మేందుకు తాండూరు ఎడ్లబజార్కు తీసుకువచ్చిన.’’ - పెద్దగొల్ల అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా మల్రెడ్డిపల్లి ఎద్దు మేతకూ పైసల్లేవు.. ‘‘మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. 100 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా 18 బస్తాలే వచ్చింది. ఒక బోరు వేసినా నీళ్లు పడలేదు. రూ. 60 వేలకుపైగా పెట్టుబడి పెట్టిన. అండ్ల సగం కూడా రాలేదు. ఎద్దుకు మేత లేదు. కొందామన్నా పైసల్లేవు. అందుకే ఎద్దును రూ. 22 వేలకు అమ్మకాని పెట్టిన..’’ - కాశిబుగ్గ ఎర్రన్న, రంగారెడ్డి జిల్లా లక్ష్మీనారాయణపూర్ గడ్డి సరిపోతలేదు ‘‘మూడు ఆవులు, ఒక గేదె ఉంది. డెయిరీకి పాలు పోస్తున్నా. పది గుంటల్లో పశుగ్రాసం సాగు చేసినప్పటికీ గడ్డి సరిపోతలేదు. అంతా డెయిరీలకు గడ్డిని సరఫరా చేస్తుండటంతో బయట గడ్డి దొరుకుతలేదు. రూ. 30 వేలు పెట్టి వరిగడ్డిని కొని నిల్వ చేసుకున్నాను.’’ - శివారెడ్డి, కరీంనగర్ జిల్లా