పశుగ్రాసానికీ కరువు! | Drought | Sakshi
Sakshi News home page

పశుగ్రాసానికీ కరువు!

Published Sat, Jan 2 2016 2:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

పశుగ్రాసానికీ కరువు! - Sakshi

పశుగ్రాసానికీ కరువు!

ఎక్కడికక్కడ ఎండిపోయిన పంటలు
♦ చుక్కనీరు దొరకని పరిస్థితి
♦ మేత దొరకక పశువులను అమ్ముకుంటున్న రైతులు
♦ తక్కువ ధరకు కొని కబేళాలకు తరలిస్తున్న వ్యాపారులు
♦ ఏటేటా తగ్గిపోతున్న పశు సంపద
 
 వానల్లేక వరి పంట ఎండిపోయింది
 ఉన్న ఓ బర్రె, ఆవుకు మేత కరువైంది. పది కుంటల గడ్డి అలుకుతే నీళ్లు లేక ఎండిపోయింది. మనకే నీళ్లు లేవు పశువులకు ఎక్కడి నుంచి దొరుకుతయి. ఏం చెయ్యాలె 10వేలు పెట్టి ట్రాక్టర్ గడ్డి కొనుక్కున్నాను.. బర్రెపాలతో అంతో ఇంతో వస్తుంటే రోజులు గడుస్తున్నాయి.
 - కరీంనగర్ జిల్లా మహ్మదాపూర్ రైతు బుర్ర రాజయ్య ఆవేదన ఇది
 
 పశువులకు మేత దొరుకుత లేదు. పాలిచ్చే పశువులను కూడా తెగనమ్ముకోవాల్సి వస్తోంది. గతేడాది ఒక గేదెను 28 వేలు పెట్టి కొన్న. ఇప్పుడా గేదెను అమ్ముకుందామంటే 13 వేలే ఇస్తామంటున్నరు..
 - నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెం రైతు లింగస్వామి బాధ ఇది.
 
 సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో కరువు ఏ స్థాయిలో ఉందో ఈ మాటలను బట్టి అవగతమవుతోంది. ఈ కరువు తీవ్రతకు సాగు, తాగునీటికే కాదు.. పశువుల మేతకు, వాటికి తాగడానికి నీళ్లు కూడా దొరకని దుస్థితి వచ్చింది. దీనితో ఉన్న పశువులను రైతులు అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వం పశుగ్రాసం సరఫరాపై దృష్టిపెట్టకపోవడం, రైతులకు గడ్డి విత్తనాలు సరఫరా చేస్తామని ప్రకటించినా.. ఆశించిన మేరకు ముందుకు సాగకపోవడం పరిస్థితిని మరింత దుర్భరంగా మార్చుతోంది. పశుగ్రాసం కొరత కారణంగా గడ్డి ధర బాగా పెరిగిపోయింది. వర్షాల్లేక వరి, జొన్న పంటలు తగ్గిపోవడం, వాణిజ్య పంటల సాగు పెరగడం కూడా పశుగ్రాసం కొరతకు కారణమని చెబుతున్నారు.

 ముందు ముందు మరింత దారుణం
 వేసవికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రానున్న రోజులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోవడంతో పశుగ్రాసం కొరత అధికమైనట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ట్రాక్టర్ ఎండు గడ్డి ధర రూ. పదివేల వరకు పలుకుతోంది. 50 కిలోల దాణాను రూ. 600 నుంచి రూ. 800 వరకు విక్రయిస్తున్నారు. అసలే పంటలు నష్టపోయి అప్పుల్లో ఉన్న రైతులు... చూస్తూ చూస్తూ పశువులను చంపుకోవడం కంటే అమ్ముకోవడమే మంచిదని భావిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా రైతులు పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లి పశుగ్రాసం కొనుగోలు చేసుకువస్తున్నారు. పాడి పశువులకు మేత తగ్గడంతో పాల ఉత్పత్తి తగ్గుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పశుగ్రాసం విత్తనాల పంపిణీపై ప్రభుత్వం సరిగా ప్రచారం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పశుగ్రాస బ్యాంకులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా ఎలాంటి చర్యలూ లేవు.

 అన్ని జిల్లాల్లో ఇదే దుస్థితి..
 నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 62 వేల హెక్టార్లలో వరిసాగు కాగా.. 32 వేల హెక్టార్లలో పూర్తిగా ఎండిపోయింది. మిగతా చోట్ల 30 శాతం కూడా దిగుబడి రాలేదు. చివరికి పశుగ్రాసానికీ తీవ్ర కొరత వచ్చింది. రబీలో వరిసాగే మొదలు కాలేదు. రోజుకు జిల్లాలో ఐదు లక్షల లీటర్ల పాలు ఉత్పత్తయ్యేవి, ఇప్పుడు 3.46 లక్షల లీటర్లకు తగ్గిపోయింది. కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో గ్రాసం లేక పశువులను అమ్మేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాకు ప్రాణాధారమైన ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిగా అడుగంటడడంతో... ఇక్కడి పరిస్థితి దారుణంగా మారింది. మేత దొరకక పశువులను తెగనమ్ముకుంటున్నారు.

వ్యాపారులు వాటిని తక్కువ ధరకు కొని కబేళాలకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ కరువు ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ పశుగ్రాసం కొరత తీర్చేందుకు అధికారులు విత్తనాలు సరఫరా చేస్తున్నా... నీళ్లు లేక రైతులెవరూ విత్తనాలు తీసుకోవడం లేదు. ఇక్కడ పశువుల సంఖ్య సగానికిపైగా తగ్గిపోయిందని అంచనా. వరంగల్ జిల్లాలో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. ఒక్కో గడ్డికి రూ. 200 వరకు పలుకుతుండడంతో.. అంతపెట్టి కొనలేక, పశువులను మేపలేక రైతులు పశువులను అమ్ముకుంటున్నారు. రాయపర్తి మండలం సన్నూరుకు చెందిన వెంకన్న రెండు ఎడ్లను రూ. 55 వేలకు అమ్మేశాడు. ఖమ్మంలోనూ పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంది. ట్రాక్టర్ వరిగడ్డిని రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక వేసవి వస్తే పరిస్థితి ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 రైతన్నలకు అరిగోస..
 ఇక వలసల జిల్లా మహబూబ్‌నగర్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అసలే పనులు దొరకక ఇతర రాష్ట్రాలు, నగరాలకు వలసలు వెళ్లే పరిస్థితి. ఉన్న కొందరూ కరువు కారణంగా పశువులను అమ్మేసుకుని వెళుతున్నారు. జిల్లాలో పూర్తిగా పంటలు ఎండిపోయాయి. తమకే తాగడానికి నీరు లేకపోతే పశువులకు ఎక్కడి నుంచి తెచ్చేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా తాండూరు ప్రాంతంలో పశుగ్రాసం దొరకని పరిస్థితి ఏర్పడింది. పాడి ఆవులను సైతం రైతులు అమ్ముకుంటున్నారు. నల్లగొండ జిల్లాలో సాగర్ కింద భూములకు కూడా నీరు ఇవ్వకపోవడంతో వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో పశుగ్రాసానికి కొరత వచ్చిపడింది.
 
 పాడి ఆవుల్ని అమ్ముకుంటున్న..
 ‘‘రెండు ఎకరాల్లో పత్తి సాగు చేసినం. రూ. 35 వేలు పెట్టుబడి పెట్టిన. 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పెట్టుబడిలో సగం డబ్బులు కూడా రాలే. వర్షాలు లేక పంట దిగుబడులు తగ్గినయ్. రెండు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. రెండు ఆవు (వాటికి రెండు దూడ)లు ఉన్నాయి. వాటికి గడ్డి లేదు. రూ. 650 పెట్టి దాణా కొంటే రెండు ఆవులకు 15 రోజులు వచ్చింది. మేత దొరకడం కష్టంగా ఉంది. అందుకే దూడలతో సహా ఆవులను అమ్మేందుకు తాండూరు ఎడ్లబజార్‌కు తీసుకువచ్చిన.’’
 - పెద్దగొల్ల అంజిలప్ప, రంగారెడ్డి జిల్లా మల్‌రెడ్డిపల్లి
 
 ఎద్దు మేతకూ పైసల్లేవు..
 ‘‘మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశా. 100 బస్తాల దిగుబడి రావాల్సి ఉండగా 18 బస్తాలే వచ్చింది. ఒక బోరు వేసినా నీళ్లు పడలేదు. రూ. 60 వేలకుపైగా పెట్టుబడి పెట్టిన. అండ్ల సగం కూడా రాలేదు. ఎద్దుకు మేత లేదు. కొందామన్నా పైసల్లేవు. అందుకే ఎద్దును రూ. 22 వేలకు అమ్మకాని పెట్టిన..’’
 - కాశిబుగ్గ ఎర్రన్న,  రంగారెడ్డి జిల్లా లక్ష్మీనారాయణపూర్
 
 గడ్డి సరిపోతలేదు
 ‘‘మూడు ఆవులు, ఒక గేదె ఉంది. డెయిరీకి పాలు పోస్తున్నా. పది గుంటల్లో పశుగ్రాసం సాగు చేసినప్పటికీ గడ్డి సరిపోతలేదు. అంతా డెయిరీలకు గడ్డిని సరఫరా చేస్తుండటంతో బయట గడ్డి దొరుకుతలేదు. రూ. 30 వేలు పెట్టి వరిగడ్డిని కొని నిల్వ చేసుకున్నాను.’’    
 - శివారెడ్డి, కరీంనగర్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement